దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రభాగాన ఉన్నది. మన నగరానికి ఉన్న భౌగోళిక, వాతావరణ అనుకూల పరిస్థితులు అభివృద్ధికి, విస్తరణకు అవకాశంగా మారాయి. దీన్ని అందిపుచ్చుకొని హైదరాబాద్‌ను విశ్వనగరంగా రూపుదిద్దేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నది. ప్రస్తుత నగర అవసరాలను తీరుస్తూనే, భవిష్యత్తుపై దృష్టిసారించింది.
నలుదిశలా విస్తరించనున్న హైదరాబాద్ నగరం, పెరగనున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ముందుచూపుతో వ్యవహరిస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. ముఖ్యంగా ఇందులో ‘రీజినల్ రింగ్ రోడ్డు’ నిర్మాణం ప్రధానమైనది. ఇది హైదరాబాద్ నగరానికే మణిహారం వంటిది. సగం తెలంగాణను హైదరాబాద్‌లో భాగం చేసే బృహత్తర ప్రణాళిక ఇది. ఈ ప్రాంతీయ వలయ రహదారి హైదరాబాద్‌తో పాటు, చుట్టుపక్కల జిల్లాల రూపురేఖలనే మార్చేయబోతున్నది. ప్రపంచంలో ఇప్పటివరకు నిర్మించిన వ్యూహాత్మక రహదారుల్లో మన ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి కానున్నది.
హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయం ఎంతో దూరదృష్టితో కూడి ఉంటుంది. ముప్ఫై ఏండ్ల ముందుచూపుతో నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్‌లోనూ ట్రాఫిక్ సమస్యలు ఉండకుండా ఎస్ఆర్డీపీ, లింక్ రోడ్ల పనులు చేపట్టి వేగంగా పూర్తిచేస్తున్నారు. ‘స్కై వే’ల నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా కనుమరుగవుతుంది.
భవిష్యత్‌పై ప్రభుత్వాలకు అంచనాలు లేకపోతే అభివృద్ధి జరిగినా నగరాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటాయి. దీనికి ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో బోలెడు ఉదాహరణలున్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న పది నగరాల్లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయి. ఆ పరిస్థితులు మన హైదరాబాద్‌కు రాకుండా సీఎం కేసీఆర్ ముందుచూపుతో నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నగరం చుట్టూ గతంలో నిర్మించిన ‘ఔటర్ రింగ్ రోడు’్డ ఇప్పుడు హైదరాబాద్‌లో భాగమైపోయింది. ‘ఓఆర్ఆర్’ బయట కూడా కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. అనేక పరిశ్రమలు, సంస్థలు నెలకొల్పుతున్నారు. ఇవి ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో నగర భవిష్యత్ అవసరాల కోసం ‘రీజినల్ రింగ్ రోడ్డు’ అత్యావశ్యకం. గతంలో నగర శివార్లు అభివృద్ధికి దూరంగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే, తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మార్గదర్శకంలో నగరం అన్నివైపులా అభివృద్ధి పరుగులు తీస్తున్నది.
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల మీదుగా ‘రీజినల్ రింగ్ రోడ్డు’ ఏర్పాటుకానున్నది. దీంతో ఈ జిల్లాలు నగరంలో భాగమవుతాయి. జిల్లా ప్రజలు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చే అవసరం లేకుండా వారికి సమీపంలోనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. భూముల ధరలు పెరిగి రైతులకు ఆర్థిక భరోసా దక్కుతుంది. రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. నగరం చుట్టూ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లను ఏర్పాటుచేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. వర్క్ ప్లేస్ (కార్యాలయం), ఇల్లు ఒకే చోట ఉండేలా ఈ టౌన్‌షిప్‌లు ఉండాలనేది మంత్రి కేటీఆర్ ఆలోచన. రాష్ర్టాభివృద్ధిలో ‘రీజినల్ రింగ్ రోడ్డు’ కీలకం కానున్నది.
(వ్యాసకర్త: ఎన్.యాదగిరిరావు, 97044 05335 , అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ)