ఇది ‘హై’ధరా ‘బాధ’ బుక్ ఫెయిర్ కానే కాదు
అచ్చంగా ఫెయిర్ ప్రైస్ బుక్ షాపుల మేళ!
ఇది దిశానిర్దేశక డిసెంబర్ నెల
బతుకు మార్గం చూపుతూ
మన శిరం శిశిరం రాల్చుకుని
వసంతమై విరిసే మార్గశిరం
అజ్ఞాన భరితమైన ఎదల మీదికి
తెలివిగా బాణాలు సంధించే పుస్తక ధనుర్మాసం
వడ్లలో ఎన్ని రకాలో
ఇక్కడ వయ్యిలలో అన్ని రకాలు
గుడ్డెద్దులు చేలో పడ్డట్లుండదిక్కడ
బుద్ధి ఎడ్లు వేలో పడ్డట్లే వుంటుంది
ఇక్కడి పూల బుక్కుల పరిమళాలతో
కంపుగొట్టే దుర్గంధం ఇట్టే మాయమౌతుంది
ఇక్కడి కవితా కథా కుంపటులతో
గజగజ వణికించే చలి తోకముడుస్తుంది
ఏ పిల్లనగ్రోవులూదకుండానే
ఎవరి దుస్తులు దొంగిలించకుండానే
ఇది.. ఏటేటా
పాఠక గోప గోపికల్ని పరవశింపజేసే
పరమ పవిత్ర గ్రంథావనం
మురిపించే తల్లుల చనుబాలూ
నడిపించే తండ్రుల చిటికెన వేళ్ళూ
దారిచూపే గురువుల సుద్ద ముక్కలూ
సంచరించే చక్కటి కిటికీలూ
సజీవంగా వెలిగే దివిటీలూ
అన్నీ ఇక్కడే.. ఇక్కడే.
ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు
డబ్బుల గాలాలతో పుస్తక మత్స్యాలు
పట్టుకోగల్గిన విస్తార తటాకం
ఈ చేపల వాసనతోనే
మన పుప్పుస తిత్తులు పుస్తక తిత్తులవుతాయి.
నలిమెల భాస్కర్
97043 74081