‘తేనెలు పిండే తెలంగాణము / నెత్తుట ముంచెత్తదరా? తెప్పరిల్లిన, ఈ తెలంగాణము / కుత్తుక బట్టొత్తెదరా..?’ అంటూ.. 1950లో మాడపాటి హనుమంతరావు పీఠికతో ‘సాధన సమితి’ పేరున తెచ్చిన ‘ప్రత్యూష’ కవితా సంకలనంలో భాగి నారాయణమూర్తి అనే కవి ఆగ్రహించాడు. ఏ పరిస్థితుల్లో ఆ కవి అలా ప్రశ్నించాడో కానీ అది నేటి పరిస్థితికి అచ్చంగా అద్దం పడుతున్నది. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో దూసుకుపోతున్న తరుణంలో కొందరు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ప్రగతి ప్రయాణం కాళ్లల్లో కట్టెబెడుతున్నారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి అభినందించి సహకరించాల్సింది పోయి అవరోధాలు సృష్టిస్తున్నారు. కండ్లముందున్న దాన్ని కూడా చూడ నిరాకరిస్తూ, తేనెలొలికే తెలంగాణగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్పై, రాష్ట్రప్రభుత్వ పనితీరుపై అవాకులు, చెవాకులు పేలుతున్న తీరు గర్హనీయం.
తెలంగాణ అవతరణ తర్వాత రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ఏ రంగంలోనైనా, ఎన్ని గణాంకాల్లోనైనా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెజారిటీ ప్రజల జీవనాధారంగా ఉన్న వ్యవసాయరంగాన్ని తీసుకుంటే ఓ నవశకమే వచ్చిందని పేర్కొనవచ్చు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణ ఇవ్వాళ సస్యశ్యామలమైంది. ఓనాడు తాగు, సాగునీరు కోసం పాతాళానికి తవ్వినా చుక్క నీటి ఊట కనపడని తెలంగాణ నేడు జలకుండ అయ్యింది. బోరుబావుల నుంచి ఊట ఉబికి వస్తున్నది. దీనికితోడు చేపడుతున్న వినూత్న రైతుసంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రమే ధాన్యాగారంగా మారింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానం, పత్తిలో అగ్రస్థానంలో తెలంగాణ నిలువటం వెనుక సీఎం కేసీఆర్ రైతు అనుకూల విధానాలే కారణమని వేరే చెప్పనక్కర లేదు. జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ఆయా సందర్భాల్లో తెలంగాణ వ్యవసాయరంగ అభివృద్ధి గురించి చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం.
ఈ మధ్యనే ఓ అంతర్జాతీయ సదస్సులో ‘వ్యవసాయాభివృద్ధికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక ఆసక్తికర ఉదాహరణ’ అని ప్రముఖ పాలసీ రీసెర్చర్ హరీశ్ దామోదరన్ కొనియాడారు. హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ అయితే.. తెలంగాణలో విత్తన ఉత్పత్తిలో వచ్చిన విప్లవాత్మక మార్పులను చెబుతూ, ‘ప్రపంచ విత్తన భాండాగారం తెలంగాణ’ అని శ్లాఘించారు. ప్రపంచబ్యాంకు కూడా ‘రైతుబంధు’ను రైతు రక్షక కవచంగా కీర్తించింది. దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు తైవాన్, హాంకాంగ్ దేశాల ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయ పథకాలను ఆదర్శం, అనుసరణీయమన్నారు. సాగు పెట్టుబడికి సాయం భేష్ అని కేంద్ర వ్యవసాయ కమిషనర్ మల్హోత్రా అంటే, ఈ-నామ్ అమలులో తెలంగాణ మార్గం అనుసరణీయమని కేంద్రమంత్రి తోమర్ ప్రశంసించారు. ప్రధాని మోదీ మొదలు వివిధ శాఖల మంత్రులు, బీజేపీ నేతలు తెలంగాణ పథకాలను మెచ్చుకున్నవారే. రాజకీయం కోసం ఏదైనా మాట్లాడొచ్చు, కానీ.. ‘పూలలో వరి పైరులో/ పాల వెన్నెల చలువతో/తేలి సాగెడు గాలి యూ/దెడు యీ నేలలో..’ తెలంగాణ దేశానికే ఓ ఆదర్శం, ఓ మార్గదర్శి.