మన చెపుతుంది
చెట్టు తన మూలాలను పండులో దాచి భావి తరాలకు అందిస్తుంది. మనిషి తన మూలాలను జన్యువుల్లో దాచి వారసులకు అందిస్తాడు. అలాగే ఈ భూమి కూడా. తను ఆశ్రయమిచ్చిన అనేకానేక జీవుల, జాతుల స్మృతులకు మనకోసం మట్టి పొరల్లో దాచి ఉంచుతుంది. భూమితల్లి మనమెవరమో, ఘనత ఎంతటిదో తవ్వేకొద్దీ తెలుస్తుంది. మృణ్మయ పాత్రల వెనుక స్వర్ణమయ చరిత్ర దాగి ఉంటుంది. తెలంగాణది అలాంటి కథే..
మానవ జాతి వికాసంలోని ప్రతి దశలో తెలంగాణ పాత్ర ఉన్నది. ఇక్కడే గోదావరి తీరంలో రాకాసిబల్లులు ఆడుకున్నాయి. ఖగోళ విజ్ఞాన పొద్దుపొడుపులోనే కాలాన్ని గణించామనడానికి కృష్ణా నది తీరంలోని ‘నిలురాళ్ళు’ సాక్ష్యం చెబుతాయి. తెలంగాణ ఉక్కుతోనే అరేబియాలో ఖడ్గాలు ఖణఖణమన్నాయి. కిన్నెరసాని సానువుల్లో శిల్పకళ శైశవదశ సోయగాలు అబ్బురమనిస్తాయి. ఈ గడ్డపై చరిత్ర పూర్వయుగంలోని మన ఆదిమానవుల బులిబులి నడకల అడుగుజాడలున్నాయి. రాతి గుహలలో రంగు బొమ్మలను చిత్రించిన కళాపిపాస మనది. తెలంగాణ గడ్డ చారిత్రక సంపదల నేలమాళిగ. మన భూమిపొరల్లో నిక్షిప్తమై ఉన్న చారిత్రక పుటలను పాఠకులకు ముందుంచడానికి ‘నమస్తే తెలంగాణ’ నడుం బిగించింది. నేటి నుంచి ప్రతి సోమవారం మన ఘన చరిత్రను ధారావాహికంగా అందిస్తున్నది.
‘మట్టిని ప్రశ్నించు, అది జవాబు చెపుతుంది..’ అబీజ్యా క్రోశే అనే ఫ్రెంచ్ పురాతత్వవేత్త 1866లో చెప్పిన మాట ఇది. మనం మన జ్ఞాపకాల్ని మెదడులో దాచుకున్నట్టు, భూమి తన పొరల్లో చరిత్రను నిక్షిప్తం చేసుకుంటుంది. మట్టి నుంచి మనిషి వరకు పెనవేసుకున్న సంస్కృతిలో అది ప్రతిబింబిస్తూ ఉంటుంది. నేల తనలో పొరలు పొరలుగా కాలాన్ని ప్రక్షిప్తం చేసుకుని మనకోసం దాచిన ఆధారాల్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే ‘పురావస్తు శాస్త్రం’. ఇకడి నేల పుట్టుకనుంచి, ఆది మానవుల పరిణామ క్రమం నుంచి, మొరటైన ఆయుధాలు, పని ముట్లనుంచి, తొలి వ్యవసాయం మొదలై, తొలి గ్రామీణ ఆవాసాలూ, గ్రామాలూ.. క్రమేణా జనపదాలు, మహాజనపదాలు, రాజ్యాలు, సామ్రాజ్యాలు ఏర్పడ్డ క్రమం, ఘటనలూ, ఘట్టాలూ… అంతా మన భూమి రికార్డు చేసింది. వాటిని సక్రమంగా చదవటమే మనం చేయాల్సిన పని. పురావస్తు శాస్త్ర ఆధారంగా తెలంగాణ చరిత్ర రచన చేసే ఈ ప్రయత్నం ఇప్పటి వరకు జరిగిన పరిశోధననల్నీ, కొత్తగా వెలుగులోకి వస్తున్న ఆధారాల్నీ మీ ముందుకు తెస్తున్నది.
