ఎప్పటిలాగే నువ్వు
అతి సాధారణంగా వచ్చావ్..!
వేకువ జామున తెల్లవారినంత సహజంగా
గూడు వదిలి పిట్టలు ఏ లక్ష్యమూ లేకుండా గాలిలో ఎగిరినంత స్వేచ్ఛగా
బహురూపాలతో తోసుకువెళ్తున్న మబ్బులంత సందడిగా
కొండకోనలు దాటి దూకుతున్న జలపాతం అంత సంబురంగా
బీడు భూములన్నీ పచ్చని పొలాలుగా మారినంత సుందరంగా
అత్యంత మామూలుగా నువ్వొచ్చావు!
ఊరంతా సంచరిస్తూ నా వాకిట్లోకి వచ్చిన క్షణాన
నిన్ను ఎట్లా ఆహ్వానించాలో నాకు తెలీలేదు
అప్పటికే నా ఇల్లు సగం కూలిపోయింది
నా కళ్ళు కన్నీళ్లకు సైతం కరువయ్యాయి
కాళ్లు కదలక అడుగులు ముందుకుపడక
చేతులు చాచలేక దేనినీ అందుకోలేక
కంటిచూపు మందగించి- చెవుల వినికిడి తగ్గిపోయి
అన్నీ ఉండి ఏమీ లేనితనంలో కూరుకుపోయి
ఒంటరి ప్రపంచాన్నై నేను ఉన్నాను!
నవ్వానో.. ఏడ్చానో.. అభావంగా ఉన్నానో.. తెలీదు
నిర్లిప్త సంగీతానికి నిర్జన గీతాలతో నిర్జీవ రాగాలాపన చేస్తున్నాను
నిరాశల జతులకు నిస్తేజ భంగిమలతో ఏకాంత నృత్యాన్ని ఆడుతున్నాను
ఉన్నానో లేదో తెలియని ఉనికిలో నన్ను నేను నిలబెట్టుకుంటూ..
ఇక్కడ కాలతీరంలో ఓ చివరన నేను పడి ఉన్నాను!
ఆ క్షణమే అనుకోని అతిథిలా నువ్వొచ్చావు!
ముక్కలైన ఇంటిని- కూలిపోయిన స్వప్నాలను
శిథిలమైన ఆశలను నువ్వు చూశావు
మెత్తటి అడుగులతో వచ్చి సుతిమెత్తగా నన్ను హత్తుకున్నావు!
సంక్షోభాలను- సవాళ్ళను
సౌందర్యవంతంగా ఎలా మలచుకోవాలో..
భీభత్సాలను- విధ్వంసాలను
వికాసభరితంగా ఎలా దిద్దుకోవాలో..
కన్నీళ్లను- ఒంటరితనాన్ని
ఎలా సఫలం చేసుకోవాలో..
యుద్ధాలను – కరోనా – డెల్టా- ఒమైక్రాన్ దాడులను
ఎలా ఎదుర్కోవాలో నేర్పించావు!
పడిపోతాననుకున్న ప్రతిసారీ నన్ను నిటారుగా నిలబెట్టావు
కళ్ళల్లో ధైర్యాన్ని నింపి గుండెల్లో ఆశల సూర్యుని వెలిగించావు
ఇప్పుడు ఏ సమరాన్ని అయినా గెలిచేలా నన్ను సన్నద్ధం చేశావు..!
కాలమా.. నా జీవమా..!
నాతో ఈ దుర్గమ దారుల వెంట
అడుగులో అడుగై నడిచినందుకు నమస్సులు..
దారి పొడవునా నన్ను కూలిపోకుండా నిలబెట్టినందుకు కృతజ్ఞతలు..
నడుస్తున్నంత మేరా నాలో జీవనోత్సాహాన్ని నింపినందుకు ధన్యవాదాలు…
కాలమా.. నా ప్రాణమా..!
Thank you for being my friend, partner and companion in all these troubled, turbulant and tarnished times…
కాలమా.. నా సహచరీ..!
ప్రతిరోజునూ ఓ వేడుకలా చేసినందుకు
ఆనంద రహస్యాన్ని తెలిపినందుకు
నీకు దండాలు!
ప్రతి మలుపు దగ్గర నన్ను
గెలుపు వీరున్ని చేసినందుకు
నీకు శనార్థులు!!
–మామిడి హరికృష్ణ
80080 05231