ఒక యోధుడి చేవ్రాలు
అరుణోదయ వేళ ఉషోదయాన
అలలు ఎగసిపడుతున్నాయి
విత్తనాలు మొలకెత్తి చిగురిస్తున్నాయి
శిలలు కలగంటున్నాయి
కన్నీళ్లు నిప్పుల నెగళ్లయి నినాదాల హోరులై
కలాలు గళాలు కార్యార్థులై కదులుతున్నాయి
గులాబీలు ప్రేమకు చిహ్నాలే గాదు!
అస్తిత్వ నెత్తురును తిలకంగా దిద్దుకుంటాయి!
చరితను మలుపుతిప్పిన తొలి అడుగు
శిలను మనోహర శిల్పంగా మలిచింది
తొలకరి రైతులా
తీగతో నగను చేసినట్టు
వెదురు బరుగుతో గుమ్మినల్లినట్టు
కొలిమి ఆరలే, జెండా కిందికి దిగలే
అవమానాల్లోంచి ఆత్మగౌరవ స్వరం
అణచివేతల్లోంచి ఫీనిక్స్ పక్షిలా
బుద్ధుడి సాక్షిగా
తెలంగాణకై సమరశంఖం
వేయి నాల్కల అసత్యాలు
వేల విధ్వంసాలు
తూర్పును మథించకపోతే
పొద్దు పొడువదని తెలుసు
మబ్బులకు చెమటలు పట్టించి
ఎండలకు వణుకు పుట్టించి
పార్లమెంటు గొంతుకల్లోంచి
బిల్లును ఆమోదింపజేసి
తెలంగాణ కొమ్మును చేత పట్టుకొని
బయల్దేరాడు కేసీఆర్
మొండి చేతుల కుట్రలు ఆగలే
తెలంగాణ శ్వాస ఆగలే
అమరుల స్ఫూర్తి జలదృశ్యం జన సంద్రం
అహింసామార్గం
తొలకరి మెరుపులా
భుజాన రైతు నాగలి గుర్తు
గులాబీ పతాక రెపరెపలు
గమ్యం చేరువలో గగనాన విజయమై
తెలంగాణ స్వాతంత్య్రానికి ఊపిరిలు
తెలంగాణంటేనే తిరుగుబాటు
తంగేడు పూల బోనాల బతుకమ్మ పోరు
ఎదలో తెలంగాణ తల్లి ప్రతిరూపం
తలవంచని ధీరత్వం
కోట్ల గొంతుకల ఆకాంక్ష
మట్టికరిచిన సమైక్య నియంతృత్వం
ఆల్చిప్పలో ముత్యంలా
ప్రతినబూనిన అస్తిత్వ పతాకం!
జై కొడ్తె జైలు, బోనులో అస్తిత్వం
కరెంటు కాల్పులు, బషీర్బాగ్లో మరణాలు
కల్లోలిత కర్ఫ్యూలు, హక్కుల అణచివేతలు
పద్నాలుగేండ్ల నిరీక్షణలు
ఎవరు జై కొట్టినా అలాయి బలాయితో
తెలంగాణకే దోస్తరదీన్లు
రాజకీయాల మద్దతు కోసం ఎత్తుకు పైఎత్తులు
అలుపెరుగని ప్రయాణాలు
తెగించిన పోరు సైరన్లు
తెలంగాణ తల్లి
విప్లవ కెరటమై పోరాడింది
గులాబీ తోటై విరబూసింది
అందరినోట ‘జై తెలంగాణ’ అనిపిస్తూ
గులాబీ దండలతో రజతోత్సవానికి పరుగులు
కరీంనగర్ గర్జనలు.. ఓరుగల్లు జైత్రయాత్రలు
కామన్ మినిమం పోగ్రాంలు
ఉప ఎన్నికలు, రాజీనామాలు రెఫరెండాలు
ద్రోహుల ఫిరాయింపులు
మహోజ్వల ఘట్టాలు
దిక్కులు పిక్కటిల్లే ఉరుములు
తెలంగాణ వస్తుందంటవా..?
మఖలో పుట్టి పుబ్బలో పోతుందని..
ఎక్కిరింపులు ఎగతాళులు
అసెంబ్లీలో పేరెత్తితేనే నేరం
నిషేధిత పదం నిలువెత్తు రూపం
భాష రాదని పలికిన పండితులంతా
ఎక్కడ దాక్కున్నారో..?
తల్లి గోస ముందు
అధికారం గొప్ప కాదు
రాజకీయ మకుటాన్ని ఇసిరేశారు
మది నిండా అస్తిత్వపు జెండా
మలి దశ ఉద్యమ దిశ
విశాలాంధ్ర పాటలకు పాతరేసి
సబ్బండ వర్ణాలను ఏకం చేసిన
సకలజనుల విశ్వరూపం
ఆమరణ నిరాహార దీక్షలు
డిసెంబర్ 9 అర్ధరాత్రి ప్రకటనలు
కోడి కూతకు ముందే వెనుకడుగులు
సకలజనుల సమ్మెలు, సాగరహారాలు
మిలియన్ మార్చిలు, మానవహారాలు
జూన్ రెండు, రెండు వేల పద్నాలుగేండ్లు
తెలంగాణకు స్వేచ్ఛా గాలులు
విషసర్పాల విలవిలలు
రాష్ర్టాధికారం తెలంగాణోదయమై
పునర్నిర్మాణంలో
అప్రతిహత అజేయ మిసిమి
ఇప్పటికీ, ఎప్పటికీ
తెలంగాణ శ్వాసే అంటూ
ఒక యోధుడి చేవ్రాలు
పురి విప్పే గులాబీల
పరిమళాలు
రజతోత్సవాల
వసంతోత్సవాలు…