1947తర్వాత భారత దేశంలో చరిత్ర గురించి విస్తృత చర్చలు జరిగిన అతికొద్ది ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. ఈ నేల చరిత్రపై చర్చ ఆధునిక కాలానికే పరిమితం కాలేదు. ప్రాచీన చరిత్రపై కూడా చర్చలు, వివాదాలు, పరిశోధనలు ముమ్మరంగా జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. ప్రాచీనత, సాంసృతిక వారసత్వం ఒక ప్రాంత అస్తిత్వ పతాకను ఎత్తి పడుతుంది. కాబట్టి దానిని వక్రీకరించడం లేదా విస్మరించడం, ఆ ఆధిపత్య ధోరణి ఇంకొంచెం ముదిరి మన చరిత్రను తొక్కి పెడుతూ సిద్ధాంతీకరించడం పరాయి పాలనలో సాగింది. తెలంగాణ చరిత్ర మధ్య యుగాల్లో ప్రారంభమైనట్టు, తొలి నుంచి మనం సాంసృతికంగా ఒక మెట్టు తకువని లేదా ఇంకో ప్రాంతానికి అనుబంధంగానే ఎదిగామనే తప్పుడు ప్రచారం నడిచింది. కొందరు నిజమైన చరిత్రకారులు మాత్రం ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ చరిత్రను ఎత్తి పట్టారు.
తవ్వే కొద్దీ.. తెలంగాణలో నిక్షిప్తమైన చరిత్ర విస్మయానికి గురి చేస్తున్నది. మనకు తెలియని ‘మన చరిత్ర’ ఇంత ఉందా అనిపిస్తున్నది. పురావస్తు తవ్వకాలలో దొరికిన ఆధారాలు ప్రతీదీ ప్రత్యేకంగానే, చరిత్రను తిరిగి రాయాల్సిన పరిస్థితిని ముందుకు తెస్తున్నది. కోటిలింగాలలో దొరికిన నాణేలు అప్పటి వరకు మనం మాట్లాడుకున్న శాతవాహనుల కంటే ముందటి కాలాన్ని మన ముందుంచింది. దాంతో శాతవాహనుల ప్రస్థానం ఎకడ నుంచి మొదలైందన్న చర్చకు జవాబు దొరికింది. ఉత్తర తెలంగాణలోని మధ్యగోదావరి నుంచి కృష్ణాలోయ వరకు శాతవాహనుల ప్రస్థానానికి ఆధారాల్ని తనలో దాచుకున్న ఈ నేల మన చరిత్రకు స్పష్టమైన రూపాన్నిచ్చింది. మన ఊళ్ళలోని పాత మట్టి ఇళ్ల గోడల్లో, పాటిగడ్డల్లో,
పొలిమేరల్లో దొరికే చిట్టెం, తొలి చారిత్రక యుగం నుంచి మధ్యయుగాల వరకు తెలంగాణ గ్రామాల్లో విలసిల్లిన ఇనుము, ఉకు పరిశ్రమకు ఆనవాళ్ళుగా మిగిలినయి. మన తరతరాల లోహవిజ్ఞానం మధ్యయుగం నాటికి ప్రపంచంలోని ఎన్నో కరవాలాలకు పదునును, పోత పోసి తయారు చేసుకున్న ఫిరంగులకు పటిష్ఠతను ఇచ్చింది.
నేల పొరల్లో చరిత్ర పుటలు
సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో దొరికిన రోమన్ నాణేలు ఏమి చెపుతాయి? హైదరాబాద్ చరిత్ర గోలొండతో మొదలైందా లేక ఈ నగరంలో ప్రవహించే మూసీతీరం సుమారు 1500 ఏండ్ల క్రితమే ఒక మహా బౌద్ధ విహారానికి నెలవైందా? ధర్మ, బుద్ధ, నాగ పదాలతో మొదలయ్యే గ్రామాల తొలి నాటి చరిత్ర లో ఏ మతం ఉంది? జన, జిన వంటి పేర్లు దేనికి సంకేతం? కర్ణాటకలోని శ్రావణబెళగొళలోని గోమటేశ్వరుడికీ మన బోధన్‌లోని బాహుబలి విగ్రహానికీ ఉన్న సంబంధం ఏమిటి? నాగార్జున సాగరం కింద మునిగిన ఏలేశ్వరం ఎన్ని చారిత్రక కాలాలకు సాక్షిగా నిలిచింది? అమరావతీ శిల్పశైలికి పరాకాష్టగా నిలిచిన ఫణిగిరి తోరణాలు, శిల్పాలు, ఎన్నిగాథల్ని రమణీయంగా చెపుతున్నాయి? కొండల్లో మలుపులు తిరుగుతున్న కృష్ణానదీలోయ దేశంలోనే తొలి వైదిక ఆలయాలకు ఏ రకంగా నెలవైంది?
