కొలిమిప్పుడు
ఏకాంతంలో లేదు
ఒంటరయ్యింది
నాగలి కర్రుల పలకరింపులు లేక
కొడవళ్ల కరచాలనాలు లేక
గడ్డపారల గిలిగింతలు లేక
మౌనంగా రోదిస్తోంది
కొలిమంటే కొలిమి కాదు
కమ్మర్ల గుండెచప్పుడు
రైతన్నకు ప్రాణనేస్తం
ఇంద్రసభ మధ్యలో ఇంద్రుడు ఉన్నట్టు
ఆసాముల మధ్యలో దాకలి ఠీవిగా నిల్చునేది
ఒకటా రెండా
ఊరు ముచ్చట్లన్నీ కొలిమి దగ్గరే
బాధల్లో ఓదార్పునిచ్చేది
సంతోషాన్ని రెట్టింపు చేసేది
ఆసాములకు కొలిమి ఒక కూడలి
కొలిమి ఒక కచ్చేరి
కొలిమి నిండా బూడిద నిండుకుంటే
ఇంటి నిండా ధాన్యం నిండుకునేది
కొలిమి ఎండిపోతే
ఇల్లు ఎండిపోయేది
కాలం కాటేసిందో
ఆధునికత అమాంతం మింగేసిందో
నిరంతరం మంటల భుగభుగలతో
రాజసాన్ని ఒలకబోసిన కొలిమి
నాగలి కర్రుల పలకరింతలతో
నిత్యం సంతోషాన్ని నింపుకున్న కొలిమి
ఈనాడు మూగబోయింది
బూడిదకు చిరునామాగా ఉన్న కొలిమి
ఇప్పుడు బూడిదలో కలిసిపోయింది