సిరిసిల్ల టౌన్, జనవరి 12 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో కార్మికక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ముగ్గుల పోటీలు పండుగలా సాగాయి. మొదటి రోజు 16 వార్డుల్లో పోటీలు నిర్వహించగా, వీధులన్నీ సప్తవర్ణాలతో మెరిసిపోయాయి. వాడవాడల నుంచి వందల సంఖ్యలో యువతులు, మహిళలు ఉత్సాహంగా తరలివచ్చి.. రోడ్లపై అందమైన రంగవల్లులు వేశారు. బీఆర్ఎస్పై అభిమానంతో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను తెలిపేలా యవతులు ముగ్గులు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్మన్ జిందం చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై, ముగ్గులను పరిశీలించారు. అనంతరం ఆయా వార్డులలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటు పోటీలలో పాల్గొన్న వారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు.