ఖైరతాబాద్, జూన్ 12 : ఖైరతాబాద్ డబుల్ బెడ్రూం గృహాలకు నీటి కష్టాలు తీర్చేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి నిధులు కేటాయించినా.. జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో ఆ ఫైలు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని హంగులతో ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్‌కాలనీలో నాలుగు బ్లాకుల్లో 210 డబుల్ బెడ్రూం గృహాలను నిర్మించారు. అయితే అప్పటి అవసరాలకు జలమండలి ద్వారా సరఫరా అయ్యే నిల్వ చేసేందుకు భారీ ట్యాంకు, నీటికి ఇబ్బందులు కలుగకుండా అదనంగా బోరు సైతం ఏర్పాటు చేశారు.
కాలక్రమేణా నీటి అవసరాలు పెరగడంతో మరో బోరు అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2024లోఎమ్మెల్యే దానం నాగేందర్‌ను డబుల్ బెడ్రూం గృహ యజమానులు కలిసి తమ నీటి కష్టాలను చెప్పుకోగా, తాను పవర్ బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. తక్షణమే నిధులు కూడా ఇస్తానని చెప్పి.. ఆ తర్వాత ఆ గృహాల వైపు కన్నెతి చూడలేదని గృహ యజమానులు తెలిపారు. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూం గృహాల్లో నీటి కష్టాల గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎంపీ ల్యాడ్స్ పథకం కింద రూ.4.99 లక్షలు కేటాయించారు. కాగా, డబుల్ బెడ్రూం గృహాలకు అదనపు బోరు కోసం ఎంపీ ల్యాడ్స్‌ను నిధులు కేటాయింపునకు సంబంధించిన అధికారిక లేఖ గతేడాది మే 3న జిల్లా కలెక్టర్‌కు అందింది. సీపీ కార్యాలయం నుంచి ఆ ఫైలు తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటీవ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాలయానికి చేరింది.
బోరు వేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అప్రూవ్ చేసి తిరిగి కలెక్టర్ ఆఫీసుకు ఫైలు పంపించాల్సి ఉండగా, ఏడాది పాటు ఆ కార్యాలయంలోనే సేదతీరింది. డబుల్ గృహా యజమానులు సంవత్సరం కాలంపాటు ఆ కార్యాలయం ప్రదక్షిణ చేస్తే కాని ఫైలు ముందుకు కదలేదు. ఎట్టకేలకు అది అప్రూవ్ అయి తిరిగి కలెక్టర్ ఆఫీసుకు చేరగా, అక్కడి నుంచి మరో సిఫారసు లేఖను గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పంపించారు. సదరు అధికారి ఎన్వోసీ ఇస్తే తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తుంది. అయితే ఎన్వోసీ ఇచ్చేందుకు సదరు శాఖాధికారులు తాత్సారం చేస్తుండడంతో ఈ సమస్య మళ్లీ మొదటికొచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికే ఎండా కాలం గడిచిపోయిందని, తక్షణమే ఎన్వోసీ ఇచ్చి బోరు వేసేందుకు మార్గం సుగమమం చేయాలని డబుల్ బెడ్రూం గృహ యజమానులు కోరుతున్నారు.