అలంపూర్ నవబ్రహ్మల ఆలయనిర్మాణ సౌందర్యం నుంచి కాకతీయుల నాగినులు, అలసకన్యలు, త్రికూటాలయాలు, సజీవత్వం తొణికిసలాడే నందులు, కందూరు చోడుల ఆలయాల్లోని శాస్త్రవిజ్ఞానం- ఇలా ఈ నేల ఎన్ని శిల్ప రీతులకు, నిర్మాణ నైపుణ్యాలకు జన్మనిచ్చింది? నాగ దేవతల విగ్రహాలు, అమ్మ దేవతలు, భైరవులు, వీరభద్రులు లేని ఊరు ఉంటుందా? పొలాల మధ్య, గట్ల మీద పడిఉన్న వీరగల్లులు ఏ వీరగాథల్ని చెపుతాయి? క్రీస్తు పూర్వపు బ్రాహ్మీ లిపి నుంచి నిన్నమొన్నటి తెలుగువరకు తెలంగాణ గుట్టల్లో, పొలాల్లో, పల్లెల్లో, గుడుల ప్రాంగణాల్లో నిర్లిప్తంగా పడిఉన్న ప్రాకృత, తెలుగు, కన్నడ, సంసృత శాసనాలు ఏ చరిత్రను రికార్డు చేసినాయి?
ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు పురావస్తు శాస్త్రం సమాధానం చెపుతుంది. చరిత్ర రచనకు సహాయం చేసే భౌతిక ఆధారాలన్నీ భూమిలోపలి పొరల్లో కొన్ని, పైనకొన్ని మనకోసం వేచిచూస్తూ ఉంటాయి. సాహిత్య ఆధారాలు చెప్పే చరిత్రను, ఇలాంటి భౌతిక ఆధారాలతో సరితూచినప్పుడే మిథికల్ ఎలిమెంట్(పుకిటి పురాణాలు)ను తీసి చరిత్రను జరిగింది జరిగినట్టుగా చెప్పగలం. వాటిని సరిగ్గా వెతికి పట్టుకొని, శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ, తెలంగాణ చరిత్రను ప్రజలకు అందించడమే ఈ వ్యాస పరంపర లక్ష్యం.
ఎందరో పురాతత్వ వేత్తల శ్రమ ఫలితం
తెలంగాణలో పురావస్తు పరిశోధన బ్రిటిష్ ప్రోత్సాహంతో నిజాం ప్రభుత్వ హయాంలో 1914లో గులాంయజ్దాని నేతృత్వంలో మొదలైంది. నిజాం రాజ్యంలోని తెలంగాణతో పాటు నేటి మహారాష్ట్రలోని మరాట్వాడా ప్రాంతంలో అజంతా, ఎల్లోరా వంటి అద్భుతాల్నీ, హైదరాబాద్-కర్ణాటకలో అశోకుడి శాసనం ఉన్న మాసి, విజయనగర సామ్రాజ్యంలో భాగమైన ఆనెగొంది వంటి చారిత్రక ప్రదేశాల్ని వారసత్వ కానుకలుగా అందించిన చరిత్ర హైదరాబాద్ ఆరియాలజీ శాఖకు ఉన్నది. దకన్ పురావస్తు పరిశోధనకు మరీ ముఖ్యంగా తెలంగాణకు గులాం యజ్దాని చేసిన సేవ అమోఘం. అతని తర్వాత 1940లలో ఖ్వాజా ముహమ్మద్ అహ్మద్.. కొండాపూర్, ఫణిగిరి, వర్ధమానుకోట వంటి అనేక చారిత్రక స్థలాల్ని వెలుగులోకి తెచ్చాడు. ఇప్పుడు కృష్ణా నదిలో మునిగి పోయిన ఏలేశ్వరంలో చరిత్ర పూర్వయుగం నుండి కాకతీయులు, బహమనీల వరకు ఉన్న చరిత్రను ఆర్.సుబ్రహ్మణ్యం, అబ్దుల్ వాహెద్ఖాన్లు తవ్వి తీశారు.
1950లలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ
తర్వాత ఆరియాలజీ శాఖకు నేతృత్వం వహించిన యన్. రమేశన్ వంటి ఐఏఎస్ అధికారులు పురావస్తుశాఖను తీర్చి దిద్దారు. అదే క్రమంలో వి.వి కృష్ణశాస్త్రి గురించి మాట్లాడుకోవాల్సి ఉంది.
