ఎగరలేని పిల్లి
శాపనార్థాలు ఎన్ని పెట్టినా
ఉట్టి తెగిపడదు!
మరణం
ఎవరి ఆజ్ఞలు పాటించదు
పసలేని మాటకు విలువ ఉండదు!
వేలెత్తి చూపేవాడు
శత్రువు ఎన్నటికీ కానే కాడు
అర్థం కాని ఆవేశమే అనర్థం!
ప్రత్యర్థి
అవకాశమిచ్చినప్పుడే
పుంజుకునే ప్రయత్నం చేయాలి!
జాగ్రత్త! చుట్టూ చేరిన వ్యర్థులు
నీ మీసాలు అసందర్భంగా
వాళ్లు మెలివేస్తారు!
సమర్థులకే కదా
సవాళ్లు మొలిచేవి
యుద్ధనీతిని
పాటించకపోతే అపకీర్తే!
మరణం ఎప్పుడూ
అదృష్టశక్తే
అది ఎవరో చెబితే తలుపు తట్టదు!
చావు ఎప్పుడు
ఎవరి భుజం మీద చెయ్యి వేసినా
సాక్ష్యానికి సమయం ఉండదు!
మిత్రమా ఇతరుల మరణం
రాజెప్పుడు కోరరాదు
ఎవరి చావు అంతిమ పరిష్కారం కాదు!!