హిమంత బిశ్వ శర్మ అస్సాం కాంగ్రెస్ నేత. 2015లో బీజేపీలో చేరిండు. సెప్టెంబర్‌లో ఆయన ఏఎన్ఐకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ.. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కొత్తలో వింత అనుభూతికి లోనయ్యానని చెప్పారు. కాంగ్రెస్‌లో హైరార్కీ, ప్రొటోకాల్ ఎక్కువనీ, బీజేపీల అవేవీ ఉండవని అభిప్రాయపడ్డరు. ఒడిశాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పెద్ద పెద్ద నాయకుల పక్కన కూర్చొని తాను, పెమా ఖండు భోజనం చేశామని, కాంగ్రెస్‌లో అయితే ముఖ్యనేతల ఇంటి వరండా దాటి లోపలికి వెళ్లడమే కష్టమని అన్నరు.
ఇటీవలే ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అమిత్ షా గ్వాలియర్ వెళ్లి సింధియాల రాజ ప్రాసాదాన్ని, మ్యూజియాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా అమిత్ షా కూర్చుని విజిటర్స్ బుక్‌లో ఏదో రాస్తుండగా, గ్వాలియర్ ‘మహారాజు’ జ్యోతిరాదిత్య సింధియా, ఆయన కుమారుడైన యువరాజు అత్యంత వినయంగా, విధేయంగా నిలబడ్డ దృశ్యమది. జ్యోతిరాదిత్య నానమ్మ రాజమాత విజయరాజే సింధియా బీజేపీని పొత్తిళ్లలో పెట్టుకుని పెంచిన ప్రముఖుల్లో ఒకరు. వాజపేయి, అద్వానీ ఆమెకు ఎంత గౌరవం ఇచ్చేవారన్నది బీజేపీలో, సంఘ్‌లో ఉన్న ప్రతి ప్రముఖుడికీ తెలుసు!
కాంగ్రెస్ నుంచి వచ్చిండు కనుక హిమంత బిశ్వశర్మకు బీజేపీ మొదట్లో కొంత కొత్తగా, వింతగా కనిపించి ఉండవచ్చు. అది సంఘ్ నేర్పిన సంస్కారం కావచ్చని కూడా ఆయనే అన్నారు. ప్రశ్న ఏమిటంటే ఆ సంస్కారం ఇప్పటి పార్టీలో ఉన్నదా అన్నదే! హిమంత చెప్పిన ‘కల్చరల్ డిఫరెన్స్’ సూత్రం కాంగ్రెస్, బీజేపీ మధ్యే కాదు; పాత- కొత్త బీజేపీ నడుమా వర్తిస్తుంది. గత ఆరేడేండ్ల స్వల్ప వ్యవధిలో పాత- కొత్త బీజేపీ మధ్య ఏర్పడిన ఈ సాంస్కృతిక అగాథాన్ని గుర్తించలేకపోవడం వల్లే, వివిధ పార్టీల నుంచి వెళ్లిన నాయకులు, ముఖ్యంగా బీసీలు అందులో ఇమడలేకపోతున్నారు. కమలాసనం సుఖాన్నివ్వకపోగా చాలా అసౌకర్యంగా ఉంటున్నది వారికి! ఇది సహజం. ఊహించిన పరిణామం.
2014లో తెలంగాణలో పోలింగ్ రోజే కేసీఆర్ ఒక సుదీర్ఘ మథనం నిర్వహించారు. తెలంగాణలో విద్యుత్తు రంగాన్ని ఎలా బాగు చేయాలన్నదే దాని సారాంశం. అప్పటికి టీఆర్ఎస్ గెలుస్తుందనే లెక్కగానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనే అంచనాగానీ ఎవరికీ లేవు. అయినా ఆయన అభివృద్ధి కార్యాచరణపై దృష్టిపెట్టారు. కారణం… తప్పక తననే గెలిపిస్తారని తెలంగాణ ప్రజలపై ఆయనకున్న నమ్మకం. అలా తొలిరోజు నుంచే కేసీఆర్.. తెలంగాణ సాధన ఉద్యమాన్ని, తెలంగాణ పాలన ఉద్యమంగా మార్చడంలో మునిగిపోయారు. ప్రత్యేక తెలంగాణను అభివృద్ధి తెలంగాణగా మార్చడంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఉద్యమకారుడి పాత్ర నుంచి ముఖ్యమంత్రి పాత్రలోకి తనను తాను వేగంగా మలుచుకున్నారు.
ఎంత శాంతియుతమైనప్పటికీ, 13 ఏండ్ల ఉద్యమం వల్ల తెలంగాణ సమాజం వివిధ కోణాల్లో కొంత డిస్టర్బ్ అయిన మాట నిజం. వలస పాలన వల్ల వచ్చిన వారసత్వ సమస్యలకు ఇది అదనం. తెచ్చుకున్న తెలంగాణ దెబ్బతినకూడదని, ప్రత్యేక రాష్ట్ర ప్రయోగం విఫలం కాకూడదని, తెలంగాణ రావడం వల్ల ప్రజలు నష్టపోయారనే అపప్రథ ఏర్పడకూడదని పరిపాలనపై కేసీఆర్ పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. రాజకీయ కుట్రల్ని ఎదుర్కొని పార్టీని, ప్రభుత్వాన్ని, రాష్ర్టాన్ని నిలబెట్టాల్సిన అనివార్యత, తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత ఆయనకు పనిభారాన్ని, సమయాభావాన్ని పెంచితే, దాన్ని ‘దూరం’గా అపోహపడ్డారు కొందరు. ఈ అపోహను తమకు అనుకూలంగా వాడుకున్నారు రాజకీయ ప్రత్యర్థులు. స్వాతంత్య్ర సమయంలో దేశం కూడా ఎదుర్కోనన్ని సమస్యల్ని, రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణ ఎదుర్కొన్నదంటే అతిశయోక్తి కాదు. అప్పుడు నెహ్రూకు బ్రిటిషర్లు ఎంతో సహకరించారు. మరి మనకు, కేసీఆర్‌కు? 2014లో అన్నీ ప్రతిబంధకాలే. తెలంగాణ ముందున్నది ముండ్ల దారి. ఒక్కొక్క ముల్లునూ ఏరేసుకుంటూ దారిని సుగమం చేయడంలో కేసీఆర్ మునిగిపోయి ఉంటే, మనవాళ్లు కొందరు ఆయనతో అంతరం ఏర్పడిందన్న అయోమయంలో చిక్కుకున్నారు. కేసీఆర్ అంత వేగంగా అభివృద్ధి ఎజెండాలోకి ఉద్యమకారులు కొందరు ఒదిగిపోలేకపోయారు.
తెలిసీ తెల్వక శత్రువుల మాయలో పడ్డారు. వేరే పార్టీల్లో చేరారు. ఆ క్రమంలో జరిగినవే టీఆర్ఎస్ నుంచి వలసలు! అయితే ఏదైనా మన మంచికే అంటరు. దీనివల్లా మనకు మంచే జరిగింది. పాలేవో నీళ్లేవో తేటతెల్లమవుతున్నది. ఏ పార్టీ రంగు ఏమిటో, ఏ నాయకుడి హంగు ఏపాటిదో బయటపడుతున్నది. ఇతర పార్టీల్లో చేరిన ఉద్యమకారుల భ్రమలు క్రమంగా తొలగిపోతున్నయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే మీటింగుల్లో ఇటీవల వచ్చిన కొత్త ట్రెండ్ గురించి ఆ పార్టీకే చెందిన ఒక ముఖ్య నేత ఇలా వివరించారు. “అయినవాళ్లకు ముందే సమాచారం వెళ్లిపోతుంది. కుర్చీలూ అంతవరకే వేస్తారు. నచ్చని వాళ్లకు మాత్రం మీటింగ్‌కు పావుగంట ముందు సమాచారం ఇస్తారు. వాళ్లు ఉరికురికి వచ్చేసరికి, లోపల కుర్చీలన్నీ నిండిపోయి ఉంటయి. “అరెరె.. అన్న వచ్చిండ్ర బై. కుర్చీ తెండి” అని అప్పటికప్పుడు ఆప్యాయంగా ఆర్డర్ వేస్తారు. కాలు వంగిందో, చేయి విరిగిందో కుర్చీ ఒకటి తెచ్చి ఆ చివరన వేస్తారు. తర్వాత పది నిమిషాలకే మీటింగ్ అయిపోయినట్టు ప్రకటిస్తరు. ఒకప్పటి సమావేశాలను చూసిన బీజేపీ నేతలకు ఇదొక వింతే మరి!
