బీజేపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలతో కేంద్రప్రభుత్వం అభాసుపాలవుతూనే ఉన్నది. తాజాగా యూపీలోని లఖింపూర్ ఖీరీలో రైతులు దుర్మరణం చెందిన ఘటనపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక సంచలనం రేపుతున్నది. దీనికి ముందు రహదారుల వెంబడి ఎక్కడా మాంసాహారం అమ్మరాదంటూ గుజరాత్ మున్సిపల్ అధికారులు ఇచ్చిన ఆదేశాలను ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. అలాగే కేంద్ర సెకండరీ విద్యాబోర్డు (సీబీఎస్ఈ) పదవ తరగతి ఆంగ్ల సాహిత్య ప్రశ్నాపత్రంలో మహిళలకు విద్య, స్వేచ్ఛ కల్పించటం మూలంగానే కుటుంబ విలువలు, పిల్లల క్రమశిక్షణ కట్టుతప్పుతున్నాయనే సారాంశంతో ఇచ్చిన ప్రశ్నపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో కేంద్రం వెనుకడుగు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
లఖింపూర్ ఖీరీ- నిర్లక్ష్యం, ఏమరుపాటుతో జరిగింది కాదనీ, ఉద్దేశపూర్వకంగా రైతులను బలిగొనాలనే ప్రణాళికతో చేసిన హత్యాకాండ అనీ సిట్ నిగ్గు తేల్చింది. తీవ్ర నేరపూరిత హత్యయత్నం, హత్య లాంటి నేరారోపణలతో నేరస్థులను శిక్షించాలని తేల్చిచెప్పింది. పంజాబ్-హర్యానా హైకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో తొమ్మిది మందితో కూడిన సిట్ బృందం వెలువరించిన నివేదిక ఇది. ఇందులో యూపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులుండటం గమనార్హం. గుజరాత్ అహ్మదాబాద్ మున్సిపల్ అధికారుల తీరుపై కూడా ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రజల ఆహార అభిరుచుల్ని అడ్డుకోలేం. ప్రజలు మాంసాహారం తింటే మీకేంటి సమస్య? మీరు తినకపోతే అది మీ దృక్పథం. నేనేమి తినాలో మీరెలా నిర్ణయిస్తారని న్యాయమూర్తి బీరేన్ వైష్ణవ్ నిలదీశారు.
మోదీ అధికారానికి వచ్చిన నాటి నుంచి మెజారిటీవాద దృక్పథంతో ప్రజల ఆహారపుటలవాట్లనే కాదు, వస్త్రధారణ, సంస్కృతులను నియంత్రిస్తున్నారనే ఆరోపణలు చాలా రోజులుగా ఉన్నాయి. అసమ్మతి గళాలను నొక్కి పెట్టడం, బలహీనవర్గాలపై దాడులు సాగడం బీజేపీ అసహన రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ మధ్యనే ఉత్తర ప్రదేశ్లోని సంబాల్లో చేతిపంపు వద్ద నీళ్లుతాగినందుకు తండ్రి కూతుళ్లను తీవ్రంగా గాయపర్చారు. కర్ణాటకలో ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో గుడ్లు పెట్టడాన్ని అక్కడి మఠాధిపతులు వ్యతిరేకించారు. దీంతో ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నేను మీ మఠానికే వచ్చి నాకు నచ్చిన ఆహారాన్ని నేను తింటానని అదే స్థాయిలో బదులివ్వడం గమనార్హం. మన దేశ ప్రజాస్వామిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా మన్ననలను పొందింది. భిన్న జాతులు, సంస్కృతులు సహజీవనం చేయడానికి కారణం మన లౌకిక వ్యవస్థే. దీనిని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం.