e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home ఎడిట్‌ పేజీ కేంద్రం ‘సహకార’నిరాకరణ

కేంద్రం ‘సహకార’నిరాకరణ

కేంద్ర ప్రభుత్వం ‘సహకార్‌ సే సమృద్ధి’ నినాదం ఇచ్చింది. దాని సాఫల్యానికి కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించి, ఆ శాఖను ‘అమిత్‌ షా’కు అప్పగించింది. ఇది భారత సహకార ఉద్యమ పటిష్ఠతకు మేలు చేసేదా? లేక సహకార సిద్ధాంతానికి వక్రభాష్యం చెప్పి ప్రైవేటీకరణ చేయడానికా? అంటే సహకార స్ఫూర్తిని నీరుగార్చటానికే అన్న విధంగా ఉండటం గమనార్హం .

భారతదేశం సహకార వాదానికి ప్రాధాన్యం ఇస్తుంది. సహకారవాదం మన సంప్రదాయాలు, విలువలకు అనుకూలంగా ఉంటుంది. సహకారవాదంలో ప్రజల సామూహిక శక్తి ఆర్థికవ్యవస్థలో చోదకశక్తిగా ఉంటుంది. దేశంలో గ్రామీణ క్షేత్రస్థాయి ఆర్థికవ్యవస్థకు ఇది ముఖ్యం. కానీ, ఆచరణలో ఆర్‌బీఐ కార్యాచరణలు భిన్నంగా ఉన్నాయి. సహకార బ్యాంకుల నియంత్రణ పేరు తో ఆర్‌బీఐ వాటిని ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ధారాదత్తం చేయ టానికి పూనుకున్నది. తద్వారా సహకార సిద్ధాంతానికి వక్రభాష్యం చెప్తున్నది.

- Advertisement -

ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా రోజురోజుకు సహకార విధానం, ఆచరణ పట్ల ప్రతి దేశం ఆసక్తి చూపుతున్నాయి. ఆర్‌బీఐ మాత్రం సహకార విధానాన్ని నిర్వీర్యం చేసే పనిలో ఉండ టం ఆశ్చర్యం. సహకార ఆర్థికవిధాన సంరక్షణకు ప్రపంచ దేశాల సమాఖ్య అంతర్జాతీయ సహకార సమితి, ఐక్యరాజ్యసమితి వ్యవస్థల ఒప్పందాల్లో భారతదేశం కూడా భాగస్వామి. యూఎన్‌ఓ ఒక నివేదికలో ఐరాస సహకార సంఘాలకు మద్దతు ఇస్తుందని ప్రకటించింది. వ్యవసాయరంగం గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార సంఘాల పాత్రను ప్రపంచబ్యాంకు గుర్తించింది. కాగా, 2007లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సర్వే ప్రకారం.. సహకార బ్యాంకులు అనేక ఆర్థికవ్యవస్థల్లో ముఖ్యమైన భాగంగా మారి, ఆర్థిక స్థిరత్వానికి మూలంగా ఉన్నాయని పేర్కొనటం గమనించదగినది.

సహకార విధాన అంశం రాష్ట్ర పరిధి లోనిది. 2011లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా, రాష్ట్ర అంశమైన సహకార వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్పించే రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు 2021 జూలై 20న కొట్టివేసింది. అలాగే.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అంశంలో జోక్యం కల్పించుకోరాదని పేర్కొంటూ రాష్ట్ర హక్కులను సుప్రీంకోర్టు కాపాడుతున్నదని పేర్కొన్నది. అయినా కేంద్రం తనదైన ధోరణితో ముందుకుపోతున్నది. 97వ రాజ్యాం గ సవరణ వత్తాసుతో కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ (అమెండ్‌మెంటు) చట్టం-2020ను తీసుకొచ్చింది. రాష్ట్ర సహకార చట్టం పరిధిలోని సహకార బ్యాంకుల ధనం కూర్పు, సహకారబ్యాంకుల నిర్వహణ అంశాల్లో ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ నియంత్రణకు అవకాశం కల్పిస్తుంది. రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసిన అంశాలను, దొడ్డిదారిన నిపుణుల కమిటీ సూచనల పేరుతో రిజర్వు బ్యాంక్‌ చేపట్టడం గర్హనీయం. ఈ చర్యల ద్వారా.. సహకార బ్యాంకులు ప్రైవేట్‌ వ్యక్తుల అధీనంలోకి వెళ్తాయి. గత 60 ఏండ్లుగా రైతులు, చేతి వృత్తిదారులు సహకార బ్యాంకులోని తమ వాటా ధనంపై డివిడెండ్‌, వడ్డీ తీసుకోకుండా వదులుకోవటం వల్ల ఏర్పడిన రూ.లక్షల కోట్ల రిజర్వ్‌ నిధులు ప్రైవేట్‌ వ్యక్తుల అధీనంలోకి వెళ్తాయి.

కేంద్ర ప్రభుత్వ ఈ చర్య ద్వారా భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఆర్టికల్‌ 19(1)(జి)ను రైతులు, బలహీనవర్గాలు కోల్పోతాయి. వారు తమ ఆర్థిక అవసరాల కోసం సమష్టిగా సహకార బ్యాంకింగ్‌, వ్యాపారం చేసుకొనే హక్కు లేదు. మోదీ ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ చేపడుతున్న ఈ చర్యల ద్వారా భారత రాజ్యాంగ మౌలిక స్వభావమే మారుతున్నది. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ మాత్రమే దేశంలో కొనసాగుతుంది. రైతులు, బలహీనవర్గాలు సమష్టిగా నిర్వహించుకునే సహకార బ్యాంకింగ్‌ ఉండ దు. గ్రామీణ వ్యవస్థలో సహకారవిధానాన్ని అమలుచేయాలని సూచించే ఆర్టికల్‌ 43 రద్దు అవుతున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న జాతీయ సహకార సమ్మేళనం సహకార రంగ పునరుజ్జీవనానికి, బలోపేతానికి కృషి చేయాల్సి ఉన్నది.

సంభారపు భూమయ్య,
(వ్యాసకర్త: సహకార సంరక్షణ సమితి జాతీయ కన్వీనర్‌)
(రేపు న్యూఢిల్లీలో జాతీయ సహకార సమ్మేళనం సందర్భంగా..)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement