మా బొండిగల పాణం వున్నంత దాంక
సీకట్లను సీల్చుకొని వత్తానే వుంటం
మీ కువారాల్ని కూకటి వేళ్లతో పీకి
మా ఇలాకలో మా తెల్వేందో
పెత్తనమేందో సూపిత్తనే వుంటం
గింజుకుంటరో గిరాటుకొట్టుకుంటరో మీ యిస్టం
కలలుగన్న బడుగు బలహీన వర్గాల కోసం
కళ్లల్లో ఒత్తులేసుకుంటూనే వుంటం
ఆకలి కేకల్ని కడుపుల్లో దాచుకొని
సంబురాలను అంబరంగా
అలాయి బలాయిలిచ్చుకుంటూ
జబర్దస్తిగ జరుపుకొంటం
వెనుకబడిన తరగతులను
తీర్చిదిద్దుకుంటం
నోటికాడి బువ్వకు నాలుకల్ని అడ్డమేస్తే
బీసీ గర్జనై గొంతెత్తుతం
మురికిపడ్డ విధానాల్ని చాకిరేవులో ఉతుకుతం
రాజకీయ కువారాల గొంతుల్ని కోసి
రాజ్యాంగ సవరణ చేయిస్తం
సామూహిక యుద్ధం కోసం సన్నద్ధమైతం
కమ్మరి కొలిమిలో..
కంసాలి కుంపటిలో.. భగభగ మండి
మమ్మల్ని మేము సాన బెట్టుకొని
కుమ్మరి చక్రమై నిరంతరం తిరుగుతం
సుత్తె కొడవళ్లు పట్టుకొని
బడాయిగా లడాయి చేస్తూనే వుంటం
మా తంగేడు పూల తల్లికి
పగడాల పచ్చల హారమేసి
జమ్మిచెట్టు కొమ్మపై నుంచి
కొమ్ముబూర ఊదుతం
పచ్చని పల్లెలో పాలపిట్టయి పండుగ జేస్తం
సాధించుకున్న స్వేచ్ఛను
సాకారం జేసుకుంటం
అక్షరాల కాకతీయ తోరణం కడుతం
బీసీ విమోచన దినమై ఊరేగుతం
ఉద్యమ పతాకాలమై ఎగురుతం
మా వెనుకబాటును ఎక్కిలి సేత్తూ
మా అస్తిత్వాన్ని పొక్కిలి సేత్తే
పక్కలో బల్లెమైతం
మా కళను చిత్తుగ సూత్తే
ఉప్పెనై విరుసుకుపడుతం
మమ్మల్ని మేమెప్పుడూ
మెరుగుబెట్టుకుంటూనే వుంటం
ఉద్యమ బలాలమై ఊపిర్లూదుకుంటం
కొత్త స్వరాలమై పురుడు పోసుకుంటం
కాగడాగా వెలగడం పచ్చని మొక్కై మొలవడం
మా పుట్టుక లచ్చనమే
మట్టిలో మాణిక్యమై వున్నోళ్లం
మిల మిల మెరిసే
బంగారమెట్లవ్వాలో తొవ్వల్దెల్సినోళ్లం
ఒంటి నిండా సెమట సుక్కల్ని ముద్దాడ్తం
గుండె నిండా సోపతి సిత్రాల్ని పొగుడ్తం
కొత్త పొద్దయి మళ్లీ మళ్లీ
పొడుస్తూనే వుంటం..!
– డాక్టర్ కటుకోఝ్వల రమేష్ 99490 83327