2014లో తెలంగాణలో పోలింగ్ రోజే కేసీఆర్ ఒక సుదీర్ఘ మథనం నిర్వహించారు. తెలంగాణలో విద్యుత్తు రంగాన్ని ఎలా బాగు చేయాలన్నదే దాని సారాంశం. అప్పటికి టీఆర్ఎస్ గెలుస్తుందనే లెక్కగానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనే అంచనాగానీ ఎవరికీ లేవు. అయినా ఆయన అభివృద్ధి కార్యాచరణపై దృష్టిపెట్టారు. కారణం… తప్పక తననే గెలిపిస్తారని తెలంగాణ ప్రజలపై ఆయనకున్న నమ్మకం.
దేశంలో గత పదేండ్లుగా రాజకీయం మారిపోయింది. అది ఇప్పుడెంత మాత్రమూ సమ్మిళిత ప్రజా ఉద్యమం కాదు; పార్టీల లోపలా, పార్టీల నడుమ కూడా… ‘నేనిటు- నువ్వెటు?’గా మారిపోయిన అధికార పోరాటం. ఇప్పటి రాజకీయంలో ప్రత్యర్థుల్లేరు, శత్రువులే! ఓడించడాల్లేవ్, క్లోజ్ చేయడమే! యుద్ధమంటేనే అధర్మం కదా. రానే రాదనుకున్న తెలంగాణ రాష్ట్రం రావడాన్ని, తెరిపిన పడదనుకున్న తెలంగాణ తేజరిల్లడాన్ని, కుప్పకూలిపోతదనుకున్న తెలంగాణ ఆకాశమంత ఎత్తున ఎదగడాన్ని జీర్ణించుకోలేని ‘శత్రువులు’ అనేక భేద దండోపాయాలు ప్రయోగించారు. ప్రయోగిస్తున్నారు. ఆ క్రమంలోదే ఉద్యమ సారథి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారం. అప్పటినుంచి ఇప్పటిదాకా అసత్యాల పరంపర సాగుతూనే ఉన్నది.
కేసీఆర్ ఎవరినీ కలవడని ఒక అబద్ధం. కేసీఆర్‌తో కలసి భోజనం చేయని ఉద్యమ నేత ఎవరైనా ఉన్నారా? రిసీవ్ చేసుకోవడం నుంచి సాగనంపే దాకా ఆయన చూపించే మర్యాద తెలియనివారున్నారా? పుట్టిన రోజుకో, పెండ్లికో, ఇంట్లో శుభకార్యానికో ఆయనను ఆహ్వానించి ఫొటో దిగని నాయకుడున్నడా? ఉమ్మడి రాష్ట్రంలో పైరవీకార్ల నిలయంగా మారిన సచివాలయాన్ని వారి నుంచి విముక్తం చేస్తే, సచివాలయంలోకి ప్రవేశం నిషేధమనే ప్రచారం. ఇలాంటివే ఎన్నో! 68 ఏండ్ల వయసులో ఆయన ఏకధాటిగా 10 గంటల పాటు కుర్చీలోంచి లేవకుండా కూర్చుని సమీక్ష జరుపుతడు.
మంటి పనికైనా మనోడే కావాలని కదా సామెత! ‘మనలో మనమైతే మనం ఐదుగురం.. వారు నూరుగురు! పరాయి వాడు పగబట్టి వస్తే మనం 105 మందిమి’ అని కదా చెప్పాడు ధర్మరాజు. తెలంగాణ ఇప్పుడు ఆ తరుణంలోనే నిలిచి ఉంది. ఇది మనం మరొక్కమారు ఏకం కావాల్సిన సమయం.
