తెలంగాణ అసెంబ్లీలో 119 అసెంబ్లీ సీట్లున్నాయి. 100కు పైగా ఎమ్మెల్యేల బలం ఉన్న టీఆర్ఎస్కు హుజూరాబాద్ గెలుపుతో రెండు నుంచి మూడు అసెంబ్లీ సీట్లకు పెరిగిన బీజేపీతో నష్టమేమీ లేదు. సాధారణ ఎన్నికలు ఇంకా రెండేండ్లున్నాయి. దుబ్బాక ఫలితం తర్వాత నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, మునిసిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. నాగార్జునసాగర్‌లో అయితే బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. హుజూరాబాద్ ఫలితం తర్వాత కూడా బీజేపీ పరిస్థితి అంతే. దానికి వాళ్లు గంతులేయాల్సిన పనేముంది?
రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒకటీ, రెండు స్థానాల్లో ప్రతిపక్షాలు గెలిచినంత మాత్రాన టీఆర్ఎస్కు జరిగే నష్టమేం లేదు. తెలంగాణ వ్యతిరేక పార్టీలైన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒరిగేదేం లేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల్లో కొంతై నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి జరుగుతున్నదా..? ఇది గమనించి కూడా రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తుండటం విడ్డూరం. టీఆర్ఎస్పై, కేసీఆర్‌పై పసలేని వాదనలు చేస్తూ, ద్వేషభావాన్ని రెచ్చగొడుతున్నారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ సాకు వల్ల ఒకటి, రెండు ఉపఎన్నికలు గెలువచ్చు కానీ ఇవేం శాశ్వతం కావు.
తెలంగాణకు ఏం అవసరమో, అభివృద్ధి నమూనాను ఎలా నిర్ణయించుకోవాలో తెలంగాణ ఆత్మనెరిగిన కేసీఆర్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. తెలంగాణకు కేసీఆర్ చేసిన, చేస్తున్న పనుల గురించి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాట్లాడరు. శ్రీశ్రీ తాగిపారేసిన సీసాల గురించి మాట్లాడుతారు తప్ప, రాసి పారేసిన కవిత్వ సంపద గురించి నోరెత్తరు. ఏదేమైనా శ్రీశ్రీ అమూల్య కవిత్వం కవులనెలా ఉర్రూతలూగించి, ప్రభావితం చేసిందో కేసీఆర్ రాజకీయ పరిణతి కూడా అంతే. బీజేపీ గెలుపు కాంగ్రెస్‌ను మూడవ స్థానంలోకి నెట్టిందే తప్ప టీఆర్ఎస్ను దాటలేదు.
నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్న కాలంలో కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించలేరు… తనను తానే ఓడించుకుంటే తప్ప అనేవారు. ఆ తర్వాతి నాయకులు చేసిన తప్పిదాలు, బీజేపీ వల్ల వచ్చే ప్రమాదాన్ని గుర్తించకపోవడం, రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ, మెజారిటీ ప్రజలైన బహుజన సమాజాన్ని పట్టించుకోకపోవడం వల్ల కాంగ్రెస్ పరిస్థితి దిగజారింది. ‘సందట్లో సడేమియా’ అన్నట్లు బీజేపీ మత భావనను ముందుకుతెచ్చి ఎదిగింది. జాతీయ పార్టీల వివక్ష, ఫెడరలిజాన్ని భంగం చేయడం కారణంగా ప్రాంతీయ పార్టీలు ఎదిగాయి. ఆ క్రమంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి టీఆర్ఎస్ను స్థాపించి లక్ష్యసాధనలో విజయుడై, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ కృషిచేస్తున్నాడు. 58 ఏండ్ల వలస పాలన వివక్షను జయించి రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరగాలంటే కేసీఆర్ పాలన కనీసంగా ఇరువై ఏండ్లయినా ఉండాల్సిందే. ఇదీ ప్రజాభిప్రాయం. హుజూరాబాద్ లాంటి అవాంతరాలు క్షణభంగురాలు.
దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీని అంతమొందించే పనిలో బీజేపీ, పునర్వైభవం పొందే పనిలో కాంగ్రెస్‌లు ఉన్నాయి. మరో దిక్కు దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలంగా, కేంద్రాన్ని శాసించేలా ఉన్నాయి. తెలంగాణలో నాయకత్వ లేమి వల్ల కాంగ్రెస్ రోజురోజుకూ దిగజారిపోతున్నది. ఆ స్థానాన్ని ఆక్రమించడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ విషయం, రాజకీయాలపై కనీస అవగాహన, భవిష్యత్ కార్యాచరణ, రిసెర్చ్ అండ్ అనాలిసిస్ లాంటివేవీ కాంగ్రెస్‌కు లేవు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు అసలుకే లేదు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు వచ్చిన స్వల్ప ఓట్లు ఏ అనామకుడు పోటీచేసినా వస్తాయి. బీజేపీ క్యాండిడేట్‌తో చేసుకొన్న రహస్య ఒప్పందం వల్ల కాంగ్రెస్ తమ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించిందనేది కాదనలేని సత్యం. ఇది ఆత్మహత్యాసదృశ్యమే. అలా జరగకుండా ఉంటే టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచేదనేది వాస్తవం. కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డి ఉద్ధరిస్తాడనుకుంటే పార్టీని హత్య చేయడానికి సిద్ధమయ్యాడు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీతో తలపడక తప్పదు. జాతీయపార్టీలు ఒకరికొకరు పోటీ పడుతాయే తప్ప, ప్రాంతీ య పార్టీలతో కాదని పలు రాష్ర్టాల రాజకీయాలను చూస్తేనే అర్థమవుతుంది.
-డాక్టర్ కాలువ మల్లయ్య , 91829 18567