అమ్మ లాంటి నమ్మకం
నీ ముందు నడుస్తున్నది
నాయినసొంటి ధైర్యం
నీ వెన్నంటి వస్తున్నది
‘గూట్లె దీపం
నోట్లె బుక్క’
ఎద్దెం మద్దెం గాని దినాలే
నీ పక్కల వున్నయి
నీ బురద కాళ్ళను కడిగే గంగ
నీ నెత్తిమీదే వున్నది
ఎక్కేందుకు, ఎగబాకేందుకు,
ఎదిగేందుకు
కాళ్ళకాడ
నిచ్చెన వేసే వున్నది
ఆరిపోని కొత్త బంగారి వెల్గుల
ఖాన్దాన్ ప్రతీకలు
నీ శ్వాసకు గర్వ పరిమళం
అందించేటట్టే వున్నయి
మనసున్న వాడా!
ప్రజాక్షేత్ర పాలకుడు
నీ కడపలో కాలు పెట్టిండు
పత్రమో, పుష్పమో సమర్పించి
అంతరంగపు ఆలింగనమియ్యి!
– విశ్వావసు