మూడు దశాబ్దాల పాటు నేటి జరిగిన తవ్వకాల్లో ఆయన కృషి ఆయనకు ‘డిగ్గర్’ అంటే ‘తవ్వే వాడు’ అనే పేరును సంపాదించి పెట్టింది.
పురావస్తు శాఖలో ఉద్యోగం చేయకున్నా తెలంగాణ చరిత్రలో తొలి అధ్యాయం అయిన చరిత్ర పూర్వ దశ (ప్రీ హిస్టరీ)ని, తొలి చారిత్రక యుగాన్ని ఒక ఉద్యమంలాగా పరిశోధించిన పురాతత్వవేత్త ఠాకూర్ రాజారామ్ సింగ్. బాసర నుండి భద్రాచలం వరకు కాలికి బలపం కట్టుకుని తిరిగి రాతి యుగపు పనిముట్లు మొదలు శాతవాహన పట్టణాలను బయట పెట్టడంలో ఆరియాలజీ శాఖకు సమానంగా ఒక సంస్థలాగా శ్రమించాడు. ఇప్పుడు మనం తెలంగాణ తొలినాళ్ళ చరిత్రను ఠాకూర్ రాజారామ్ సింగ్ నిర్మించిన పునాదుల పైనే చూస్తున్నాం. వృత్తిరీత్యా వకీలుగా, పెద్దపల్లి నివాసిగా ఉంటూ తెలంగాణకు ఆయన చేసిన సేవ అనితర సాధ్యం.
శాసనాల శాస్త్రిగా ప్రఖ్యాతమైన బి.యన్ శాస్త్రి జిల్లా సర్వస్వాలను, చరిత్ర సంపుటాలను, అసంఖ్యాక శాసనాలను అందించారు. నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెమే విష్ణుకుండినుల రాజధాని ఇంద్రపాలనగరమని, తుమ్మల గూడెం రాగిరేకుల ద్వారా నిరూపణ చేయడానికి ఆయన పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ‘విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి’ వంటి సంస్థలు, మానవల్లి రామకృష్ణ కవి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, దూపాటి వెంకట రమణా చార్యులు, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, నేలటూరి వెంకటరమణయ్య, గడియారం రామకృష్ణ శర్మ, పి.వి. పరబ్రహ్మ శాస్త్రి, ఎన్.ఎస్. రామచంద్రమూర్తి వంటి వారు చేసిన శాసనపరిశోధన, రాగిరేకులు, శిలాశాసనాలపై ఉన్న రాతల్లో చరిత్రను వెతికి పెట్టినయి. తెలంగాణకు పణశాస్త్రం (నాణేల అధ్యయనం)లో ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన డా. దేమె రాజారెడ్డి చేతిలో పడి ‘గోబద’ నాణెం నుండి ‘హాలీ సికా’ల వరకు తమ ఉనికిని చాటుకున్నాయి. వీళ్ళే కాదు ఇంకెందరో ఔత్సాహిక పరిశోధకులు, పురావస్తు విభాగంలో పని చేసి పేరుకు నోచుకోని వ్యక్తుల శ్రమ కూడా ఇంతటి పురావస్తు నిధిని సమకూర్చింది. తెలంగాణ పురాతత్వచరిత్రను సమున్నతంగా నిలిపింది.
ఈ పరిశోధనల వారసత్వంగా, కొనసాగింపుగా ఇప్పుడు జరుగుతున్న తవ్వకాలు, పరిశోధనలు వారం వారం ఒక చారిత్రక క్రమంలో మీ ముందుంచే ప్రయత్నం ఇది. ఇంత కాలం మన గాథ ఒక విస్మృత చరిత్ర, వివక్షకు గురైన చరిత్ర. అస్తిత్వ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కాబట్టి మన పురాతత్వ చరిత్రను డాక్యుమెంట్ చేసుకొని ఆ వారసత్వాన్ని మనమూ, మన ముందు తరాలూ నిలుపుకోడానికి చేస్తున్న ఈ ప్రయత్నం వారం వారం మీ ముందుంటుంది. ఇప్పటి నుంచి వేల ఏళ్ళ తెలంగాణ చరిత్రను తెలుసుకునే మన ప్రయాణం నేల పొరల్లో, నదీ తీరాల్లో, కొండ గుహల్లో, పల్లెల్లో, పురావస్తు తవ్వకాల్లో, ఈ ఆధారాల్ని భద్రపరుచుకున్న మ్యూజియంలలో, నిరాటంకంగా ప్రవహించే నదిలాగా సాగనుంది.
(వ్యాసకర్త: చరిత్ర, పురావస్తు పరిశోధకులు)
ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000