కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఇటీవలి కాలంలో పదేపదే వార్తలకెక్కుతున్నది. ఇది ఆ సంస్థ సాధించిన విజయాల వల్ల కాకుండా, సందేహాస్పద పాత్ర వల్ల కావడం గమనార్హం. గత పదేండ్ల గణాంకాలు గమనిస్తే ఈడీ కేసుల పస ఏమిటో తేటతెల్లమవుతుంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటుకు సమర్పించిన లెక్కల ప్రకారం.. 2014-24 మధ్యకాలంలో మనీలాండరింగ్ చట్టం కింద మొత్తం 5,297 కేసులను ఈడీ దాఖలు చేస్తే అందులో రుజువైనవి 40 మాత్రమే. అంటే సక్సెస్ రేటు 1 శాతం లోపేనన్నమాట.
మిగిలిన కేసులు, వాటిల్లో అరెస్టయినవారి పరిస్థితి ఏమిటనేది ఆలోచించాల్సిన విషయం. ఈ వివరాలను కేంద్రం పార్లమెంటుకు సమర్పించిన బుధవారం రోజే సుప్రీంకోర్టు కూడా ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. వేల సంఖ్యలో కేసులుంటే రుజువైనవి పిడికెడు కూడా లేకపోవడం ఏమిటని దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దర్యాప్తు తీరు మెరుగుపర్చుకోవాలని గట్టిగా మందలించింది.
ఇంతకూ ఈడీ కేసుల్లో లోపం ఎక్కడుంది? ఆ మధ్య ఓ న్యాయనిపుణుడు ఈడీ బండారాన్ని పూసగుచ్చినట్టు బయటపెట్టారు. ముందుగా ఓ నలుగురైదుగురిని ఈడీ అరెస్టు చేస్తుంది. వారిలో ఒకరు తర్వాత అప్రూవర్‌గా మారుతారు. మిగతా వారికి వ్యతిరేకంగా మౌఖికంగా సాక్ష్యమిస్తారు. ఆ వాంగ్మూలం ఆధారంగా మిగతావారి మీద కేసు పెడతారు. నికరంగా శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా ఇలా మౌఖిక సాక్ష్యాలపై ఆధారపడటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
ముందుగా అరెస్టు చేసి తర్వాత తాపీగా సాక్ష్యాధారాల కోసం వెతకడమనే విలోమ పద్ధతి వల్ల కేసులు నిలబడటం లేదనేది జగమెరిగిన సత్యం. పైగా అవినీతి అంతుచూస్తామని దూకుడు చూపే ఈడీలోనే అవినీతిపరులు పట్టుబడుతుండటం సంస్థలోని వారంతా కడిగిన ముత్యాలేమీ కాదని తెలియజేస్తున్నది. తాజాగా ఓ సీనియర్ ఈడీ అధికారి నిందితుని నుంచి రూ.20 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఘటన సంస్థ పరువును బజారుకీడ్చింది. గతేడాది తమిళనాడులోనూ లంచం కేసులోనే ఈడీ అధికారి అరెస్టు కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ లక్ష్యాల సాధనకు ఈడీ ఓ ఆయుధంలా మారిందనే ఆరోపణలు మొదటినుంచీ ఉన్నాయి. రాజకీయాల్లో అవినీతి ప్రక్షాళనకే ఈడీని ప్రయోగిస్తున్నామని పాలక బీజేపీ అంటుంటే, దారికి రానివారిని లొంగదీసుకునేందుకే ఆ దర్యాప్తు సంస్థను ఉసిగొల్పుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈడీ వ్యవహారశైలి, కేసులు చతికిలబడుతున్న తీరే అందుకు నిదర్శనం. కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడమే ఈ సమస్యకు పరిష్కారం. పార్లమెంటరీ కమిటీ పర్యవేక్షణ తప్పనిసరి చేయాలి. ఆ కమిటీ ముందు సంస్థల బాధ్యులు ఎప్పటికప్పుడు హాజరై వాంగ్మూలాన్ని సమర్పించే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాలి. ఆ మొత్తం వ్యవహారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి. అప్పుడే కేసుల నిగ్గు తేలుతుంది. దర్యాప్తు సంస్థల పనితీరూ మెరుగుపడుతుంది. దేశ ప్రజలకు నమ్మకమూ పెరుగుతుంది.