ఒక సమస్యను ముందటేసుకున్నడంటే అన్ని కోణాలు, అన్ని పర్యవసానాలు చర్చించిగానీ దాన్ని వదలడు.. ఎంత రాత్రైనా! ఆ మథనంలోంచి పుట్టినవే కదా దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు! ఆ పాజిటివిటీని నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం జరిగింది. ఇలాంటివే ఎన్నో! ఇప్పటికీ కొనసాగుతున్నయి. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరానికి జాతీయ హోదా ఇమ్మంటే ఇవ్వకపోగా… రంధ్రాన్వేషణతో బద్నాం చేసే ప్రయత్నం సాగుతున్నది. రెవెన్యూలో అవినీతికి తెరదించేందుకు ధరణి తెస్తే, అందులో స్వల్పంగా వివాదాస్పద భూములు ఉండిపోతే, అవన్నీ కబ్జా పెట్టారన్న విమర్శ. ఎవరైనా ఊరికి ఎకరం రెండెకరాలు కబ్జా పెట్టగలరా? ధరణితో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సులభతరం అయ్యిందా లేదా? చిన్న సమస్యల్ని భూతద్దంలో చూపించి, కొంపలు మునుగుతున్నయని ప్రచారం చేసి, పబ్బం గడుపుకొనే కుతంత్రంలో భాగమే సారథిపై బురదజల్లుడు.
కొండ అద్దమందు కొంచమై ఉండదా అన్నాడు వేమన. అద్దంలో చిన్నగా చూపించినంత మాత్రాన కొండ పరిమాణం తగ్గిపోదు. కేసీఆర్ హిమనగమంత ఔన్నత్యంతో ఉండే నాయకుడు. అబద్ధం ఆమడ వరకు వ్యాపించవచ్చు. కానీ నిజం నిలకడ మీద బయటపడి తీరుతుంది. టీఆర్ఎస్ మన మట్టి నుంచి పుట్టిన పార్టీ. మన ఇంట్లో వెలిసిన పార్టీ. కేసీఆర్ మనలోంచి పుట్టిన నాయకుడు. మన నాయకుడు. మనం తీర్చిదిద్దుకున్న నాయకుడు. మనల్ని కాదని ఆయన ఎక్కడికి పోతడు?! తనను ఈ నేల తల్లి బిడ్డగా భావించుకుని, కనీసం పూల దండ కూడా వేసుకోవడానికి నిరాకరించే కేసీఆర్ ఒకవైపు, తనను తాను దైవంగా సంభావించుకునే నాయకుడు మరోవైపు… పోల్చి చూసుకుంటే చాలు విషయం తెలిసిపోదా! 8 ఏండ్ల కింద ఇద్దరూ ఒకేసారి అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో ఎన్ని మార్పులు వచ్చినయ్? దేశంలో ఏం మార్పులు వచ్చినయ్?
తెలంగాణ మీద ఇప్పుడు మరొక ఆక్రమణ జరుగుతున్నది. అది ప్రాంతీయత మీద జాతీయత, అస్తిత్వం మీద మతం, అభివృద్ధి మీద ఆధిపత్యం చేస్తున్న ఆక్రమణ. ఆ ఆక్రమణ ఎటువంటిదో… మునుగోడు సభలో కలగలసి ఎగిరిన బీజేపీ, తెలుగుదేశం జెండాలు చెప్తయి. ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రధాని అపాయింట్మెంట్ పొందలేని చంద్రబాబు, మాజీగా ప్రత్యేక మంతనాలు జరపడం చెప్తుంది. అనేకమంది ఇంటి దొంగలు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఒక్క గొంతుకతో ఆరున్నొక్క రాగం అందుకోవడం చెప్తది. వినగలిగితే, చూడగలిగితే తెలంగాణపై ఏం జరుగుతున్నదో చెప్పడానికి అనేకం ఉన్నాయి. కేసీఆర్ అభివృద్ధి అంటున్నడు. వాళ్లు అధికారం