పాల పిట్టల సూడాలే
పారే వాగుల ఈదాలే
నింగికి నేలకు నిచ్చెనలేసి
సుక్కలు తుంచుక రావాలే
పూలకు దోసిలి పట్టాలే
పున్నమి నవ్వయి నవ్వాలే
సిన్నలు పెద్దలు గూడాలె
సింగిడి నేలకు దింపాలె
కొమ్మ రెమ్మా కొండకోన సెరువు గట్టు
తానాలు ఆడే వాన జల్లులో
ఊరె తేనెపూల గాలిలోన తేలి
తుమ్మెదలె కోలాటాలు ఆడెనో
వాగు వంకల్లు పొంగి పారినాయో
ఊరు ఊరంతా ఊగి ఆడినాదో
ఏటి నవ్వే ఎన్నెలయి వొలికిందో
పూసిన సెట్టువమ్మా
పూల గట్టువమ్మ
పూల బుట్టబొమ్మ నీవే
గౌరమ్మా పుడమి సిరుల తల్లివే
పాలపిట్టవమ్మా
పాటవమ్మా నీవు
మా పల్లె తల్లి పాలవెల్లివే
గౌరి గంగ సంగమాల నోము
పూల తేరులో
పసుపు కుంకుమ పారాణి
పట్టుకాంతుల రాణి
బంతి చేమంతుల గునుగు
గుమ్మడిపూల రాసిలో
పల్లె ముంగిళ్లలోన
రంగవల్లుల వాన
మొగిలిపూల మొగ్గలాయె
పల్లె బుగ్గ సిగ్గులాయె
ఆటలాయె పాటలాయె
వాడవాడలో
పూసేపూల నేతలాయె
వీధులెల్ల జాతరాయె
జట్టు జట్టు ఒక్కటయ్యి
కొట్టె దరువుల్లో
మేళతాళాలు
గోపురాల దీపాలో
పూసిన సెట్టువమ్మ
పూల గట్టువమ్మ
బుట్టబొమ్మ
నీవే గౌరమ్మా
పుడమి సిరుల తల్లివె
పాల పిట్టవమ్మ
పాటవమ్మ
నీవు మా పల్లెతల్లి
పాలవెల్లివే
పాలు పోసుకున్న
సద్దసేల పైరగాలిలో
బీరతీగ పువ్వులో
తెల్లజొన్న నవ్వులో
బంగారు రేకులోలె
పొంగె తంగేడు పూలో
భూతల్లి మెడలోన
అల్లుకున్న హారాలో
సుక్కలన్ని ముగ్గులయ్యి
వాకిల్లా మెరిసే
వెలుగు పూలు విరగబూసి
ఎన్నెల్లే కురిసే
అరుగులన్నీ గౌరమ్మాల
కొలువులై వెలిసె
అరచేతులే దరువులై
అవనీనాడించె
కోటి రాగాల
భోగాల వేడుకలో
పొన్నపుంతవమ్మా
పొగడ రాశివమ్మా
పూలగంధమమ్మా
పుడమి అందమమ్మా
గౌరమ్మా నీవే మా సిరుల తల్లివి
పాల పిట్టవమ్మ పాటవమ్మ
నీవే మా పల్లెతల్లి పాలవెల్లివే
-గోరటి వెంకన్న