e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home ఎడిట్‌ పేజీ ఆపతిల అండగ నిలవడ్డడు

ఆపతిల అండగ నిలవడ్డడు

2021, సెప్టెంబర్‌ 30.. బేస్తారం రాత్రి ఆఫీసయిపోవచ్చింది. అనుకుడు రోగమున్నట్టే కాల్రెక్కలు గజగజా అనుకుతున్నయి. అప్పటిదాన్క మంచిగు న్న నాకు ఒక్కసారి అట్లయ్యేసరికి సల్లసెమ్టలు వుట్టినయి. నిప్పుల కొలిమిల కెల్లి శెకెల్లినట్టే మెల్లగా పెయిలకెల్లి కాక షురువైంది. నన్ను చూసిన నా దోస్తులిద్దరు దగ్గరున్న దవాఖానకు వట్కపోయిర్రు. ఆ దవాఖాన్ల ఉన్న డాక్టర్‌సాబ్‌ చెయ్‌ జూసి, మూడు గోలీలు రాస్తే, ఆ గోలీలిప్పించి నన్ను ఇంటికాడ దించివోయిండ్రు నా సోపతిగాళ్లు. అప్పటిమందం ఆ గోలీలేస్కొని మలుసుక పన్న.

శుక్లారం.. తెల్లారంగనే కన్నారంల ఉండే నరేందర్‌ రావు డాక్టరుకు ఫోన్జేసిన. రాత్రి జరిగిన తతంగం మొత్తం జెప్పిన. సార్‌ చెయ్‌ మంచిది. సార్‌ చెయ్‌ వడంగనే జరం దెబ్బకు జారుతదని నాకు నమ్మిక. జరం జారేందుకు ఏం గోలీలేస్కోవాల్నో ఆ సారు వాట్సాపుల పంపిండు. నాలుగైదు శెద్దర్లు కప్పుకున్నా సలి పాడుగాను ఆగుతనే లేదు. మాపటీలి ఐదు గొడ్తున్నది. ఒక్కటేమొకాన ఫోన్‌ మొత్తుకుంటున్నది. లేసి సూత్తే ఫోన్ల ‘జూలపెల్లి సీను మామ’ అని పేరు వడ్తున్నది. సీను మామది మానకొండూర్‌. ఫోనెత్తిన. ‘హలో అల్లుడూ.. మీ వాడల్నే ఉన్న గనీ నీ రూం దొర్కుతలేదు..’ అన్నడు. ‘అగ్గో.. గిట్ల చెప్పక, చెయ్యక అచ్చినవేంది మామ’, ‘జర్ర నువ్వయితే రా, అచ్చి నన్ను నీ రూముకు తోల్కపో, ముచ్చట తర్వాత చెప్తగని..’ అన్నడు.

- Advertisement -

‘ఆపతి మీద పట్నమొచ్చిన అల్లుడు. ఆ రోగం పాడుగాను అత్తమ్మకు మళ్లొచ్చింది. కన్నారం దవాఖానకు వట్కపోతే నిమ్స్‌ దవాఖానకు తీస్కపోవాలె అన్నరు. తీసుకొచ్చి నిమ్స్‌ దవాఖాన్ల షరీఖ్‌ జేసిన. నిమ్స్‌ దవాఖాన డాక్టర్‌ సార్లు రెండు లక్షల దాన్క ఖర్సయితయంటున్నరు. చేస్కుంటే బతికేటోన్ని, నా దగ్గర గంతెక్కడియి అల్లుడు? లచ్చల కొద్ది అప్పుజేసి దాని పాణాన్ని కాపాడుకుంటొస్తున్న. నీకు మన ఎమ్మెల్యే రసమయి సార్‌ ఎర్కేనట కదా..? కొంచెం ఆ సారుతోని మాట్లాడి నిమ్స్‌ దవాఖాన్ల ఫిరీగయ్యేటట్టు చేపియ్యరాదు..’

‘నువ్వయితే ముందుగాళ్ల నీళ్లు తాగు.. అదేమన్నుంటే నేను చూస్కుంట గని’ అని.. మా ఎమ్మెల్యే రసమయన్నకు ఫోన్‌ గల్పిన. పీఏనో, గన్‌మెనో ఎత్తి, ‘హలో.. ఎవలు మీరు..?’ అన్నడు. ‘అన్న నాది మానకొండూరే.., ఓ సారి అన్నకియ్యరాదు, కొంచెం ఆపతి ముచ్చట చెప్పేదుంది..?’, ‘సార్‌ అసెంబ్లీలున్నడు, అయిపోయినంక చెప్తా’ అని ఫోన్‌ కట్జేసిండు. ‘మామ.. మన ఎమ్మెల్యే అసెంబ్లీలున్నడట. మళ్లా రాత్రి ఫోన్జేస్తా.. నువ్వయితే పోయి అత్తమ్మను చూస్కోపో..’ అని సీను మామను దవాఖానకు తోలిన.

