ఊహించినట్టుగానే, బీజేపీ బలమెంతో మరోసారి బట్టబయలైంది. ఆ పార్టీ నేతల ప్రగల్భాల్లో వాస్తవమెంతో యావత్ దేశం చూసింది. ఎందుకంటే, మునుగోడు ఉప ఎన్నికపై ఆసక్తి తెలంగాణకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీనికి కారణం కూడా బీజేపీనే. ఒక ఉప ఎన్నికకు ఇంతటి చిత్రాన్ని ఇచ్చి, దానిని పెంచి పోషించింది ఆ పార్టీనే. మునుగోడు ఫలితంతో ఆ పార్టీ తన పరువును తానే జాతీయస్థాయిలో తీసుకున్నట్టయ్యింది.
మునుగోడు వెనుక బీజేపీ పెంచుకున్న ఆశలు చిన్నవి కావు. మరో ఏడాదిలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఉన్నప్పటికీ, కావాలని, దురుద్దేశపూర్వకంగా బీజేపీ ఈ ఉప ఎన్నికను కృత్రిమంగా సృష్టించింది. ఒక వ్యాపార రాజకీయవేత్తను ముగ్గులోకి దింపింది. బదులుగా ఆయనకు భారీ కాంట్రాక్టును ఎర వేసింది. ఆయనతో ఏవేవో కారణాలు చెప్పించి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకున్నది. ఈ విధంగా కృత్రిమంగా ఎన్నికను తీసుకొచ్చినందున.. ప్రజల్లో చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒక్క సహేతుక కారణం లేకుండా పోయింది. అయినప్పటికీ, దీనిని అధిగమించటానికి డబ్బు సంచులు కుమ్మరించటం, టీఆర్ఎస్ శ్రేణులపై భౌతిక దాడులకు దిగటం, సోషల్ మీడియాలో విశృంఖలంగా అబద్ధాలను ప్రచారం చేయటం, టీఆర్ఎస్ ఎన్నికల చిహ్నమైన కారు గుర్తును పోలి ఉండేలా పలువురు అభ్యర్థులకు గుర్తులు వచ్చేలా తెర వెనుక కుట్రలు పన్నటం, చివరికి టీఆర్ఎస్కు ఓటేస్తారని భావించిన వృద్ధ మహిళల చేతుల మీద కమలం గుర్తు గోరింటాకు, టాటూలు వేసి వారి ఓట్లు చెల్లకుండా చేయటం… ఇన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ పన్నాగాలు మునుగోడులో సాగలేదు. ఓటరు కర్రు కాల్చి వాత పెట్టాడు.
ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు పొందటం సోషల్ మీడియాలో భ్రమలను సృష్టించినంత సులువు కాదు. ఈ సత్యం బీజేపీకి ఇప్పటికైనా అర్థమై ఉండాలి. నిజానికి, బీజేపీ తాను కల్పించిన భ్రమల్లో బతికేస్తూ, వాటినే ప్రజలు నమ్మాలని భావిస్తున్నది. తెలంగాణలో ఆ పార్టీకి లభించిన అరకొర విజయాలు కూడా గాలివాటంలో దక్కినవేగానీ.. ఆ పార్టీకి నికరంగా, క్షేత్రస్థాయిలో ఉన్న బలం ఆధారంగా లభించినవి కావు. బీజేపీ తన ఉత్తరాది వ్యూహాన్ని, సోషల్ మీడియా కేంద్రంగా జరిపే ఎన్నికల ప్రచారాన్ని తెలంగాణలో తొలిసారి దుబ్బాకలో అమలులో పెట్టింది. మతపరమైన భావోద్వేగాలను, అబద్ధాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ పార్టీ అభ్యర్థి కూడా పలు ఓటముల తర్వాత ఒక్కసారైనా గెలిపించమని ఓటర్లను ప్రాధేయపడటం కూడా కొంత ప్రభావం చూపింది. ఇన్ని టక్కుటమార విద్యలను ప్రదర్శించినప్పటికీ.. బొటాబొటిగానే బీజేపీ గట్టెక్కింది.
ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఆ నియోజకవర్గం నుంచి పలు పర్యాయాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ రాజీనామా చేసి, బీజేపీలో చేరటంతో వచ్చిన ఎన్నిక అది. అక్కడ బీజేపీ గెలుపు కూడా ఆ పార్టీది కాదు. అభ్యర్థికి ఉన్న స్థాన బలంతో లభించిన గెలుపు. ఆ తర్వాత వచ్చిన రెండు ఉప ఎన్నికలు.. నాగార్జునసాగర్, హుజూర్‌నగర్‌లలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
విజేతలుగా నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు లభించిన ఓట్లు 89,804 (నాగార్జునసాగర్‌లో); 1,13,094 (హుజూర్ నగర్లో). ఈ స్థానాల్లో బీజేపీకి లభించిన ఓట్లు వరుసగా 7,676; 2,639. మొత్తం ఓట్లలో బీజేపీకి లభించిన ఓట్ల శాతం వరుసగా 4.02, 1.31. ఇదీ బీజేపీ వాస్తవ స్థితి. ఆ పార్టీకి తెలంగాణలో ఉన్న అసలు బలం ఇది. కానీ, ఈ వాస్తవాన్ని అంగీకరించలేని బీజేపీ మరోసారి తెలంగాణపై ప్రయోగం చేయబోయింది. అదే మునుగోడు ఉప ఎన్నిక.
