కవిత – పద్యం, పాటల పోటీ
పద్యం, కవిత ఒక విభాగం, పాట మరో విభాగం రెండు విభాగాలకు విడి విడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పది విశిష్ట బహుమతులు ఉంటాయి.
నా తెలంగాణ దిగ్దిగంతముల దాక
పరచినట్టి జ్యోత్స్నామయ ప్రభలలోన
పోతన కవి నుండి నాదాక పొంగి పొరలె
కావ్యవారాశి; కనుము లోకమ్మునందు
అంటూ కావ్య గానం చేశాడు మహాకవి దాశరథి. ప్రజల గొడవే ‘నా గొడవ’ గా ఎలుగెత్తి చాటే కాళోజీ తెలంగాణ అస్తిత్వ పోరాటానికి అండగా తన కలాన్ని ఝళిపించాడు. సమాజం కోసం సాహిత్యాన్ని ప్రభవింపచేసిన పాల్కురికి వంటి మహాకవుల సమున్నత వారసత్వం మనది. తెలంగాణ కవులు ఎప్పుడూ సమాజంతో మమేకమై సాగుతారు. చరిత్ర పొడుగునా అనేక ఎగుడుదిగుడులను, సంక్షోభాలను అనుభవించిన తెలంగాణ స్వీయ అస్తిత్వాన్ని సంతరించుకొని, దిశానిర్దేశం చేసుకొని ప్రగతి పథాన పయనిస్తున్న దశ ఇది. నదీ జలాలను బీడు భూములకు తరలించి రైతన్నల కన్నీరు తుడుచుకున్నాం. గ్రామీణ వృత్తులకు ఆలంబన ఇస్తున్నాం. ఆడపడుచులకు భద్రత, భరోసా లభిస్తున్నది. పారిశ్రామిక రంగంలో పరుగులు పెడుతున్నాం. సంక్షేమ రంగంలో మనకు సాటిలేదని చాటుకున్నాం.
తెలంగాణ ఉద్యమానికి అండగా తమ కలాన్ని, గళాన్ని అందించిన ఘనత కవులు, రచయితలది. రాష్ర్టాన్ని సాధించుకోవడమే కాకుండా తెలంగాణ సమాజం దేశానికే తలమానికంగా ప్రగతి పథంలో పయనిస్తున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ‘నమస్తే తెలంగాణ’ ఆవిర్భవించి పదకొండేండ్లు అవుతున్నది. ఈ సందర్భంగా ఎనిమిదేండ్ల తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంపై మీ సాహితీ స్పందనను ఆహ్వానిస్తున్నాం.