‘దివాలగొట్టోడు తీర్థం బోయి దేవుడ్ని చూడక ఎల్లొచ్చిండట’! ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వ్యవహారసరళి ఇదేవిధంగా ఉన్నది. ఆయన భారత్ జోడో యాత్ర ఎందుకు చేస్తున్నట్టు? ఏం సాధించినట్టు? దేశం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నది? ఒక రాజకీయ పార్టీ నేతగా తన కర్తవ్యం ఏమిటి అనే స్పష్టత రాహుల్‌కు ఏ మాత్రం ఉన్నట్టు కనిపించడం లేదు.
దేశాన్ని మత రాజకీయం కమ్ముకున్నది. ఫాసిస్టు శక్తులు ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మోదీ నాయకత్వంలోని బీజేపీ ఒకే దేశం ఒకే పార్టీ అనే రీతిలో బుల్డోజర్ రాజకీయాలను నడుపుతున్నది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని అనుకున్నా, దేశాన్ని గట్టెక్కించాలనుకున్నా చేయాల్సిందేమిటి? ఒకటి- బీజేపీని ప్రధాన శత్రువుగా గుర్తించి దానిపై పోరాటం సాగించాలి. రెండు- బీజేపీ వ్యతిరేకపోరుకు తన శక్తి సరిపోవడం లేదు కనుక ఇతర రాజకీయపక్షాలను కలుపుకపోవాలె. కానీ కాంగ్రెస్‌లో బ్యాక్‌సీట్ డ్రైవింగ్ చేస్తున్న రాహుల్ గాంధీ ఈ రెండు పనులు చేయడం లేదు. బీజేపీపై పోరాడకపోగా, మిగతా రాజకీయపక్షాలను దెబ్బతీసి తద్వారా మోదీకి లబ్ధి జరిగేవిధంగా వ్యవహరిస్తున్నారు.
543 లోక్‌సభ స్థానాలలో అధికారంలోకి రావడానికి కనీసం 272 సీట్లుండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో గెలుచుకున్నది 52 సీట్లు. ఇందులో ఎనిమిది సీట్లు డీఎంకే దయా దాక్షిణ్యాల వల్ల వచ్చినవే. ఏ రాష్ట్రంలోనైనా తమకు అత్యధిక సీట్లు కావాలంటూ మిత్రపక్షాలను పీడించడం రాహుల్‌కు అలవాటు. బిహార్‌లో ఈ విధంగానే భారీగా సీట్లు కేటాయించుకొని తాను గెలువకుండా ఆర్జేడీకి మెజారిటీ రాకుండా గండికొట్టిండు. గతంలో ఒకసారి యూపీలో దాదాపు వంద సీట్లు తీసుకొని బోర్లా పడ్డాడు. ఈ సారికి డీఎంకే నేత స్టాలిన్ ఉదారంగా వ్యవహరించారు. కానీ వచ్చే ఎన్నికలలో ఈ ఎనిమిది సీట్లు మళ్ళీ ఇస్తారని చెప్పలేము. మరో ఎనిమిది సీట్లు పంజాబ్ ప్రజలు కట్టబెట్టారు. ఇటీవలి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారు. ఈ సారి ఆ ఎనిమిది దక్కవు. కేరళలోని మొత్తం 20 స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు. రాహుల్‌గాంధీ, మోదీ సాగిస్తున్న ‘లాలూచీ కుస్తీ’ని దేశమంతా గమనిస్తున్నది. కాంగ్రెసేతర పక్షాలే బీజేపీని గట్టి గా ఎదుర్కొంటున్నాయని కేరళ ప్రజలు గుర్తిస్తే, ఇక ఈ పదిహేను సీట్లు కూడా కాంగ్రెస్‌కు రావు. రాహుల్‌గాంధీ శల్య సారథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడున్న 52 స్థానాలు మళ్ళా తెచ్చుకోవడమే అద్భుతం.