రాత్రి పది గొడ్తున్నది. మళ్లోసారి ఎమ్మెల్యేకు ఫోన్‌ చేద్దు నా..? అని మనుసులనుకుంటున్న. ఇంతల ఫోన్‌ రానే అచ్చే రసమయన్న నుంచి. ఫోనెత్తి.. ‘హలో అన్నా..’ అంటే ‘చెప్పు తమ్మీ’ అన్నడు. సీను మామ ఆపతి ముచ్చట మొత్తం జెప్పిన. ‘అన్నా.. నాకు ఫుల్లు జరమొచ్చిందే.. మంచం మీంచెల్లి లెవ్వలేకుండున్న. నేనైతే ఎటూ తిర్గలేను. ఇగ దవాఖాన్ల సీను మామ ఒక్కడే ఉన్నడు. ఉన్నా.. ఆయనకు ఈ పట్నంల ఎటు తిరుగుడో తెల్వదు, కొం చెం ఎట్లనన్న జేసి ట్రీట్మెంట్‌ ఫిరీగ చేపియ్యరాదే, నిన్ను ఎల్లకాలం యాజ్జేస్కుంటరు’ అన్జెప్పిన.

‘తమ్మీ.. నువ్వేం రంధి వెట్టుకోకు. రేపు గాంధీ జయంతి, ఎల్లుండైతారం. ఈ రెండ్రోజులు పనికాదు. పేషెంట్‌ వివరాలు నాకు పంపు, నేన్జూస్కుంటా’ అని మాటిచ్చిండు. ‘ఎమ్మెల్యే సార్‌ వాళ్ల పీఏను తోలిండు. అన్ని పనులు ఆయనే చేస్కుంటున్నడు. రేపటివరకు ఫీరిగయ్యేటందుకు లెటర్‌ తెస్తా అని అత్తమ్మది పోటువా, ఆధార్‌, తెల్లరేషన్‌ కార ట్లు వట్కపోయిండల్లుడు’ అని ముసుగేసుకొని పడుకున్న నాకు సోమారం పొద్దుగాల్నే ఫోన్జేసిండు సీనుమామ. ‘సరే మామ ఇగ నువ్వు బేఫీకర్‌గా ఉండు పనయినట్టే లెక్క’ అని భరోసిచ్చినా.

బుధవారం.. పొద్దుగాల తొమ్మిది గొడ్తున్నది. ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసరాజు నుంచి ఫోన్‌.. ‘అన్నా.. జూలపల్లి రజితది ఎల్‌వోసీ లెటర్‌ అయిపోయింది. నిమ్స్‌ దవాఖానకు అస్తున్నా, నువ్వున్నవా..? దవాఖాన్ల’ అన్నడు. ఆ రోజే లేసి కొంచెం తిరుగుతున్న. నేను నిమ్స్‌ దవాఖానకు పొయ్యేసరికి శ్రీనివాసరాజు దవాఖాన్ల ఎల్‌వోసీ లెటర్‌ వట్టుకొని రెడీగున్నడు. లక్షా యాభై వేల రూపాల ఎల్‌వోసీ లెటర్‌ను ఇద్దరం కల్సి సీను మామ చేతిల వెట్టినం. ఆ లెటర్‌ సూడంగనే సీనుమామ కంటిపొంటి నీళ్లు కారినయి. ఆయన్ను పక్కకు కూకోవెట్టి, ఊకోవెట్టి ఇన్ని నీళ్లు తాగిపిచ్చినం.

‘2009 ముచ్చట.. ఇప్పట్లెక్కనే అప్పుడు గూడా లివర్‌ ఖరాబై అత్తమ్మకు కడుపుబ్బింది, కాల్రెక్కలు ఉబ్బినయి. ఇదే నిమ్స్‌ దవాఖాన్ల షరీఖ్‌ చేస్తే తొంభై వేల రూపాల బిల్లయింది. అప్పు తెచ్చి మరీ కట్టిన. అప్పుడు తెచ్చిన అప్పుకు ఇంకా మిత్తి కడ్తున్నా. నాడు ఎవ్వల్గూడ గిసొంటి సాయం చేయకపాయె. నిజంగ చెప్తున్న అల్లుడు ఇయ్యాళ్ల నిరుపేద అయిన నాకు న్యాయం జరిగింది. ఇది కేసీఆర్‌ సార్‌ పుణ్యమే అనుకుంటా కంటిపొంటి కారుతున్న కన్నీళ్లను తూడ్సుకున్నడు సీనుమామ.

అప్పుడే రసమయన్న నుంచి ఫోనొచ్చింది, ఫోనెత్తిన. ‘తమ్మీ లెటర్‌ అందిందా..?’, ‘అన్నా.. నువ్‌ జేసిన మేలు ఎప్పటికి మర్సిపోనే, ఒక్క నిరుపేదకు న్యాయం జేసినవే..’, ‘నాదేముంది తమ్మీ.. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌ దయ వల్లనే జరిగింది. పేదలంటే ఆయనకు పాయిరం కావట్టే వాళ్ల కోసం, ఏటా సీఎంఆర్‌ఎఫ్‌ పథకం కింద కోట్ల రూపాల నిధులు విడుదల చేస్తున్నడు. గిట్ల ఆపతిలున్న పేదలను ఆదుకుంటూ అండగా నిలవడ్తున్నడు’అని సీఎం కేసీఆర్‌ను తల్సుకున్నడు.

గడ్డం సతీష్‌
99590 59041

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement