పాలకుల దృష్టిలో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మూసీ నది మురికి. ఫ్లోరోసిస్ సమస్యతో నల్లగొండ జిల్లాకు చెందిన అనేక గ్రామాల ప్రజలు శరీరం అంతా వంకరపోయి, జీవచ్ఛవాలుగా బతుకుతున్న వారిని చూసి అంత పెద్దాయన వాజపేయి కూడా కంటనీరు పెట్టుకున్నప్పుడు కూడా గుర్తుకురాని సమస్య నల్లగొండ జిల్లాకు చెందిన పెద్ద పెద్ద నాయకులకు హఠాత్తుగా మూసీ కంపు సమస్య గుర్తుకువచ్చింది. ఎప్పుడు గుర్తుకువస్తేనేం చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేల్కొల్పితే హఠాత్తుగా వీరికి మూసీ మురికి గుర్తుకువచ్చింది. మూసీని నేను అద్భుతంగా తీర్చిదిద్దాలనుకుంటే నల్లగొండ జిల్లా నాయకుల నుంచి కూడా స్పందన రాకపోవడం బాధ కలిగించిందని ముఖ్యమంత్రి ఆవేదన చెందినట్టు వార్తలు వచ్చాక ఆ జిల్లా నాయకులు మూసీ కంపుపై మాట్లాడటం మొదలుపెట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన ఆరు గ్యారంటీలను అటకెక్కించి ఎన్నికల్లో ఎప్పుడూ చెప్పని హామీని హైడ్రాను తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కంటిముందు కనిపిస్తున్న ఏకైక సమస్య మూసీ సుందరీకరణ. దీనికోసం హైడ్రాను రంగంలోకి దించారు. లక్షా 50 వేల కోట్లతో మూసీ నదిని సుందరీకరించనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలుత ప్రకటించారు. ఇప్పుడు లక్షా 50 వేల కోట్ల అంకె ఎక్కడి నుంచి వచ్చిందని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. సుందరీకరణ కాదు ప్రక్షాళన అని చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ గురించి చెప్పిన మాటలు, లక్షా 50 వేల కోట్ల రూపాయల అంకె ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్న ఉపన్యా సం.. ఈ రెండు వీడియోలు సామాజిక మాధ్యమా ల్లో వైరల్ అవుతున్నాయి. ఏడాదిలోపే ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడటం పట్ల రేవంత్‌రెడ్డికి అండగా నిలిచే మీడియాకు సైతం ఆందోళన కలిగించింది. జాగ్రత్త రేవంత్ నీ చుట్టూ ఉన్నవాళ్లు నీకు సరైన సలహాలు ఇవ్వడం లేదు, నిన్ను ముంచేస్తారని హితబోధ చేస్తున్నారు.
ఎవరో నడిపిస్తే నడవడం, ఎవరో చెప్తే వినే రకం కాదు రేవంత్‌రెడ్డి. అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలో శాసనమండలి సభ్యునిగా గుంపులో కాకుండా వన్ మాన్ షోగానే ఉండేవారు. రేవంత్‌రెడ్డి అనే కాదు ఏ రాజకీయ నాయకుడైనా తన రాజకీయ భవిష్యత్తు, తన ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటారు కానీ, ప్రజలకు మేలు చేయాలనేంతటి చిత్తశుద్ధి కెరీరిస్టు నేతల నుంచి ఆశించడం అత్యాశే అవుతుంది. లక్షా 50 వేల కోట్లు- హైడ్రా- మూసీ ప్రక్షాళన వ్యవహారం వెనుక ఏదో ఉంటుంది. ఏదో ఒకరోజు బయట పడుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీపై పోరాడేందుకు కాంగ్రెస్‌కు ఆర్థికంగా అండగా ఉండే రాష్ర్టాలు రెండే రెండు. ఒకటి కర్ణాటక కాగా, మరొకటి తెలంగాణ. శూన్యం నుంచి కేసులు పుట్టించగల నరేంద్ర మోదీ బృందం కాంగ్రెస్‌కు ఆర్థికంగా అండగా రాష్ర్టాలను చూసీ చూడనట్టు వదిలేస్తారా? కర్ణాటక ముఖ్యమంత్రి కుంభకోణంలో ఇరికారు. ఇక ఆయన పదవిలో ఉంటారో, వదిలేస్తారో చూడాలి. మిగిలిన ఒక్క రాష్ట్రంపై మోదీ కన్ను పడలేదంటే నమ్మలేం. ఈ నేపథ్యంలో రేవంత్ మాట మార్పు దేనికి సూచన?
ప్రక్షాళననా? సుందరీకరణనా? ఏదో పాలకులకే స్పష్టత లేదు. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌ను సుందరంగా తయారుచేసేందుకు మూసీ మురికి శుభ్రం చేయాలని చూస్తే విపక్షాలు అడ్డుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆవేదన. గంగా ప్రక్షాళనను మెచ్చుకుంటున్న వారు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారని ఆవేదన చెందారు. నిజానికి విపక్షాలకు రేవంత్‌రెడ్డి బృందమే విమర్శించేందుకు ఆయుధాలు అందిస్తున్నది. రేవంత్‌రెడ్డికి రాజకీయాల్లో ఎదిగే వ్యూహం తెలుసు కానీ, గంగా ప్రక్షాళన వంటి విషయాలు తెలియవు, అలాంటి వాటిపై ఆసక్తి ఉండదు. రేవంత్ రెడ్డి గంగా ప్రక్షాళన గురించి ప్రస్తావించగానే ఏడున్నర వేల కోట్ల రూపాయలతో గంగా ప్రక్షాళన చేస్తే అంతకన్నా తక్కువ నిడివి ఉన్న మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్ల రూపాయలు ఎందుకవుతాయని విమర్శలు వచ్చాయి. ప్రజలు మురికిలోనే ఉండాలి, మూసీ మురికిని తొలగించాలని ఎవరూ చెప్పడం లేదు. మురికిలో జీవిస్తున్న వారికి ముందు మరోచోట నివాసం చూపాలి. అన్ని ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు తీసుకొని, స్థలం కొని ఇండ్లు కట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తే ఆ ఇండ్లు కొన్నవారు నిస్సహాయులు కాబట్టి కుమిలిపోతారు. తమ ఉసురు తగలాలని తిడతారు. అంతే తప్ప సొంత మీడియా బృందం ప్రచారం చేస్తున్నట్టుగా ఆనందంతో గేట్లు వేస్తూ కొత్త ఇంట్లో పాలు పొంగించరు. ఒక మధ్య వయస్కుడు బ్యాంకు లోన్ తీసుకొని అన్ని అనుమతులతో ఇంటిని నిర్మించుకొని గృహ ప్రవేశం చేస్తే.. గృహ ప్రవేశం చేసిన ఆరు రోజులకే ఇంటిని కూల్చేశారు. ఇప్పటికీ అతను కూల్చేసిన ఇంటి వద్ద రోజూ కాసేపు కూర్చొని ఏడ్చి వెళ్లిపోతున్నాడు. అతనికి సరిగా ఏడవడం కూడా రావడం లేదు కుమిలిపోతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వారి వ్యధ కనిపిస్తున్నది. హైడ్రా రంగనాథ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రధాన మీడియా చూపడం లేదు, సామాజిక మాధ్యమాలు చూపుతున్నాయని తెగ బాధపడిపోయారు. వారన్నది నిజమే కానీ, ఏ మీడియా చూపుతుంది, ఏ మీడియా చూపడం లేదనే దానికన్నా సమస్య నిజమా? కాదా? వారి ఆవేదన నిజమా? కాదా? అనేది చూడాలి. కోట్లాది రూపాయల ఇండ్లు కూల్చారు కానీ, వారికి అనుమతులు ఇచ్చిన వారిపై ఎలాంటి చర్య లేదు.
ఆకర్షణీయంగా ఆరు హామీలను ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు హామీలను పక్కనపెట్టి హైడ్రాను, మూసీని ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రజలు ఆరు గ్యారంటీల మాట ఎత్తడం లేదు. మా ఇంటి మీదకు రాకు రేవంత్‌రెడ్డి.. మా మానాన మమ్ముల్ని వదిలేయండని రేవంత్ రెడ్డి మీద పాట కట్టి బతుకమ్మ ఆట ఆడారు. మహిళకు రెండున్నర వేల భరోసా లేదు. వృద్ధాప్య పింఛన్ 2016 నుంచి నాలుగు వేలకు పెంచుతామని చెప్పి 2016ను కాస్తా 2000కు కుదించారు. కల్యాణలక్ష్మీకి తులం బంగారం లేదు, విద్యార్థినులకు స్కూటీ లేదు. రైతులకే కాదు, రైతు కూలీలకు కూడా రైతు భరోసా అని హామీ ఇచ్చారు. ఇప్పుడు రైతులకే భరోసా లేనప్పుడు రైతు కూలీల గురించి ఆలోచించేదెవరు? ప్రస్తుతానికి ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నది. ఈ డబ్బులు ప్రభుత్వం ఆర్టీసీకి ఎప్పుడు ఇస్తుందో చూడాలి. సగం మంది రైతులకు రుణమాఫీ చేసినా మిగిలిన సగం మంది రైతులను అసంతృప్తికి గురిచేశారు. ఆరు హామీలు అమలు చేయాలంటే నిధులు ఉండాలి, అవి లేవు. కూల్చివేతలకు నిధులు అవసరం లేదు, బుల్డోజర్లు చాలు. అందుకే ప్రభుత్వం ఆరు హామీలను పక్కనపెట్టి అసలు హామీ ఇవ్వని హైడ్రాను నమ్ముకున్నది.
ఏడాదిలోపే ఇలా ఉంటే తర్వాత ఎలా ఉంటుందో కాలమే చెప్తుంది. ఏ హామీలతో తాము అధికారంలోకి వచ్చామో వాటికి ప్రాధాన్యం ఇచ్చి అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పాలకులది. తెలంగాణలో అమలు చేయకపోతే ఇతర రాష్ర్టాల్లో సైతం కాంగ్రెస్‌పై ప్రభావం ఉంటుంది. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అధికారంలోకి తేవడంతో కాంగ్రెస్ హర్యానాలో ఇంకొకటి కలిపి ఏడు గ్యారంటీలు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా ప్రచారంలో తెలంగాణలో అమలుకు నోచుకోని హామీల గురించి ప్రచారం చేశారు. రుణమాఫీ అంటూ తెలంగాణలో రైతులను మోసం చేశారని మోదీ హర్యానాలో ప్రచారం చేశారు. ఫలితం మన కండ్లముందే ఉన్నది.