e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home ఎడిట్‌ పేజీ గాంధీ, అంబేద్కర్‌ బాటలో..

గాంధీ, అంబేద్కర్‌ బాటలో..

75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమించడానికి ఆర్థిక సంక్షేమం అనే నూతన విధానం ఏర్పడింది.ఈ విధానంలో పేద, బలహీనవర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలి. దేశంలో 1971-1990 కాలంలో పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేపట్టారు. ఇవి దారిద్య్రరేఖకు దిగువన జీవించేవారిప్రాథమిక అవసరాలను కొంతమేర తీర్చాయి. కానీ, ఆశించిన ఫలితాలు రాలేదు.

‘భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం… దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను ఆర్థిక, సామాజిక, విద్య, వైజ్ఞానిక రంగాల్లో మెరుగుపరచడానికి ప్రయత్నించడం’

- Advertisement -

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌

1991 నుంచి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ చాలా దేశాల్లో అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాస్త్రవేత్తలు పునరాలోచనలో పడ్డారు. మనిషి కేం ద్రంగా అభివృద్ధి జరగాలని భావించారు. పేదలు స్వయం గా ఎదిగే వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాలకు సూచించారు. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులయ్యేలా చూస్తూ, ఆర్థికాభివృద్ధి సాధించే సామర్థ్యాలను వారికి పెంపొందించి సమాజాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదపడాలని సూచించారు. కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ ఇదే తోవలో వెళ్తున్నది.

గాంధీజీ, అంబేద్కర్‌ వేసిన బాటలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదని, వారి ఆశయాలను కొనసాగించి తెలంగాణ ప్రజల అభివృద్ధిని సాధించి చూపుతామన్నారు కేసీఆర్‌. ఈ క్రమంలోనే పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తూ సీఎం కేసీఆర్‌ ముందుకుపోతున్నారు.

సబ్బండ వర్ణాల సమగ్ర జీవన ప్రమాణాలు పెంచేందుకు సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆవిర్భావం నుంచే సంక్షేమ యజ్ఞం చేస్తున్నారు. ఎన్నో పథకాలను అమలుచేస్తూ ఒక పేద కుటుంబం మెరుగైన జీవితం గడిపేందుకు భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ గడపకు ఈ పథకాలు చేరుతున్నాయి. తెలంగాణ బిడ్డలు తల్లి గర్భం నుంచి భూ తల్లి ఒడిలోకి చేరే జీవిత చక్రంలోని ప్రతీ దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం సాయమందిస్తున్నది. గర్భంలో పడ్డప్పుడు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం; 104, 108 సేవలు, ప్రసూతి దవాఖానలు, కేసీఆర్‌ కిట్‌, మగబిడ్డ అయితే రూ. 12 వేలు, ఆడబిడ్డ అయితే 13 వేల సాయం, పాలు మరిచిన క్షణం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యతో పాటు భోజనవసతి, నడక నేర్చిన తర్వాత నాణ్యమైన ఉచిత ప్రాథమిక విద్య, ఐదో తరగతి వచ్చిన తర్వాత ఉచిత గురుకుల విద్య, పదో తరగతి తర్వాత ఉచిత కళాశాల విద్య, ఉపకార వేతనాలు, 12 పాసైతే ఉచిత ఉన్నత విద్య, ఫీజు రీ యింబర్స్‌మెంట్‌, గురుకుల కళాశాలలు, ఉచిత యూనివర్సిటీ విద్య, 18 ఏండ్లు నిండి ఆడబిడ్డ పెండ్లయితే కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, 21 ఏండ్ల వయస్సులో ఉచిత వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ, టాస్క్‌ ద్వారా విదేశాల్లో చదువంటే ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ తదితరాలు అండగా ఉంటున్నాయి. పల్లె మొదలు పట్టణం దాకా వితంతువులకు, వికలాంగులకు ఆసరా పింఛన్లు, రైతన్నకు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, ఉచిత, నాణ్యమైన కరెంటు, సబ్సిడీ యంత్ర పరికరాలు, భూసార పరీక్షలు, సాదా బైనామా, నేతన్నకు సబ్సిడీ యంత్రాలు, గీత, మత్స్య కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా, గొర్ల పంపిణీ; ఎస్సీ, ఎస్టీ, బీ సీ, మైనారిటీలకు సంక్షేమ పథకాలు, రుణాలు, తాజాగా దళితుల అభ్యున్నతికి దళితబంధు.. ఇలా అన్నిపక్షాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందిస్తున్న ప్రభుత్వం దేశం లో ఎక్కడాలేదని, కేవలం రాష్ట్రంలోనే ఉందని ఘంటాపథంగా చెప్పవచ్చు.

1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు. సామ్యవాదం అనే పదం ద్వారా ధనిక, పేదవర్గాల మధ్య వ్యత్యాసాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా రాజ్యాంగంలోని 16వ భాగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రత్యేక సదుపాయాలను కల్పించాలని సూచిస్తుంది. ఆర్టికల్‌ 46 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా ప్రగతికి ప్రత్యేక పథకాలను చేపట్టాలని ప్రభుత్వాలకు రాజ్యాంగం తెలుపుతుంది. రాజ్యాంగంలోని ఈ మౌలిక సూత్రాలను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమ నేత, సంక్షేమ సారథి సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దళిత అభ్యున్నతి కోసం మరో సాహసోపేతమైన ముందడుగు వేశారు.

‘మొదట పట్టించుకోరు. ఆ తర్వాత చూసి నవ్వుతారు. ఆపై యుద్ధానికి దిగుతారు. అంతిమంగా మీరే విజయం సాధిస్తార’ని మహాత్మాగాంధీ చెప్పిన సూక్తి కేసీఆర్‌ పోరాటస్ఫూర్తికి సరిగ్గా సరిపోతుంది. ఉద్యమం ప్రారంభించిన మొదట్లో తెలంగాణ వస్తదా? అని అనుమానపడ్డరు. వచ్చిం ది. 24 గంటల కరెంటు అచ్చేదా పొయ్యేదా? అన్నరు. అయ్యింది. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు హే గీదేడయితదన్నరు. అయింది. దండుగన్న ఎవుసం పండుగైంది. రైతుబంధు తెచ్చినప్పుడు కొందరు పెదవి విరిచిన్రు. ఇవ్వాళ తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నరు. అట్లనే ‘దళితబంధు’ను కూడా కొందరు అనుమానపడుతున్నరు. వారి అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తం. అదే స్ఫూర్తితో దళితబంధును అమలుచేస్తం. విజయం సాధిస్తం’ అని కేసీఆర్‌ ఇటీవల ‘దళితబంధు’ పథకం అమలుపై నిర్వహించిన సుదీర్ఘ సమీక్షా సమావేశంలో వ్యాఖ్యానించటం గమనార్హం.

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అభిలషణీయ విధానాల ద్వారా ప్రజలందరికీ మెరుగైన వసతులను కల్పించడం, అన్నివర్గాల ప్రయోజనాలను పరిరక్షించడం ప్రభుత్వాల విధి అని రాజ్యాంగం చెప్తున్నది. రాజ్యాంగం చెప్పిన మౌలికాంశాల ఆధారంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిపై నిరాధార రాజకీయపరమైన విమర్శలు చేస్తున్నవారు రాజ్యాంగ ఆత్మను, అంబేద్కర్‌ ఆశయాలను తెలుసుకోవాలి. అప్పుడే కేసీఆర్‌కు దళితుల అభ్యున్నతి పట్ల ఉన్న దార్శనికత అర్థమవుతుంది.
(వ్యాసకర్త: అధ్యాపకులు, ప్రభుత్వ పాలనాశాస్త్రం, కేయూ)

డాక్టర్‌ పుల్లా శ్రీనివాస్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana