దేశంలో ఊహించనిరీతిలో విరుచుకు పడుతున్న కరోనా మరింత ప్రమాదకరంగా మారింది. రోజువారీ కేసులతో పాటు మరణాలూ పెరుగుతుండటం కలవరపెడుతున్నది. దేశంలో వరుసగా రోజుకు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్లకు చేరింది. మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య రెండు లక్షలకు దగ్గరలో ఉంది. కరోనా విజృంభిస్తుండటంతో మెజారిటీ రాష్ర్టాలు మళ్లీ లాక్డౌన్ బాటపట్టాయి.
దేశంలో లాక్‌డౌన్‌తో వారానికి 1.25 బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థను కోతకు గురిచేస్తాయి. జీడీపీ నుంచి 140 బీపీఎస్‌లను తగ్గించవచ్చని ఒక నివేదిక పేర్కొన్నది. ప్రస్తుత ఆంక్షలు మే చివరివరకు అమల్లో ఉంటే ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల నష్టాలు సుమారు 10.5 బిలియన్ డాలర్లు లేదా జీడిపీలో 34 శాతం బీపీఎస్ ఉంటుందని ఒక నివేదిక వెల్లడించింది. సెకండ్ వేవ్‌తో మహారాష్ట్ర అల్లకల్లోలమైంది. మన దేశ ఆర్థికవ్యవస్థను ప్రభావితం చేసే రాష్ర్టాల్లో మహారాష్ట్ర కీలకం. ఇప్పటికే ఇక్కడ లాక్డౌన్ అమలవుతున్నది. దేశం మొత్తమ్మీద ఇక్కడి కేసులే అధికం. ఆర్థికంగా గట్టిగా ఉన్న కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ, కేరళ, ఏపీ రాష్ర్టాల్లో కూడా లాక్డౌన్ అమలవుతున్నది.
దేశంలో నమోదవుతున్న కేసుల్లో 81 శాతానికి పైగా కేవలం 8 రాష్ర్టాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువ రాష్ర్టాలు ఆర్థికంగా చురుకైనవి. అందువల్ల ఆర్థికవ్యవస్థపై పెను ప్రభావం కనబడుతున్నది. తాజా ఆందోళనకు ఇదే కారణం. గత కొన్నిరోజులుగా కీలకమైన ఆర్థిక కేంద్రాల్లో పెరుగుతున్న లాక్డౌన్లు, ఇతర అంక్షలు, రాత్రి కర్ఫ్యూలు ఆర్థికవ్యవస్థకు వారానికి 1.25 బిలియన్ డాలర్ల నష్టం చేకూర్చే అవకాశం ఉన్నదని ఆర్థికవేత్తల ఆందోళన. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ లాంటి ముఖ్య ఆర్థిక కేంద్రాల్లో పెరుగుతున్న కేసుల వల్ల ఇప్పటికే 68 శాతం ఆర్థికవ్యవస్థ ప్రభావితమైంది. జాతీయ జీడీపీకి 16 శాతానికి పైగా దోహదపడే మహారాష్ట్రలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో జాతీయ ఆర్థికస్థాయిలో స్థూల విలువ ఆధారిత వృద్ధిని 0.32 శాతం తగ్గిస్తాయని కేర్ రేటింగ్స్ నివేదిక ఇటీవల వెల్లడైంది. కొత్తగా లాక్డౌన్, ఆంక్షల వల్ల ఈ నెలలో సుమారు రూ.40 వేల కోట్ల జీవీఏ నష్టం కలుగుతుంది. ఆంక్షలు పొడిగించడం వల్ల అధిక ఉత్పత్తి నష్టం సంభవిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
భారత్‌లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధిని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కానీ మరిన్ని రాష్ర్టాల కఠిన అంక్షల వల్ల ఈ వృద్ధి కష్టమేనని తాజా పరిస్థితులు తెలియజే స్తున్నవి. కరోనా సెకండ్ వేవ్‌ను సమర్థవంతం గా కట్టడి చేయడం కష్టసాధ్యంగానే మారింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోతున్నది. ఆర్థికవ్యవస్థపై అన్ని అంశాలూ ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ తీవ్రతతో అధిక సంఖ్య లో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు వైద్యసాయం కోసం దవాఖానలకు పరుగులు తీస్తున్నారు. దీంతో తీవ్రమైన మంచాల కొరత ఏర్పడింది, ఆక్సిజన్ కొరత సరేసరి. దేశవ్యాప్తంగా ఏర్పడిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు విదేశాల నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లను భారీగా కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది.
ఇదిలా ఉంటే.. కల్లోల కరోనా మహమ్మారి నుంచి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత ఇప్పటినుంచే ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం గతేడాది వలె ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి. ప్రజలకు ఆదాయ మార్గాలను సూచించాలి. ఉపాధి కోల్పోయిన వివిధ రంగాల వారికి ఉపాధి కల్పించాలి. ముఖ్యంగా వైద్య పరిశోధనలను ప్రోత్సహించాలి. వీలైనంత త్వరగా అందరికీ ఉచిత టీకా కార్యక్రమం చేపట్టాలి. టీకా ఒక్కటే ప్రజల ప్రాణాలను కాపాడుతుంది. ప్రజల జీవనం సాఫీగా సాగకపోతే ఆర్థికవ్యవస్థ బలహీనపడుతుంది, ఆర్థికవ్యవస్థ బలహీనపడితే ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయి.
(వ్యాసకర్త: బ్యాంకింగ్ రుణాలపై వెలువడిన ‘ఈజీలోన్’ పుస్తక రచయిత)
కేంద్రం వ్యాక్సిన్ కొనుగోళ్లకు రాష్ర్టాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత నిధులతోనే వ్యాక్సిన్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొనుగోళ్లపై రాష్ర్టాలు రూ.2 నుంచి 3 వేల కోట్లు వెచ్చించనున్నాయి. అసలే కర్ఫ్యూలు, లాక్డౌన్లతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఖర్చులు భారంగా మారాయి.