గత కొన్ని రోజులుగా అమెరికా రాజకీయ చర్చ హెచ్1-బీ వీసాల చుట్టే తిరుగుతుండటం మనం చూస్తున్నాం. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (క్లుప్తంగా ‘మాగా’ లేదా అమెరికాకు పూర్వవైభవం సాధిద్దాం) అనే నినాదంతో ట్రంప్ ఎన్నికల బరిలో దిగి ఘన విజయం సాధించారు. జనవరి 20వ తేదీన ఆయన అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆ రోజు దగ్గర పడుతున్న కొద్దీ హెచ్1-బీ ఆశావహుల్లో ఆందోళన పెరుగుతున్నది. అమెరికన్లకు వీసాల వల్ల ‘అన్యాయం’ జరుగుతున్నదనీ, అవి ‘చాలా చెడ్డవని’ గతంలో ఆయన చేసిన ప్రకటనలే అందుకు కారణం. అయితే, ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రకటనలు కొంత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. నిజానికి ట్రంప్ కంటే ముందే వీసాలకు అనుకూలంగా ఎలాన్ మస్క్ మాట్లాడటం గమనార్హం. ఆయన తీరులోనే ట్రంప్ కూడా ఇప్పుడు అమెరికాకు నిపుణులైన ఉద్యోగుల అవసరం ఉన్నదని, వీసాలు ఉండాల్సిందేనని అంటున్నారు. పైగా తాను ఎప్పుడూ వీసాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదని సమర్థించుకున్నారు. ఈ యూటర్న్ ట్రంప్ సంప్రదాయిక మద్దతుదారులకు సహజంగానే ఆగ్రహం తెప్పిస్తున్నది. వీసాలను సమర్థిస్తే ‘అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం’ అనే నినాదాన్ని అటకెక్కించినట్టు అవుతుందనే వాదన వినిపిస్తున్నది.
ఆచరణాత్మకంగా చూస్తే హెచ్1-బీ వీసాలు లేకపోతే ఐటీ కంపెనీల మనుగడ కష్టమవుతుంది. స్థానిక అమెరికన్లలో నైపుణ్యాలు కొరవడటమే ఇందుకు కారణం. భారత్ వంటి విదేశాల నుంచి నిపుణులను ఆకర్షించే ఉద్దేశంతోనే 1990లో సీనియర్ బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పడు హెచ్1-బీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. పరిశోధన, ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో ఖాళీల భర్తీకి ఈ వీసాలను ఉద్దేశించడం తెలిసిందే. వీసాల్లో 70 శాతం భారతీయులు, 12-13 శాతం చైనీయులు దక్కించుకుంటారు. మిగిలినవి మెక్సికో, ఫిలిప్పీన్స్, తైవాన్, కొరియా వంటి దేశాల నుంచి భర్తీ అవుతాయి. భారత్ సహా అనేక వర్ధమాన దేశాలకు చెందిన విద్యార్థులు వీసా లభిస్తే భవితకు భరోసా అని నమ్ముతారు. అమెరికా పౌరసత్వానికి తొలిమెట్టులా ఉపయోగపడుతుందనీ భావిస్తారు.
ఏటా 65 వేల వీసాలను అమెరికా జారీ చేస్తుంది. అదనంగా మరో 20 వేల వీసాలు అధిక విద్యార్హతలు, నైపుణ్యాలున్న వారికి కేటాయిస్తారు. అయితే వీసాల సంఖ్య కన్నా అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో లాటరీ పద్ధతి ప్రవేశపెట్టారు. దీనివల్ల రెండు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి, నైపు ణ్యం కన్నా అదృష్టమే నిర్ణాయకం కావడం. దీనివల్ల అద్వితీయ నైపుణ్యం ఉన్నప్పటికీ అవకాశం లభించకపోవచ్చు. రెండు, హెచ్1-బీ వీసాలతో వెళ్లేవారికి స్థానికుల కన్నా తక్కువ వేతనాలు లభిస్తాయి. ‘చీప్ లేబర్’ అనే ముద్ర పడింది అందుకే. కానీ, భారత్ వంటి వర్ధమాన దేశాలవారికి డాలరు అధిక విలువ కారణంగా అవే పెద్ద వేతనాలుగా కనిపిస్తాయి. వీసాలు అమెరికన్ యువతకు ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నాయని, విదేశీయులకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు మాత్రం మొదటినుంచీ ఉన్నా యి. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే యువతీ యువకులు ఉద్యోగాలు ఎగరేసుకుపోతున్నార నే అక్కసు కూడా స్థానికుల్లో అంతకంతకూ పెరుగుతున్నది. హెచ్1-బీ వలసలకు అడ్డుకట్ట వేయాలని వాదించే రిపబ్లికన్ పార్టీ నేతల్లో భార త సంతతి అమెరికన్లు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం విడ్డూరం.
మరోవైపు ఈ ఉద్యోగాల్లో నియమించడానికి అమెరికాలో తగినంత మంది నిపుణులున్నారనీ, మరింతగా వలసలను అనుమతించాల్సిన అవసరం లేదని 60 శాతం అమెరికన్లు భావిస్తున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. ఈ తరహా అభిప్రాయాలు విదేశీయుల పట్ల వ్యతిరేకతకు దారితీయడం జరుగుతున్నది. ఈ వ్యతిరేకతను సొమ్ము చేసుకొని ట్రంప్ విజయం సాధించారనేది తెలిసిందే. గెలిచిన తర్వాత జనాకర్షక విధానాలకు, ఆచరణీయతకు మధ్య సమతూకం పాటించే పనిలో ఆయన పడ్డారని అర్థమవుతూనే ఉన్నది. ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే వీసాలు రద్దు కావడం దాదాపు ఆసాధ్యమనే అర్థమవుతుంది. ఒకవేళ సంస్కరణలంటూ జరిగితే వేతనాలు పెరిగి వీసా అభ్యర్థులకు మేలే జరుగుతుందని ఆశించవచ్చు.