అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి గెలిచిన తర్వాత, జో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న సమయంలో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అమెరికా ‘సంపన్నస్వామ్యం’లోకి వెళ్తున్నదనేది దాని సారాం శం. ఏ దేశంలోనైనా ‘సంపన్నుల మాటే’ చెల్లుబాటవుతుందనేది సాధారణమైన విషయమే! కానీ, బైడెన్ ఉద్దేశించింది ప్రత్యక్ష ‘స్వామ్యం’. అంటే నేరుగా అధికారాన్ని చేపట్టడమన్న మాట. అప్పుడు బైడెన్ మాట లను ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆ వ్యాఖ్య కొంత ప్రాముఖ్యం సంతరించుకుంటున్నది. అమెరికా రియల్ ఎస్టేట్ కుబేరుడు ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీకి దిగితే ప్రపంచ కోటీశ్వరుడైన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ పూర్తి అండదండలు అందించారు.
ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. 20 కోట్ల డాలర్లకు పైగా ఖర్చుపెట్టారు. ట్రంప్‌ను అన్నీ తానై గెలిపించడమే కాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందులో చేరారు కూడా. ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాల కింద పెడుతున్న ఖర్చును తగ్గించుకునేందుకు ట్రంప్ సర్కారు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వ్యయ విభాగం (డోజ్) అధిపతిగా మస్క్ బాధ్యతలు నిర్వహించారు. వేలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కోతపెట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, కథ అక్కడితో ముగిసిపోలేదు.
ఏతావాతా ఈ అపూర్వమైన స్నేహం బెడిసికొట్టి అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగడం నేటి ముచ్చట. ట్రంప్-మస్క్ సంప్రదాయేతర రాజకీయ కలయిక వైరంగా మారిన వైనం ప్రస్తుతం తాజా సంచలనం. రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వాలు, శత్రుత్వాలు ఉండవనే సూక్తి వీరిద్దరి విషయంలోనూ నిజమైంది. సంపన్నస్వామ్యం అన్న తర్వాత వాణిజ్య ప్రయోజనాలపై తగాదాలు రావడమూ సహజమే. ఇద్దరూ అహంకారులే. ఇద్దరికీ తమతమ వాణిజ్య ప్రయోజనాలున్నాయి. ఒకే ఒరలో రెండు కత్తులు ఎలా ఇముడుతాయి? విద్యుత్తుతో నడిచే వాహనాల సబ్సిడీలకు కోతపెడుతూ ట్రంప్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను మస్క్ ప్రతిఘటించడంతో ఇది మొదలైందని చెప్పవచ్చు. ట్రంప్ అనాలోచితంగా మస్క్ వ్యాపారాన్ని దెబ్బతీసే ఎత్తుగడలకు పాల్పడ్డారని అనుకోవడానికి వీల్లేదు. టెక్ సామ్రాజ్యాధినేత అయిన మస్క్ రాజకీయాలను శాసించే స్థాయికి రావడం చిన్న విషయమేమీ కాదు. అతడి ప్రభావాన్ని తగ్గించేందుకు ట్రంప్ ఎత్తులు వేస్తున్నట్టు పైకి తెలుస్తూనే ఉంది.
పొమ్మన లేక పొగబెట్టినట్టుగా మస్క్ వ్యాపార మూలాలపై ట్రంప్ తనదైన శైలిలో నేరుగా దాడిచేయడంతో కథ అడ్డం తిరిగింది. దాంతో ‘డోజ్’కు మస్క్ గుడ్‌బై చెప్పి ట్రంప్‌పై ఎదురుదాడికి దిగారు. ట్రంప్ పరిపాలన సామర్థ్యంపై విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా ఆయనను అభిశంసించాలన్నారు. అమెరికాకు కొత్త పార్టీ అవసరమనేదాకా పోయా రు. లైంగిక నేరాలకు సంబంధించిన ఎప్ స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరున్నదని బాంబు పేల్చారు. అటు ట్రంప్ ఏ మాత్రం తగ్గకుండా మస్క్ కంపెనీల ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తాననీ, డెమొక్రాట్లకు చందాలిస్తే ఊరుకోననీ తాఖీదులు జారీ చేస్తున్నారు. వీరిద్దరి మాటల యుద్ధం చివరికి ఏ రూపు తీసుకుంటుందో తెలియదు కానీ, ప్రపంచానికి మాత్రం బోలెడు వినోదం. మధ్యలో అగ్రరాజ్యం పరువు వాషింగ్టన్ నగరం మధ్యలో నుంచి ప్రవహించే పొటోమాక్ నదిలో కలిసిపోతున్నది!