ప్రభుత్వ ఉద్యోగులు..కర్తవ్య నిర్వహణ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ తమ విలువైన జీవితాలను త్యాగం చేస్తుంటారు. చాలామంది సాయంత్రం ఎన్నింటికి ఇంటికి చేరుకుంటారో తెలియదు. కొందరికి సెలవులు, ఆదివారాలు కూడా కరువే. ఇంటికొచ్చినా ఆఫీసు ఫోన్లతో తీరిక లేకుండా తమ కుటుంబాలను చూసుకోలేని అశక్తులు కొందరు ఉంటారు.
మొబైల్, లాప్టాప్లో తమ అధికారులు, ఉన్నతాధికారుల నుంచి వచ్చే మెసేజ్లు, మెయిల్స్ అంటూ ఇంటి వద్ద కూడా ఆఫీసు పని చేసుకునే అభాగ్యులు మరికొందరు. పని ఒత్తిడితో తరచూ కొందరు అనారోగ్యం పాలవుతుంటారు. తమ సొంత బిడ్డల చదువు, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్టించుకునే తీరిక కొందరికి ఉండదు. కానీ వారి సంక్షేమం చూసే కనీస బాధ్యత నుంచి ప్రభుత్వం దూరమవుతున్నది. వారు ప్రభుత్వంలో భాగమనే కఠోర సత్యాన్ని గుర్తించలేకపోవటం దురదృష్టకరం. వారికి జీతాలు ఎక్కువ అనే భావన ద్వారా తమ నివేదికలు, ఉపన్యాసాలు, ఇంటర్వ్యూల్లో ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపిస్తూ వారిపై ప్రస్తుత ప్రభుత్వం ఒక వ్యతిరేక భావాన్ని కలుగజేస్తున్నది.
పెన్షనర్లు..మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ సేవలు అందించి, పదవీ విరమణ నాడు తమకు రావాల్సిన బకాయిలను ఆశిస్తారు. తాము దాచుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు, తమకు లేదా తమ కుటుంబ సభ్యుల అనారోగ్యానికి పెట్టిన ఖర్చుకు సంబంధించిన డబ్బు రాక హతాశులవుతుంటారు. ఇక గ్రాట్యుటీ, కమ్యుటేషన్ లాంటివి ఎప్పుడు విడుదలవుతాయో తెలియని అయోమయ స్థితి నెలకొంటున్నది. కేవలం వారి జీతంలో సగానికి తక్కువ వచ్చే పెన్షన్ డబ్బులతో జీవితాన్ని నడిపిస్తూ తమ కూతురు పెండ్లి లేదా సొంత ఇంటి కలను సాకారం చేసుకుందామని అనుకుంటే అది ఎండమావిలా మారటం మరింత బాధపెడుతున్నది. వయసు మీరుతుండటం, అనారోగ్యం ఆవహిస్తుండటంతో నిస్సహాయ స్థితిలో రోజులు గడిపే పెన్షనర్లు కొంతమంది ఆ పరిస్థితిని భరించలేక బలవన్మరణాలకు పాల్పడటం శోచనీయం.
ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులను బాగా చూసుకుంటామని, వారు తమ కండ్లలాంటి వారంటూ మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ఓట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత ఆ సంగతే మరచిపోయింది. వారితో భేటీ కావటానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులు, పెన్షనర్లకు వెంటనే పెండింగ్ డీఏలు ప్రకటిస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని, ఆరోగ్య కార్డులు ఇస్తామని, ఇతర డిమాండ్లు కూడా పరిశీలిస్తామని నమ్మబలికింది. తీరా గద్దెనెక్కిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కాస్త సమయం కావాలని కోరింది. సహజంగానే ఉద్యోగులు నమ్మి రెండున్నరేండ్ల సమయం ఇచ్చినా సర్కార్కు కనీసం చీమ కుట్టినట్లుగా కూడా లేదు. కాంగ్రెస్ గద్దెనెక్కిన ఈ రెండున్నరేండ్లలో కేవలం రెండు డీఏలు అతి కష్టంగా విడుదల చేసింది. కానీ ఇంకా ఐదు డీఏలు పెండింగ్లో ఉండటం ఉద్యోగులకు బాధతోపాటు ఆర్థిక భారం కలిగిస్తున్నది.
అవసరమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేసైనా ఉద్యోగులకు డీఏలు చెల్లించాలని న్యాయస్థానాలు మొత్తుకున్నాయి. 2023 జూన్ నుంచి ఉద్యోగులకు అమలు కావలసిన పీఆర్సీ గురించి ప్రభుత్వం కనీసం చర్చించడానికి కూడా సిద్ధంగా లేదు. వేతన సవరణ సంఘం కాలాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పొడిగిస్తూ వస్తున్నది. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల విషయంలోనూ అంతే సాచివేత ధోరణి ప్రదర్శించి, చివరకు ఎవరికీ సాధ్యంకాని విధానాన్ని అమలు చేయబోతున్నామని ఆర్భాటంగా సర్కార్ ప్రకటించింది. అంటే ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల సానుభూతి కానీ సానుకూల దృక్పథం కానీ లేవనేది రుజువవుతున్నది.
మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు జేఏసీగా ఏర్పడి తప్పని పరిస్థితుల్లో ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఈనెల 17వ తేదీన నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై, మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు తమ తమ కార్యాలయాల్లో సమావేశాలు జరిపారు. మే 5న మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నాలు వంటి ఆందోళన కార్యక్రమాలతో జేఏసీ ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వంపై శంఖారావం పూరించడానికి సిద్ధమైంది.
సరిగ్గా 24 నెలలు క్రితం పదవీ విరమణ పొందిన వారికి నేటికీ బకాయిలు చెల్లించకపోవడం అలసత్వమా? లేదా అసమర్థతా? ఉద్యోగ వర్గాల పట్ల నిర్లిప్తత, నిర్లక్ష్యభావమా? అనే అనుకోవాల్సి వస్తున్నది. అప్పులు తేకుండా నెల గడవడం లేదు. కానీ ప్రభుత్వం చేసే వృధా ఖర్చుల కారణంగా అనేక సంక్షేమ పథకాలు అటకెక్కుతున్నాయి. ప్రభుత్వం సంక్షేమం నుంచి సంక్షోభం దిశగా శరవేగంగా దిగజారుతున్నదని స్పష్టమవుతున్నది. ఉన్న నిధులను సక్రమంగా వినియోగించడంలో సర్కార్ విఫలమవుతున్నది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను 30 నెలలుగా పరిష్కరించకుండా వారిని మాటలతో హామీలతో మభ్యపెట్టడం ఇంకా ఎంతోకాలం సాగదు.
వారి కుటుంబాలు అరిగోస, ఆక్రోశంతో ఉన్నాయి. వారికి సంబంధించిన 64 డిమాండ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లు ఉన్నాయి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి, కొత్త విధానాన్ని రద్దు చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్లలో ఒకటి. జూన్ రెండవ తేదీ లోపు పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ ప్రధాన డిమాండ్. ఇందుకు అనుగుణంగా మే 5వ తేదీన సామూహిక నిరాహార దీక్షలు, 14న సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నది. ఇకనైనా ప్రభుత్వం కండ్లు తెరిచి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ఇంకా జాప్యం చేస్తే భవిష్యత్తులో వారి నిర్ణయాన్ని తమ ఓట్ల ద్వారా తెలుపవలసి ఉంటుందని చెప్పకతప్పదు.
– శ్రీశ్రీ కుమార్