రాజ్యాంగ నిర్మాణంలో ఎన్నికల కమిషన్ అత్యంత కీలకమైన సంస్థ. ప్రజాస్వామ్యపు నమ్మకాన్ని నిలబెట్టేది, ఎన్నికల ప్రక్రియను స్వతంత్రంగా, పారదర్శకంగా నిర్వహించేది ఇదే సంస్థ. కేంద్రస్థాయి ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తే, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జడ్పీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వంటి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తాయి. కానీ, ఇటీవలి కాలంలో ప్రజల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కమిషన్ల పనితీరు అనేక సందేహాలకు తావిస్తున్నది. రాజకీయ వ్యవస్థలో పెరుగుతున్న పక్షపాత భావన, ప్రభుత్వాల ఒత్తిడి, దుర్వినియోగాలు, ధనబలం-కులబలం ప్రభావాలు ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల కమిషన్‌పై వస్తున్న ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ప్రధానంగా 6 కారణాలు కనిపిసున్నాయి. అవి, 1. రాజ్యాంగ సంస్థలు తమ స్వతంత్రతను కోల్పోవడం, 2. రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా పనిచేస్తున్నాయనే ప్రజాభిప్రాయం, 3. స్థానిక సంస్థల ఎన్నికల్లో పక్షపాతం, 4. డబ్బు – కులబలానికి వంతపాడుతున్న ఎన్నికల కమిషన్, 5. స్వతంత్ర హోదా గల బీసీలను రాజకీయాల్లో తగ్గించే ప్రమాదకర ధోరణి, 6. నామినేషన్ వేసిన వారిని, వేయాలనుకుంటున్న వారిని బెదిరిస్తున్నా, వారిపై దాడులు చేస్తున్నా, చంపేప్తామని బెదిరిస్తున్నా, కిడ్నాప్‌లు చేస్తున్నా పోలీసు-ఎన్నికల వ్వవస్థలు ఏం చేయకపోవడం లాంటి అంశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ, దాని నియామకాల్లో ప్రభుత్వ పాత్ర ఉండటంతో పూర్తిస్థాయి స్వతంత్రతపై ప్రజల్లో సందేహాలు పెరుగుతున్నాయి. అధికార పక్షానికి అనుకూలంగా నియమాలుండటం, ఎన్నికల షెడ్యూల్ నిర్ణయం, రిజర్వేషన్ల కేటాయింపు, ప్రవర్తనా నియమావళి అమలులో ఉదాసీనత వంటి అంశాల్లో అధికార పార్టీకి కమిషన్ వంతపాడుతున్నది. అధికార పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో త్వరగా, సర్కార్ చెప్పిన సమయంలో ఎన్నికలు నిర్వహించడమే ఎన్నికల కమిషన్ ముఖ్య లక్ష్యమయ్యింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో రిజర్వేషన్ల కేటాయింపుల్లో అవకతవకలు, మద్యం, ధన ప్రవాహానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఓటర్లను కులం పేరుతో, ధనం పేరుతో, వివిధ ప్రభుత్వ పథకాలను-రాయితీలను-పనుల పేరుతో ఓట్లు వేయాలని బెదిరిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో నిలబడుతున్న అభ్యర్థుల నామినేషన్లను సాంకేతిక కారణాల పేరిట తిరస్కరిస్తున్నారు. ఇలాంటి చర్యలు ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి.
ప్రపంచ దేశాల్లోకెల్లా మనది గొప్ప రాజ్యాంగమని అందరూ చెప్తుంటారు. అలాంటిది మన రాజ్యాంగ సంస్థలు రాజకీయ ఒత్తిడికి లోనవడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పే కదా? నిజాయితీగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సంస్థలు.. ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం పనిచేస్తున్నాయనే భావన ప్రజల్లో ఏర్పడితే, అది రాజ్యాంగ ఆత్మకు విద్రోహమే కదా?
కొన్నిసార్లు అగ్రకులాల మనసులకనుగుణంగా ఓటు వేసిన ఈ పీడిత కులాలకు నేడు ఓటు విలువ తెలిసివచ్చింది. అందుకే అగ్రకులాల పార్టీలు ఈ చైతన్యాన్ని తట్టుకోలేక తమ నాయకుల కోసం ఎన్నికల కమిషన్‌ను పార్టీ కమిటీలుగా మార్చేశాయి. నేడు ఈ భయం గ్రామీణ ప్రాంతాల్లో మరింత పెరిగింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయి నిఘా పెట్టడం మానేసింది. చాలా సందర్భాల్లో అధికార పార్టీ ప్రభావం, కులాల నియంత్రణ, అధికార యంత్రాంగపు ఒత్తిళ్లు, పెద్ద-చిన్న పోలీసు బాస్‌లు, తహసీల్దార్, వీఆర్వో స్థాయిలో జోక్యాలు, గ్రామీణ నాయకులు – పైకులాల బెదిరింపులు లాంటివన్ని తమ దృష్టికి వచ్చినా ఎన్నికల కమిషన్ స్పందిండచం లేదు. దీంతో స్వతంత్ర దృష్టిగల రాజకీయ పక్షాలు ప్రజాస్వామ్యం లేదనే భావనకు వస్తున్నాయి. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తే మరో శ్రీలంక, నేపాల్, మయన్మార్ లాంటి సంక్షోభం వస్తుందనేది పాలకులు- పాలనా యంత్రాంగం గ్రహించాలి. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక పవిత్ర హక్కు అని చెప్పే అన్ని పక్షాలు ఈ హక్కును కులంతో, డబ్బుతో, తిండితో, మద్యంతో కొంటుంటే ప్రజలు దేనిమీద విశ్వాసముంచాలి?
ఎన్నికల కమిషన్ కేవలం పెద్ద నాయకులపై నిఘా పెట్టి, మూడవ – నాల్గవ శ్రేణి నాయకుల ఆర్థిక విచ్చలవిడితనాన్ని పట్టించుకోవడం లేదు. పర్యవసానంగా బీసీ-ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇది గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నది. మెజారీటి ప్రాంతాల్లో కుల, మత, స్థానికత ఆధారంగా అభివృద్ధి పథకాలను చూపించి, ‘మన వారిని’ గెలిపించాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఇది ఎన్నికల నిష్పాక్షికతకు వ్యతిరేకం.
నిజానికి గ్రామీణ స్థాయిలో ప్రజలు తమ అభివృద్ధిని తామే నిర్ణయించుకోవాలి. అయితే, ఈ స్వేచ్ఛను ఎక్కడ వెతుక్కోవాలో నేడు ఎన్నికల కమిషనే చెప్పాలి. కమిషన్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అవిశ్వాసం సాధారణ విషయమేమీ కాదు. ఈ సంస్థ స్వతంత్రంగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షానికి అనుకూల ధోరణి కనిపిస్తున్నది. ధన నియంత్రణలో ఎన్నికల కమిషన్ విఫలమైంది.
స్వతంత్ర బీసీ అభ్యర్థులపై కొందరు ఒత్తిడి చేస్తున్నా ఏం చేయలేకపోతున్నది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఎన్నికల కమిషన్ శక్తివంతమైన నిఘా వ్యవస్థను రూపొందించుకోవాలి. కుల, మతపరమైన ప్రలోభాలను నియంత్రించాలి. స్వతంత్ర అభ్యర్థుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. ఎన్నికల కమిషన్ స్వతంత్రతకు ప్రజాస్వామ్య వ్యవస్థ బలం లాంటిది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ స్వతంత్రతను కాపాడుకోకపోతే ప్రజాస్వామ్య పునాదులు కదులుతాయి.