హృదయాన్ని ఎన్ని సార్లు ప్రశ్నించినా
సమాధానం వచ్చినట్టే వచ్చి ఆవిరైపోతుంది.
నీటిలో చంద్రుడు కనిపిస్తే పట్టుకుందామని
ప్రయత్నిస్తే అలలన్నీ చెల్లాచెదురై చెరిపేస్తున్నాయి.
ఎదలో నాలుగు గదులనిండా అంతరంగం మాత్రం
గట్టి సంకల్పంతో ముందుకుపొమ్మంటున్నది.
అర్ధరాత్రి చీకట్లు కమ్ముకొన్న
వేల కళ్లల్లో మాత్రం
వెలుగు జిలుగులు మెరుస్తున్నాయి.
దారిపొడవునా కానరాని గమ్యాన్ని
గుండె నిండ వున్న ధైర్యం
రెండు కన్నులై చూపిస్తుంది.
బాధల బరువుల్లో చిక్కుకొని
తనువంతా గాయపడి తడబడుతున్న జీవితం
స్పప్నాలన్నీ జాతరలై వస్తున్నాయి.
కానీ, నిజమైన బతుకుజాతర రసరమ్యంగా
సాగుతుంది.
ప్రతిరోజు ఒక కొత్త చరిత్రను
రాసేలా గడుస్తుంది
ప్రయత్నానికి విసుగొచ్చేలా..
కండలన్నీ కరిగిపోయి
చెమట చుక్కల వర్షం కురుస్తుంది.
యుద్ధంలో ఎక్కడా విరామం లేదు.
మనిషివై పుట్టాక విజయం రుచిని చూడకుండా
ఎలా వుంటావ్ అని అనంతరం
అడుగుతూనే ఉంది.
సమాధానం గొంతుదాటని జవాబై చూస్తుంది.
నేడు కాకపోతే రేపు.. ఇక్కడే ఉంటాను
విజయతీరాన్ని ముద్దాడి వస్తాను.
కాలానికి సవాల్ విసురుతూనే వున్నాను
మాయ మనుషులు ఉచ్వాస నిశ్వాసలను
బంధించినా.. కాలం కసితో కాటేసినా..
గతాన్ని కష్టమనే మందుతో కడిగేసి సాగిపోతాను.
గెలుపు కిటికీలు తెరిచేవరకు