ఇక్కడ సామ, దాన, భేద, దండోపాయాలన్నీ అమలు చేసింది. అయినప్పటికీ బొక్కబొర్లా పడింది. టీఆర్ఎస్కు గట్టి పోటీనిచ్చానని బీజేపీ చెప్పుకొంటున్నప్పటికీ.. దాంట్లో వాస్తవం ఏమైనా ఉందా అన్నది పరిశీలించాలి. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కొంత పట్టున్న నియోజకవర్గం ఇది. అప్పటి వరకూ కాంగ్రెస్ నేతగా ఉన్న ఆయనకు అక్కడ కొన్నేండ్లుగా స్థానబలం ఉంది. దాంతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ పార్టీకి అక్కడ క్షేత్ర స్థాయిలో ఎటువంటి బలమూ లేదు. కేవలం అభ్యర్థికి ఉన్న బలమే ఆ పార్టీ బలం. అది మాత్రమే టీఆర్ఎస్కు పోటీని ఇవ్వగలిగింది.
వీటన్నింటి ద్వారా స్పష్టమవుతున్నదేమిటంటే.. బీజేపీకి తెలంగాణలో అంతటి సీనూ లేదు. డైలాగూ లేదు. గట్టి అభ్యర్థులు దొరికినప్పుడు వారి ద్వారా ఏవో ఒకట్రెండు విజయాలు దక్కాయి. అంతేగానీ, అది ఆ పార్టీ వల్ల కాదు. మరి, తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో బీజేపీకి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి సంపన్నులు, కాస్తో కూస్తో ప్రజా బలం ఉన్న వాళ్లు దొరుకుతారా? ఆ పార్టీ నేతలే అంగీకరించే విషయం ఏమిటంటే, రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ పడటం అటుంచి, కనీసం ఉనికి చాటుకునే స్థాయిలో అభ్యర్థులు కూడా బీజేపీకి లేరని. దీనికి స్పష్టమైన ఉదాహరణ.. 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలే. ఆ ఎన్నికల్లో బీజేపీకి 106 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. బీజేపీ ఎన్ని ప్రగల్భాలు పలికినప్పటికీ, మీడియా, సోషల్ మీడియా అండతో ఎంత రెచ్చిపోయినప్పటికీ.. ఆ పార్టీ అసలు పరిస్థితి ఇదే. ఈ నాలుగేండ్లలో దాంట్లో మార్పేమీ రాలేదు కూడా.
బీజేపీ ఓ భ్రమపూరిత వాతావరణం ఆధారంగా రాజకీయాలు చేయటానికి బాగా అలవాటు పడింది. ఇది నడమంత్రపు సిరిలాగా మధ్యలో వచ్చిన అలవాటేగానీ ఆ పార్టీకి (1980లో) పుట్టినప్పటి నుంచీ ఉన్నది కాదు. నరేంద్రమోదీ 2014లో ప్రధానమంత్రి పీఠాన్ని చేపట్టిన తర్వాత ఈ తరహా రాజకీయాలను బీజేపీ మొదలుపెట్టి, అవి కొన్నిచోట్ల ఫలితాలను ఇస్తుండటంతో మరింత ఉత్సాహంతో కొనసాగిస్తున్నది. పశ్చిమబెంగాల్, ఢిల్లీ వంటి కొన్ని రాష్ర్టాల్లో ఈ వ్యూహం ఎదురు తిరిగినా మిగిలిన రాష్ర్టాల్లో బీజేపీకి అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి. దానివల్లే, ఈ వ్యూహాన్ని ఆ పార్టీ బాగా నమ్ముకున్నది. తెలంగాణలో కృత్రిమంగా తీసుకొచ్చిన మునుగోడు ఉప ఎన్నిక కూడా ఇటువంటిదే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తాము తిరుగులేని శక్తిగా ఉన్నామని చెప్పుకోవటానికి, అధికారంలోకి వచ్చేది తామేనని ప్రచారం చేసుకోవటానికి ఈ ఉప ఎన్నికను బీజేపీ సృష్టించింది. అంతేకాదు, బీజేపీ బారి నుంచి దేశాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్యతత్వాన్ని రక్షించటానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటం, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చటం కూడా బీజేపీలో గుబు లు రేపుతున్నది. కేసీఆర్‌ను తెలంగాణ నుంచి బయటకు రాకుండా, ఇక్కడే కట్టడి చేయాలని బీజేపీ భావిస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికను తీసుకురావటం వెనుక బీజేపీకి ఉన్న దురాశలివి. ఈ సందర్భంలోనే, వందల కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొని, తమ పార్టీలోకి మార్చుకోవాలని, తద్వారా టీఆర్ఎస్ నైతికైస్థెర్యాన్ని దెబ్బతీయాలని చూసింది. కానీ, అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇటు మునుగోడు ఓటర్లు ఇద్దరూ బీజేపీకి గట్టి గుణపాఠం నేర్పించారు.
– కె.వి.రవికుమార్