అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి రావడంతో భౌగోళిక రాజకీయాలలో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితులలో భారత్ అప్రమత్తమై తగు విధంగా పావులు కదపవలసి ఉంటుంది. తాలిబన్లతో చైనా, పాకిస్థాన్ ముందునుంచే సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఈ ఇస్లామిక్ తీవ్రవాదులతో చర్చలను సాగించడంలో కొంత జాప్యం జరిగినప్పటికీ, ఇప్పటికైనా మించిపోయింది లేదు. భారత్ వంటి పెద్ద పొరుగు దేశాన్ని తాలిబన్లు కూడా ఉపేక్షించలేరు. ఇంతకాలం మనం అఫ్గానిస్థాన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామే తప్ప, అమెరికా ఎంత ఒత్తిడి చేసినప్పటికీ, తాలిబన్ల వ్యతిరేక సైనిక కూటమిలో చేరలేదు. తాలిబన్ల తాజా ప్రకటన కూడా ఈ వాస్తవాన్ని గుర్తించినట్టుగానే ఉన్నది.
తాలిబన్ల విధానాలు మనకు నచ్చకపోయినా, ఇప్పుడు వారే అధికారంలో ఉన్నారనే వాస్తవాన్ని గుర్తించక తప్పదు. మన దేశంలోని కశ్మీర్లో ఉగ్రవాదానికి ఊతం ఇవ్వకుండా తాలిబన్లు తటస్థంగా ఉండేలా చూడటం అవసరం. చైనా కూడా తమ దేశంలోని ఇస్లామి క్ తీవ్రవాదానికి మద్దతు లభించకుండా తాలిబన్ల నుంచి హామీలు పొందుతున్నది. అఫ్గానిస్థాన్‌లో లిథియం మొదలుకొని అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. ఆ దేశంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి. అత్యంత కీలకమైన వాఖాన్ కారిడార్‌ను చైనా వాణిజ్య మార్గంగా వాడుకుంటున్నది. మన దేశం కూడా పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా ఇరాన్‌లోని చాబహర్ రేవు ద్వారా అఫ్గానిస్థాన్ మీదుగా మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవచ్చు. తాలిబన్లతో సంబంధాలకు మనదేశం ఎంత సంకోచిస్తే చైనా, పాకిస్థాన్‌కు అంత లబ్ధి చేకూరుతుంది.
గతేడాది ఫిబ్రవరిలో ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లతో చర్చలు ప్రారంభించిన నాటినుంచి భారత్‌ను అమెరికా ఏ మాత్రం కలుపుకొనిపోవడం లేదు. దక్షిణాసియాతోపాటు, హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ జలాల వరకు భారత్‌ను చైనాకు వ్యతిరేకించుకోవాలనే ఉబలాటమే తప్ప మన ప్రయోజనాలను పట్టించుకుంటుందనే భరోసాను మాత్రం అమెరికా ఇవ్వలేకపోతున్నది. దానికి తోడు రష్యా, ఇరాన్ వంటి మిత్రదేశాలతో వ్యాపార సంబంధాలను తగ్గించుకోవాలనే ఒత్తిడులు తెస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికాతో సత్సంబంధాలను కొనసాగిస్తూనే అఫ్గానిస్థాన్‌లో మన కార్యాన్ని చక్కబెట్టుకోవడానికి రష్యా, ఇరాన్ వంటి దేశాల తోడ్పాటు తీసుకోవడంలో తప్పులేదు. కొత్తగా స్వాతంత్య్రం వచ్చిన కాలంలోనూ ప్రచ్ఛన్నయుద్ధ ఒత్తిడులకు లొంగకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మన దేశం అనుసరించింది. ఇప్పు డు కూడా అఫ్గానిస్థాన్ విషయంలో మన ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వ్యవహరించాలి.