పర్యావరణ సమతుల్యతను కాపాడుకోకపోతే మానవాళి మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. అందువల్లే ప్రకృతిని పరిరక్షించుకోవటం అన్నది నేడు అంతర్జాతీయంగా ప్రధాన అంశమైంది. రాబోయే తరాలకు పుడమి తల్లిని భద్రంగా అప్పగించటం మన అందరి కర్తవ్యం. తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టావిర్భావం నుంచీ ఈ కర్తవ్యాన్ని నెరవేర్చుతున్నది. హరితహారం కార్యక్రమం ద్వారా గొప్పగా కృషి చేస్తున్నది.
హరితహారం పథకం వల్ల రాష్ట్రంలో నిర్దేశిత లక్ష్యాలకు మించి మొక్కల పెంపకం జరిగినట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచుకునే లక్ష్యంతో హరితహారం ప్రారంభమైంది. ప్రస్తుతానికి పచ్చదనం 7.6 శాతం పెరిగి 31.6 శాతానికి చేరింది. 2015 నుంచి 2021 వరకు 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా, 236.09 కోట్లకు పైగా మొక్కలు నాటి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది.
ఉమ్మడి రాష్ట్రంలో తరిగిపోయిన అడవులు మళ్లీ దట్టంగా మారుతున్నాయి. అడవుల్లో జీవ జాతుల సంఖ్య పెరిగింది. అద్భుతమైన జీవ వైవిధ్యం కనిపిస్తు న్నది. ఈ మార్పులకు కారణం హరితహారం అని ‘ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ నివేదికలు స్పష్టం చేస్తున్నవి. మొక్కల పెంపకంలో, అటవీకరణలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వమే లోక్‌సభలో తెలుపటం గమనార్హం. ‘హరిత హారం’ కార్యక్రమాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నంగా ఐక్యరాజ్యసమితి సైతం గుర్తించింది.
హరితహారాన్ని జీహెచ్ఎంసీలో విజయవంతంగా అమలు చేయడంతో విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందుబాటులోకి వచ్చింది. హరిత నగరంగా మారిన హైదరాబాద్‌కు వరుసగా రెండోసారి ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’ అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దాదాపు మూడున్నర కోట్లకు పైగా మొక్కలు నాటడం తోపాటు, వాటిని సంరక్షించేందుకు చేపట్టిన చర్యలతో హైదరాబాద్‌కు ఈ గుర్తింపు దక్కింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలకే ఈ పురస్కారం లభించగా.. భారత్ నుంచి కేవలం హైదరాబాద్ మాత్రమే ఈ గౌరవం లభించింది.
హరితహారం కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హరితనిధి’ని ఏర్పాటు చేయటం విశేషం. దీనికోసం రాష్ట్ర బడ్జెట్లో రూ. 932 కోట్లు కేటాయించారు. హరిత హారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంతోమంది సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛందసంస్థలు పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావటానికి ఈ కార్యక్రమం తోడ్పడుతున్నది. గ్రీన్ఇండియా చాలెంజ్‌ను ప్రశంసిస్తూ స్వయంగా ప్రధానమంత్రి అభినందన లేఖ రాశారు. ధరిత్రి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించినవారమవుతాం.
(వ్యాసకర్త: పుల్లూరు వేణుగోపాల్ , అసోసియేట్ అధ్యక్షులు, టీఎన్జీవోస్ యూనియన్, హనుమకొండ జిల్లా)