నీళ్లు కదిలితే ఉత్సాహం
లేదంటే స్తబ్ధత ఆవరిస్తుంది
మనసు కూడా అంతే..!
నీటి ప్రవాహాన్ని చూస్తుంటే
చూపులు కూడా
దానితో బాటు కొట్టుకుపోతాయి
అల్లంత దూరం వెళ్లగానే
వాటిని గాలమేసి వెనక్కి లాక్కోవాలి!
ప్రవాహం ఒక్కోసారి
మన కళ్లలో కూడా కనిపిస్తుంది
పేరుకుపోయిన చెత్తనంతా
వెంటేసుకుపోయినట్లు
బాధలనూ తీసుకెళ్తుంది!
ప్రవాహానికి లోతుతో పనిలేదు
చలనశీలత ముఖ్యం
ప్రవహించే గుణం
గాలిలో ఉంది.. కాంతిలో ఉంది..
మనిషిలోనే ముడుచుకుపోతుంది!
ప్రవహించేది ఏదైనా
ప్రకాశిస్తూనే ఉంటుంది
మనసైనా.. మనిషైనా..
చివరికి కాలమైనా!
అందుకే..
మనిషి ప్రవహిస్తూ ఉండాలి
అందరి మనసుల్లోకి పసిపిల్లల్లా!
పుట్టి గిరిధర్
94914 93170