శత్రువును ఎదుర్కొనడానికి సంఖ్యారీత్యా బలాబలాలతో నిమిత్తం ఉండదు. భారీ సైన్యాన్ని చిన్న పటాలం చావు దెబ్బతీసిన ఉదంతాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. 333 నౌకలున్న జపాన్ బలగాలను పన్నెండు నౌకలతో కొరియా యుద్ధ వీరుడు- వ్యూహకర్త యీ సున్ సిన్ దెబ్బతీశాడు (దీనిపై ఆ మధ్య రోరింగ్ కరెంట్స్ అనే సినిమా వచ్చింది). అంతెందుకు వర్తమాన రాజకీయాలలో కేసీఆర్ వ్యూహచతురత చూస్తూనే ఉన్నాం. పలు రాష్ర్టాలలో ప్రాంతీయ పార్టీలు అవతరించి జాతీయపక్షాలను సవాలు చేస్తున్నాయి. బీజేపీకి పశ్చిమ, ఉత్తర భారత ప్రాంతాలు ఆయువు పట్టు అనేది తెలిసిందే. గుజరాత్ (26 స్థానాలు), రాజస్థాన్ (25), మధ్యప్రదేశ్ (29), హిమాచల్ ప్రదేశ్ (4), హర్యానా(10), ఉత్తరాఖండ్ (5), చండీగఢ్‌లలో సీట్లు వంద ఉంటాయి.
హర్యానాలో మళ్ళా కొంత ప్రాంతీయ శక్తులు పుంజుకున్నప్పటికీ బీజేపీని ఢీకొట్టే బాధ్యత కాంగ్రెస్‌పైనే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ (80), బీహార్ (40) రాష్ర్టాలలోని మొత్తం 120 స్థానాల్లో సామాజిక న్యాయ రాజకీయపక్షాలు బలంగా ఉండి బీజేపీని ఎదిరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్‌గాంధీ ఏమి చేయాలె? యూపీ, బీహార్‌లోని పక్షాలకు నైతిక మద్దతు ఇచ్చి తన పరిమిత వనరులను బీజేపీతో ముఖాముఖి తలపడుతున్న పై వంద సీట్లపై వెచ్చించాలి. కానీ గత ఎనిమిదేండ్లలో రాహుల్ గాంధీతీరు కుప్పొకచోట, కావలొక చోట అన్నట్టుగా ఉంది. ఎస్పీ- బీఎస్పీ ఉమ్మడి సంఘటను ఓడించడానికి యూపీలో ఒక పక్క జ్యోతిరాదిత్య సింధియాను, మరోపక్క ప్రియాంకను నియోగించాడు. యూపీ, బీహార్లలోని 120 సీట్లతో పాటు గుజరాత్, ఎంపీ, రాజస్థాన్ తదితర రాష్ర్టాలలోని వంద సీట్లను బంగారు పళ్ళెంలో పెట్టి మోదీకి సమర్పించుకున్నాడు. పై రాష్ర్టాలలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత పేరుకుపోయి ఉన్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీపై వ్యతిరేకత మూలంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయినా ఇక్కడ లోక్‌సభ సీట్లు తెచ్చుకోలేకపోవడం రాహుల్ అసమర్థత. రాహుల్ ఏ మాత్రం వ్యూహ చతురత కనబరిచినా గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చేది. రాహుల్ అస్త్ర సన్యాసం మూలంగానే బీజేపీని ఎదుర్కొనడానికి మరొక పార్టీ అవసరం ఏర్పడింది. ఈ శూన్యాన్ని భర్తీచేసి, బీజేపీని దెబ్బకొట్టడానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది.
కాంగ్రెస్ పార్టీ స్వయంగా మెజారిటీ సాధించుకోలేనప్పుడు, మిత్రపక్షాల అవసరం ఏర్పడుతుంది. అందువల్ల ప్రాంతీయ పార్టీలతో కనీస స్థాయిలో సౌహార్ద సంబంధాలు నెలకొల్పుకోవాలి. కానీ ఆ మాత్రం సంస్కారాన్ని కూడా రాహుల్ ప్రదర్శించడు.
గత లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కు కావడం భ్రష్ట రాజకీయానికి పరాకాష్ఠ. నైతిక భ్రష్టులను రాష్ట్ర సారథులుగా పెట్టుకున్న తర్వాత ప్రజలు ఏ విలువలను చూసి ఓటేస్తారు? స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి కాంగ్రెస్ గ్రామగ్రామాన పాతుకుపోయి ఉన్నది. బీజేపీని ఢీకొనడానికి కాంగ్రెస్ కొంతయినా బలంగా ఉంటే బాగుండునని జాతీయస్థాయిలో ఇటీవలి వరకు చాలామంది ఆశ పెట్టుకున్నారు. కానీ రాహుల్ విధానం చూసిన తర్వాత ఆ నమ్మకం సడలిపోయింది. తెలంగాణలో కూడా బీజేపీ రాకూడదనే అభిప్రాయం బలంగా ఉన్నది. కానీ బీజేపీని ఢీకొనేది టీఆర్ఎస్ మాత్రమేనని వామపక్షాలతో సహా లౌకికవాదులంతా బలంగా నమ్ముతున్నారు. ఇటీవలికాలంలో జరిగిన ఉప ఎన్నికలు ఇందుకు ఉదాహరణ. తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతం అని మునుగోడు ఉప ఎన్నికతో మరింత స్పష్టమైపోయింది. ఇక్కడ కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది.
మోదీతో కలియబడకుండా రాహుల్ తప్పించుక తిరుగుతున్నాడని భారత్ జోడో యాత్ర చూస్తే తెలిసిపోతుంది. ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా రాహుల్ తన దృష్టిని బీజేపీ బలం గా ఉన్న రాష్ర్టాలలో కేంద్రీకరించాలి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దగ్గరలోనే హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. కానీ రాహు ల్బాబు ఇప్పటివరకు ఎక్కడ నిద్రలు తీసినట్టు! సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులో రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమైంది. అరువై రోజుల పాటు దక్షిణాది రాష్ర్టాలలో కాలక్షేపం చేసి ఈ నెల 7వ తేదీన మహారాష్ట్రలో అడుగు పెట్టిం డు. ఈ రెండు నెలల పాటు ఎవరికి వ్యతిరేకంగా ఆయన తిరుగాడినట్టు? కర్ణాటకలో మినహా ఆయన పార్టీ బలంగా ఉన్నదెక్కడ? ఈ రెండు నెలల విలువైన కాలాన్ని గుజరాత్‌లోనే గడపవలసింది కాదా! జోడో యాత్ర కార్యక్రమం నిర్ణయించడానికి ముందు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని తెలుసు. అయినా ఈ యాత్రలో గుజరాత్ లేనే లేదు. ఇటీవల విమర్శలు రావడంతో తమ నాయకుడు గుజరాత్లో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వారు చిన్నగా నసిగారు. ఎనకటికి ఒక మహా తల్లి ఊరికి పోయే కొడుకును కాదని ఏరగబోయే కొడుకుకు సద్ది కట్టిందట.
దేశవ్యాప్తంగా కానీ, తెలంగాణలో కానీ బీజేపీ ప్రమాదకరంగా ముంచుకొస్తున్నది. దీనిని అడ్డుకోవలసిందే. కానీ బీజేపీని కాదని కాంగ్రెస్‌ను నమ్ముకునే పరిస్థితి ఎంత మాత్రం లేదు. ఎనిమిదేండ్లు చూసిన తర్వాత కూడా ఇంకా రాహుల్ గాంధీ నాయకత్వంపై ఆశలు పెట్టుకుంటే అందుకు దేశం భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.
– పరాంకుశం వేణుగోపాల స్వామి