అంటున్నరు. ఏకీభవించే వాళ్లు కలసిరావాలని కేసీఆర్ అంటున్నడు. ఎట్లయినా కొనేయాలని వాళ్లంటున్నరు. దేశానికి ఏం కావాలో కేసీఆర్ చెప్తున్నడు. ఏది ఉండకూడదో అది వాళ్లు చేస్తున్నరు. రిపబ్లిక్ టీవీ పొలిటికల్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఏమన్నడు… ‘డెవలప్మెంట్ ఆఫ్ అస్సాం ఈజ్ ఆల్ సో మీన్స్ డెవలప్మెంట్ ఆఫ్ తమిళనాడు (అస్సాం అభివృద్ధి అంటే అది తమిళనాడు అభివృద్ధి కూడా)’ అని! మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నరు? ‘మీరు హైదరాబాద్ ఆదాయాన్ని ఆదిలాబాద్‌లో ఖర్చుపెట్టడం లేదా? మరి తెలంగాణ ఆదాయాన్ని దేశంలో మరోచోట ఖర్చు చేస్తే తప్పేమిటి? అని! లాజిక్ బాగానే ఉన్నది. మరి హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ అని తెలంగాణ ప్రజలు సగర్వంగా చెప్పుకొంటున్నరు. మరి తెలంగాణ దేశానికి గుండెకాయ అని చెప్పడానికి కేంద్ర పెద్దలకు నోరెందుకు రావడం లేదు? విషయం అర్థమవుతున్నది కదా!
పెండ్లి తర్వాత నాగవెల్లి నిష్టూరం ఉంటుందట. తెలంగాణకూ అదే జరిగినట్టుంది. ఏమైతేనేం. 8 ఏండ్ల తెలంగాణకు దిష్టి తొలగిపోతున్నది. పగబట్టిన పరాయిని తరమడానికి మరొక్కమారు ‘తెలంగాణ స్ఫూర్తి’ ఉద్యమిస్తున్నది.
మంటి పనికైనా మనోడే కావాలని కదా సామెత! ‘మనలో మనమైతే మనం ఐదుగురం.. వారు నూరుగురు! పరాయి వాడు పగబట్టి వస్తే మనం 105 మందిమి’ అన్లేదా ధర్మరాజు. తెలంగాణ ఇప్పుడు ఆ తరుణంలోనే నిలిచి ఉంది. ఇది మనం మరొక్కమారు ఏకం కావాల్సిన సమయం. ఎవరిని ఓడించడానికి మనం ఎవరి పంచన చేరుతున్నామో ఆలోచించాల్సిన సమయం. ఎవరి మీద పగతో దేనికి నష్టం చేస్తున్నమో తరచి చూసుకోవాల్సిన సమయం. హోదాలు, అహంభావాలు, అభిజాత్యాలు మరిచి, నేనా.. తెలంగాణనా అని తర్కించి, చేతులు కలపాల్సిన సమయం. వెళ్లాలనుకునే వాళ్లకు, టీఆర్ఎస్లోకి వచ్చేవాళ్లిచే సందేశాన్ని మించింది ఏముంటది? అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. కేసీఆర్‌పై దాడి కేవలం కేసీఆర్‌పై దాడి కాదు. అది తెలంగాణపై దాడి. తెలంగాణ అస్తిత్వంపై దాడి! కేసీఆర్ మీద వేసిన నిందలు నిజం కావని గుర్తించి, నాటి ఉద్యమకారులు ఒక్కొక్కరుగా మళ్లీ సొంత ఇంటికి చేరడం శుభపరిణామం. పెండ్లి తర్వాత నాగవెల్లి నిష్టూరం ఉంటుందట. తెలంగాణకూ అదే జరిగినట్టుంది. ఏమైతేనేం. 8 ఏండ్ల తెలంగాణకు దిష్టి తొలగిపోతున్నది. పగబట్టిన పరాయిని తరమడానికి మరొక్కమారు ‘తెలంగాణ స్ఫూర్తి’ ఉద్యమిస్తున్నది. క్షణికావేశంలో దూరమైన బిడ్డలు మళ్లీ తెలంగాణ తల్లి ఒడిలోకి చేరితే ఆ ఆనందాన్ని లెక్కగట్టగలమా! తెలంగాణ ప్రేమకు స్వాగతం. నీళ్ల మీద దెబ్బ కొడితే వేరయితయా?!