బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను తమ ఉపగ్రహాలుగా, నేతలను అనుంగు అనుచర గణంగా మార్చుకునేందుకు మోదీ ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలను ఒక విధానంగా అనుసరిస్తున్నది. తమతో విభేదించే పార్టీలను, నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు అనేక అడ్డదారులు తొక్కుతున్నది. కేంద్రప్రభుత్వ పాలనాసంస్థలను దుర్వినియోగపరుస్తూ.. విపక్ష పార్టీనేతలపై ఉసిగొల్పుతున్నది. ఐటీ, ఈడీ దాడులన్నీ ప్రతిపక్షనేతలే లక్ష్యంగా సాగుతున్నవి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాఖ్యస్ఫూర్తి గురించి మోదీ పెద్దగా మాట్లాడాడు. రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని గురించి తెగనాడాడు. కానీ కేంద్రంలో తాను అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర జాబితాలోని అధికారాలను ఒక్కొక్కటిగా రద్దుచేస్తూ రాష్ర్టాలను మున్సిపాలిటీల స్థాయికి కుదిస్తున్నాడు. రాజ్యాంగబద్ధంగా రాష్ర్టాలకు సంక్రమించిన ఏ హక్కునూ గౌరవించటం లేదు. మొత్తంగా ‘అఖండ భారత్’ పేరిట గుత్తాధికారాన్ని చేతిలో పెట్టుకునేందుకు మోదీ ఆరాటపడుతున్నాడు. ఈ ఆధిపత్య వ్యక్తివాద ధోరణి ఫలితంగానే దేశంలో నేడు కేంద్ర, రాష్ర్టాల మధ్య సంబంధాలు తీవ్ర ఘర్షణపూరితంగా ఉంటున్నాయి.దేశంలో ఆకలి సూచి, దారిద్య్రరేఖ లాంటివి పేదరికా న్ని, ఆహార ఉత్పత్తుల అవసరాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ తర్వాత ఆహారధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ విప్లవాత్మక విజయాలు సాధించింది. ఆహార పంటల ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. వరిధాన్యం ఉత్పత్తితో దేశానికే ధాన్యాగారంగా మారింది. ఆహారపంటల ఉత్పత్తిలో దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణ నిలువటం రాష్ట్ర ప్రభుత్వ పాలనావిధానాల సాఫల్యతకు, ప్రగతికి నిదర్శనం.
ఆహారధాన్యాల ఉత్పత్తిలో ప్రజల ఆహారపుటలవాట్లు, అవసరాలతో పాటు, సాగునేలల తీరు, నేలసారం కీలకం. ప్రజల ఆహార అవసరాలు తీరే స్థాయికి మించి ఉత్పత్తి జరిగినప్పుడు వాటినేం చేయాలన్నది కేంద్రమే ఆలోచించాలి. వరిధాన్యాన్నే తీసుకుంటే.. దక్షిణాది రాష్ర్టాల్లోనే బియ్యాన్ని ఆహారంగా ఎక్కువగా తీసుకుంటారు. ఉత్తర భారతంలో గోధుమ ప్రధాన ఆహారం. దేశీయ అవసరాలకు మించి వరిధాన్యం ఉత్పత్తి అయినప్పుడు ఆ ధాన్యాన్ని ఎగుమతి చేయటం ద్వారా సమస్యను పరిష్కరించ వచ్చు. లేదా వరిధాన్యం నుంచి.. ఉప ఉత్పత్తులుగా ఏమేం చేయవచ్చో ఆలోచించాలి. పరిశోధనలు చేయాలి. ఇవేవీ చేయకుండానే ఇప్పటికే నిల్వలు పేరుకుపోయాయని, అవసరానికన్నా ఉత్పత్తి ఎక్కువ ఉంటే తామేమీ చేయలేమని చేతులెత్తేయటం బాధ్యతారాహిత్యమే.
కేంద్రం చేస్తున్న వాదనలో నిజాయితీ ఉందనుకుందామన్నా.. ధాన్యసేకరణలో విస్పష్ట వివక్ష కనిపిస్తున్నది. ఉదాహరణకు పంజాబ్-తెలంగాణ రాష్ర్టాలనే తీసుకుంటే.. ధాన్య సేకరణలో కేంద్రం చూపుతున్న వివక్ష తేటతెల్లమవుతున్నది. 2014 నుంచి నేటిదాకా ఈ ఏడేండ్లలో.. ఎంత ధాన్యాన్ని సేకరించిందో చూడాలి. 2014లో పంజా బ్ నుంచి 116.21లక్షల టన్నుల ధాన్యా న్ని సేకరిస్తే, తెలంగాణ నుంచి 24.32 లక్షల టన్నులను సేకరించింది.ఇది మొద లు 2021లో పంజాబ్ నుంచి 202.82 లక్షల టన్నులను సేకరిస్తే, తెలంగాణ నుంచి 141.11 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. ఇలా ఏ సంవత్సరం చూసినా పంజాబ్ నుంచి సేకరించిన దాంట్లో తెలంగాణ నుంచి సగానికన్నా తక్కువ సేకరిస్తూ సవతి తల్లి ప్రేమ చూపుతున్నది.
ఆరు దశాబ్దాలుగా కరువు కాటకాలకు, ఆకలిచావులకు నెలవైన తెలంగాణ, ఇప్పుడిప్పుడే కష్టాల నుంచి గట్టెక్కుతున్నది. దీనికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనుసరించిన అభివృద్ధి, సంక్షేమ విధానాలే కారణం. కాళేశ్వ రం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టుతో పాటు, అనేక చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను నిర్మించి సాగునీటి సమస్యను తీర్చారు. గతంలో 40 లక్షల ఎకరాలకు మించని సాగు భూమి, నేడు కోటి 20 లక్షల ఎకరాలకు చేరుకున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్రధాన పంట అయిన వరి దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చింది. రాష్ట్ర అవసరాలనే తీసుకుంటే ఒక పంటలో వచ్చే ధాన్యమే సరిపోతుంది. మిగతా ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే. బియ్యం ఎగుమతి చేయటానికి, వరి నుంచి ఉప ఉత్పత్తులు తీయటానికి కేంద్రమే పూనుకోవాలి. అలాంటి విధాన నిర్ణయ అవకాశం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజమంతా ఉద్యమించాలి. వరి పంట ఉత్పత్తి హక్కును సాధించుకోవాలి.
(వ్యాసకర్త: జన్ను జకరయ , 98491 99813 , కేంద్ర వేజ్ బోర్డ్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు)