భారత్.. సమాఖ్య దేశం అన్న విషయం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరిచిపోయినట్టుంది. అందుకే తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలతో ఒకరకంగా, ఇతర, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలతో మరో రకంగా వ్యవహరిస్తున్నది. తనకున్న అధికారాలను వాడుకొని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు విషయంలో అదే జరుగుతున్నది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధుల్లోనూ జోక్యం చేసుకుం టూ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై వివక్ష చూపెడుతున్నది.
రాజ్యాంగం ప్రకారం.. దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడం, ఆహారధాన్యాల కొర త లేకుండా చూడటం, ధరల నియంత్రణ కేంద్రం బాధ్యత. కరువు పరిస్థితులు, యుద్ధాలు వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఆహారాన్ని పంపిణీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లుచేసి ఉంచాలని రాజ్యాంగం చెప్తున్నది. అయితే.. ఆహారధాన్యాల నిల్వ విషయంలో రాష్ర్టాలకు బాధ్యత అప్పగిస్తే ఇబ్బందులు వస్తాయని రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించారు. ఎందుకంటే అన్ని రాష్ర్టాల్లో అన్ని పంటలు పండవు. ఫలితంగా ఆహారధాన్యాల నిల్వ ప్రక్రియ సరిగా జరగదనే ఉద్దేశంతో ఈ బాధ్యతను కేంద్రానికి ఇచ్చారు. ఆహారధాన్యాల ఉత్పత్తి జరగాలంటే దానికి అనుకూలమైన పరిస్థితులు రాష్ర్టాల్లో ఉండాలి. ఆ బాధ్యతను రాజ్యాంగం రాష్ర్టాలకు అప్పగించింది. రైతులకు విత్తనాలు, ఎరువులు, నీటివసతి, నాణ్యమైన విద్యుత్ వంటివి అందించాలి. ఆ బాధ్యతను తెలంగాణ పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తున్నది. కానీ ఉత్పత్తి అయిన ధాన్యా న్ని కొనాలనే బాధ్యతను మాత్రం కేంద్రం పూర్తిగా విస్మరించింది. పైగా రాష్ట్రంపై నెపం వేస్తూ సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది.
మోదీ నేతృత్వంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాగానే ‘సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ మెంట్’ అంటే మిల్లర్ల నుంచి నేరుగా ఎఫ్‌సీఐ బియ్యం కొనే వ్యవస్థను రద్దుచేసింది. భారం మొత్తం రాష్ర్టాల మీద నెట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, ప్రభుత్వాల ఆధ్వర్యంలోని సంస్థలు గానీ రైతుల నుంచి వడ్లు కొనాలి. వాటిని మిల్లులకు పంపించి బియ్యంగా మార్చాలి. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐ కొనాలి. అయితే.. రాష్ట్ర అవసరాలకు, రాష్ట్ర ప్రజలకు రేషన్ కింద ఇవ్వాల్సిన బియ్యాన్ని ఉంచుకొని.. మిగిలింది ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు సమస్య. గతంలో ధాన్యం దిగుబడి తక్కువగా ఉండేది. దీనికితోడు యాసంగిలో గింజ విరిగే సమస్య వల్ల ఎక్కువగా నూకలు వస్తాయి. నూక శాతం తగ్గాలంటే వడ్లను ఉడికించి బియ్యంగా మార్చాలనే విధానాన్ని ప్రారంభించింది. బాయిల్డ్ రైస్ కారణంగా నూక శాతం తగ్గడంతో మిల్లర్లు కూడా బాయిల్డ్ రైస్‌కు మొగ్గుచూపారు. క్రమంగా పారా బాయిల్డ్ రైస్ మిల్లుల సంఖ్య కూడా పెరిగిపోయింది. కానీ ఇప్పుడు కొన్ని రాష్ర్టాల్లో బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ తగ్గిందనే సాకు చూపించి.. కొనేదే లేదని కేంద్రం తెగేసి చెప్తున్నది. ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ర్టానిదే అని ప్రస్తుత కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ.. రాష్ట్ర అవసరాలు పోనూ మిగిలిన బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ విషయం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, ఎఫ్‌సీఐ వెబ్సైట్లలో స్పష్టంగా ఉంది. కానీ రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు మాత్రం అన్నీ అబద్ధాలే చెప్తున్నారు.
కుట్రంతా ఇక్కడే ఉంది!: రైతుకు ఎవుసం చేయడమే తెలుసు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాజ్యాంగం ఏం చెప్తున్నది.? రాజ్యాంగం ప్రకారం కేంద్రం బాధ్యతలేంటి..? రాష్ట్రం బాధ్యతలేంటి..? అనే అంశాలు చాలామంది రైతులకు తెలియవు. రైతు తనకు ఏ సమస్య వచ్చినా మొదట రాష్ట్ర ప్రభుత్వం వైపే చూస్తాడు. సాయమైనా, సమస్య అయినా అన్నింటికి రైతుకు తెలిసింది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమే. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం ఒక్కసారిగా పెరిగింది. 2014-15 వానకాలం, యాసంగి కలిపి పంటల సాగు విస్తీర్ణం 1.40 కోట్ల ఎకరాలు. ఈ ఏడేండ్లలో సాగు విస్తీర్ణం ఏకంగా 69 లక్షల ఎకరాలు పెరిగింది. 2020-21 వానకాలంలో 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కాగా, యాసంగిలో దాదాపు 1.35 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా వస్తుందని అంచనాలున్నాయి. గతంతో పోలిస్తే 2020-2021 యాసంగిలో వరిసాగు విస్తీర్ణం 237.85 శాతం ఉంటుందని వ్యవసాయశాఖ లెక్కలు చెప్తున్నాయి.
రాష్ట్ర అవసరాలకు పోను మిగిలిన ధాన్యం అయినా, ఇతర పంటలైనా కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ ఈ అంశాలు రైతుకు తెలియవు. దీన్ని తమ రాజకీయ అవసరాలకు వాడుకోవాలని, ఇప్పుడు తెలంగాణలో రైతుకు, సర్కారుకు మధ్య కొట్లాట పెడుతున్నది.
కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే దేశానికి మేలు జరుగుతుందని, రాష్ర్టాల హక్కులు కాపాడబడుతాయంటారు. కానీ ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ పాలన తీరు చూశాక.. బలమైన ప్రభుత్వం వంకర నడకతో ఉంటే రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయని స్పష్టమైంది. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకునే కేంద్ర పాలకులతో ఇప్పుడు అన్నదాతలే కాదు అన్నివర్గాలు కన్నీరు పెట్టాల్సి వస్తున్నది. కేంద్ర పాలకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల కారణంగా భారత్ అడుగులు వెనక్కిపడుతున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి క్షీణిస్తున్నది.
(వ్యాసకర్త: టీఆర్‌ఎస్‌రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్)
వై.సతీష్ రెడ్డి
96414 66666