స్వరాష్ట్రం సిద్ధించడానికి ముందున్న పరిస్థితులు మళ్లీ దాపురించాయి. నిరుడు వానలు బాగా కురిసినా జలాశయాల్లో మాత్రం నీళ్లు లేవు. గొంతెండిన పొలాలు కోతకు బదులు మేకల మేతకు ఆవాసాలుగా మారుతున్నాయి. యాసంగికి ఇబ్బంది లేదు, సాగుకు సరిపడా నీళ్లున్నాయన్నది సర్కారు మాట. మరి పొలాలు ఎందుకు ఎండుతున్నాయంటే సమాధానం లేదు. పంటలు చేతికి అందకపోవడంతో రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయి. నిరుడు కురిసిన వానలతో అక్టోబర్ చివరిదాకా వరద ప్రవాహాలు వస్తూనే ఉన్నాయి. కానీ, వేసవికి ముందే అన్ని జలాశయాలు అడుగంటాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కళకళలాడేలా చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల వ్యవస్థను నేటి కాంగ్రెస్ సర్కారు కక్షతో, కావాలనే పడావు పెట్టింది. అందుకే తెలంగాణ సాగునీటికి నేడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సర్కారు చేతకానితనం కేవలం గోదావరి జలాలకే పరిమితం కాలేదు. అటు కృష్ణా జలాలను పొరుగు రాష్ట్రం అడ్డూ అదుపు లేకుండా ఎగరేసుకుపోతుంటే గుడ్లప్పగించి చూస్తున్న అసమర్థ ప్రభుత్వం మనది.
నిరుడు రాష్ట్రంలోని 358 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 316 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ముందటే డాది 72 టీఎంసీలు సముద్రంలో కలవగా, ఈ సారి 844 టీఎంసీల జలాలు సమద్రంలో కలిశాయంటే వరదలు ఎంత వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. 2024, అక్టోబర్ 25 నాటికి శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, 215 టీఎంసీల నీటితో కళకళలాడింది. కానీ, ప్రస్తుతం 74.81 టీఎంసీలకు చేరుకొని అడుగంటింది. యాసంగి మొదట్లోనే శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో నీటి నిల్వలు ఖాళీ అయ్యాయి. నీటి నిర్వహణలో సర్కారు దారుణ వైఫల్యానికి ఎండిన పొలాలే మూగసాక్షులు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ సోయి ఉన్నట్టు కనిపించడం లేదు. కాళేశ్వరం జలాలు రాకపోవడంతో భూగర్భ నీటిమట్టాలు అట్టడుగుకు చేరుకుంటున్నాయి.
వాస్తవ పరిస్థితి కండ్ల ముందు కనబడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుండటం దురదృష్టకరం. కాళేశ్వరం జలాలతో చెక్‌డ్యాములు, చెరువులను క్రమం తప్పకుండా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నింపడం వల్ల భూగర్భ జలాలు ఉబికి వచ్చేవి. దాంతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్తుతో బోర్ల ద్వారా రైతులు సేద్యం చేసుకునేవారు. చివరి పొలం వరకు నీరందించాలన్న తపన కేసీఆర్‌లో కనిపించేది. పెద్ద, చిన్న ప్రాజెక్టుల్లో కలిపి తాగునీటి అవసరాలకు పోను డిసెంబర్ నాటికి 354 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ లెక్కతేల్చింది. అయితే, ఈ అంచనాలు క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని ఇంజినీర్లు మొదటినుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. వీటి గురించిన సరైన అవగాహన లేని ప్రభుత్వం తూతూ మంత్రంగా ప్రణాళికలు రూపొందించి చేతులు దులుపుకొన్నది. పర్యవసానంగా రాష్ట్రంలో ఎటుచూసినా ఎండిన పంటలు, బీడువారిన పొలాలే కనిపిస్తున్నాయి.