నిర్మల్, జనవరి 12(నమస్తే తెలంగాణ) : సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. పగటి పూటే తారలు దిగి వచ్చినట్టుగా.. నింగికి నిచ్చెన వేసినట్టుగా.. ఎగిరే రంగురంగుల పతంగులు కనువిందు చేస్తాయి. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. పండుగకు ముందు పట్టణాలతోపాటు పల్లెల్లోని దుకాణాలు పతంగుల కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పతంగులను ఎగురవేసేందుకు వినియోగించే దారాలు మనుషులు, పక్షులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల ఆదిలాబాద్‌లో ద్విచక్ర వాహనదారుడి మెడకు మాంజాదారం చిక్కుకొని తీవ్ర గాయాలపాలైన ఘటన చోటు చేసుకున్నది. చైనా మాంజాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ మేరకు వారం రోజులుగా పోలీసులతోపాటు అటవీ అధికారులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
నిర్మల్, భైంసా, ఖానాపూర్లతోపాటు మండల కేంద్రాల్లోని విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన తనిఖీల్లో చైనా మంజాతో గల 32 రకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుకాణ నిర్వాహకుడు ఎండీ అస్లాంపై కేసు నమోదు చేశారు. అలాగే నిర్మల్ పట్టణంలోని బస్టాండ్, నారాయణరెడ్డి మార్కెట్, పాత బస్టాండ్ ప్రాంతాల్లోని దుకాణాల్లో జిల్లా అటవీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు దుకాణాల్లో చైనామాంజా తరహాలో ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజాను విక్రయించిన వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ప్రాణాలకే ప్రమాదం
ఎత్తయిన భవనాలు, అపార్టుమెంట్ల పైనుంచి పతంగులను ఎగుర వేసినప్పుడు ఈ మాంజాదారాలు చెట్ల కొమ్మలు, వి ద్యుత్ తీగలకు చిక్కి రోడ్డుపై వేలాడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చైనా మాంజాను నైలాన్, సింథటిక్ ఫైబర్‌తో త యారు చేస్తారు. దీనికి అదనంగా గాజుపొ డి, లోహచూర్ణం పూతను పూయడంతో అత్యంత పదునుగా, గట్టిగా ఉంటుం ది. ఈ మాంజాదారాన్ని ఉపయోగించి పతంగిని ఎగరేసి ఇతరుల పతంగి దారాలను తెంపడం సులువుగా మారుతుంది. అం దుకే చాలామంది పిల్లలు, పెద్దలు చైనామాంజాను ఉపయోగించి పతంగులను ఎగరవేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ దారంతో పతంగులు ఎగురవేసే క్ర మంలో పక్షులు, చిన్నపిల్లల మెడకు చుట్టుకుంటే మెడ భాగం తెగిపోతుంది.
ఈ కారణంగానే చైనామాంజా విక్రయాలను 2016లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధించింది. మాంజాలు విక్రయించొద్దని, నిషేధం ఉందని పోలీసులు ప్రచారం చే స్తూ, తనిఖీలు చేస్తున్నప్పటికీ విక్రయాలు ఆగడం లేదు. చైనా మాంజాలు అమ్మడం లేదంటూ పతంగుల షాపు నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. మరోవైపు రహస్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. తాజాగా నిర్మల్ కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల జిల్లాలకు హోల్‌సేల్‌గా సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పెల్లిలో నాలుగేళ్ల బాలుడు శ్రీహాన్ మెడకు చైనామాంజా చుట్టుకొని తీవ్రగాయాలు కావడంతో అక్కడి పోలీసులు రంగంలోకి దిగి మాంజాను విక్రయించిన వ్యాపారి షేక్ సిద్ధిక్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో ఆయన నిర్మల్ పట్టణానికి చెందిన ఎండీ ఫిరోజ్‌ఖాన్ వద్ద కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. దీంతో నిర్మల్ పోలీసుల సహకారంతో ఫిరోజ్‌ఖాన్‌ను అరెస్టు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఫిరోజ్‌ఖాన్ వద్ద భారీగా నిల్వ ఉంచిన చైనామాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జాగ్రత్తలు..
విక్రయిస్తే చర్యలు..
చైనామాంజా వినియోగంతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. గతంలో పలువురు ద్విచక్ర వాహనదా రుల మెడకు చుట్టుకొని తీవ్రంగా గాయపడడం, మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకే చైనామాంజాను నిల్వ చేయడం, విక్రయించడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఎవరైనా విక్రయదారులు నిల్వ చేసిన, అమ్మిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు వినియోగించకుండా అప్రమత్తం చేయాలి. నిషేధిత చైనామాంజా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు తెలియజేయాలి.
– డాక్టర్ జి.జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్