అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓపిక తక్కువ. ఫర్మానా జారీచేస్తే పని జరిగిపోవాలనే తత్వం. ప్రస్తుతం ఆయన ఏకధ్రువ ప్రపంచంలో అమెరికా సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఆలోచిస్తున్నారు. అందుకు ప్రపంచ వ్యవస్థలనే తలకిందులు చేయాలని చూస్తున్నారు. బహుళపక్ష సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అమెరికా ఇన్నాళ్లుగా అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయిక రాజకీయాలకు పూర్తి భిన్నమైన ధోరణిలో వెళ్లడం ట్రంప్ ప్రత్యేకత. యూరప్ మిత్రదేశాలను పూర్తిగా పక్కనపెడుతుండటమే ఇందుకు నిదర్శనం. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అమెరికా నారుపోసి, నీరుపెట్టి పెంచి పోషించిన నాటోను ఈసడించుకున్నారు. నాటోకు బద్ధశత్రువైన రష్యాతో దోస్తీ చేస్తున్నారు.
ప్రపంచశాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పడిన ఐక్యరాజ్య సమితికి అమెరికా వాటాగా ఇవ్వాల్సిన నిధులు నిలిపివేసి విశ్వసంస్థపై తన అక్కసు తెలియజేసుకున్నారు. గాజాలో నరమేధంపై ఇజ్రాయెల్‌ను ప్రపంచ న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టిన దక్షిణాఫ్రికాను జీ-20 అనే బహుళపక్ష వేదిక నుంచి ఏకపక్షంగా తొలగించారు. డాలర్ ఆధిపత్యం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న బ్రిక్స్ సంస్థను వంద శాతం టారిఫ్‌తో బెదిరించారు. ఇలా విశ్వసంస్థలు ఒక్కొక్కదానిపై అలుపు లేకుండా దాడులు చేస్తూ అమెరికా ప్రాధాన్యం నిలబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.
అయితే బహుళపక్ష సంస్థలు అసలే ఉండరాదని ట్రంప్ కోరుకోవడం లేదు. అది సాధ్యం కాదు కూడా. కాకపోతే అవి అమెరికా ప్రయోజనాలకు లోబడి ఉండాలనేది ఆయన ఆకాంక్ష. ఆ ఆకాంక్ష పరిపూర్తికి ఆయన తాజాగా 5 దేశాల కూటమి ప్రతిపాదన ముందుకుతెస్తున్నారు. దీనిపై ఆయన ఇంకా నేరుగా ప్రకటన చేయనప్పటికీ జాతీయ భద్రతా వ్యూహ సంస్థ అధ్యయన పత్రం రూపంలో అది వెలుగుచూసింది. ఆ పత్రాన్ని అమెరికా ప్రభుత్వం ఇంకా ప్రచురించలేదు. అందులోని అంశాలు ప్రముఖ విశ్లేషణ వేదిక పొలిటికో వెల్లడించింది. నేటి అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని గానీ, ఇతర దేశాల్లో వ్యవస్థలు నిర్మించాలని గానీ కోరుకోవడం లేదని, రష్యా సంబంధాల వ్యూహాత్మక స్థిరీకరణ అమెరికాకు తక్షణావసరమని ఆ పత్రం సూచించినట్టు తెలిపింది.
విశ్లేషకులు ‘కోర్-5’ లేదా ‘సీ-5’ అని పిలుస్తున్న ఈ వ్యూహం ప్రకారం ఐదు దేశాల కూటమి ఏర్పడుతుంది. అందులో అమెరికాతో పాటుగా భారత్, రష్యా, చైనా, జపాన్ ఉంటాయి. ఈ కూటమి అన్ని ప్రపంచ కూటములకు జేజమ్మలా ఉంటుందని ట్రంప్ భావిస్తున్నారు. ఇదే జరిగితే యూరప్ కూటమి దేశాలు పూర్తిగా పక్కకుపోతాయి. నాటో పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారుతుంది. అమెరికా అధికారికంగా ‘సీ-5’ని ధ్రువీకరించనప్పటికీ ట్రంప్ ప్రాధాన్యాలను బట్టి ఇది పూర్తిగా అనూహ్యమైన విషయమని చెప్పలేం. ఇలాంటి విశ్లేషణలు అమెరికా మిత్రదేశాల్లో, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా చిరకాలంగా అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా రష్యా పట్ల అనుకూలత చూపడంలో ఈ సరికే ట్రంప్ చాలాదూరం వెళ్లిపోవడం మనం చూస్తు న్నాం. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు నాటో ప్రకటిత విధానాలకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ‘సీ-5’ ఆచరణలోకి వస్తే అమెరికా వ్యూహాత్మక సంబంధాలు పూర్తిగా కొత్త దశలోకి ప్రవేశిస్తాయని చెప్పాలి.
‘సీ-5’ ప్రతిపాదన చక్కర్లు కొడుతుంటే సహజంగానే భారత్‌కు కలిగే లాభనష్టాల గురించిన చర్చ మన దేశంలో జరుగుతున్నది. ట్రంప్ టారిఫ్‌లతో కుదేలైన భారత-అమెరికా సంబంధాలు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుందన్న అంచనాలు వినవస్తున్నాయి. ఈ దశలో సూపర్ క్లబ్‌పై ఊహాగానాలు ముందుకురావడం గమనార్హం. ఇటీవలే నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిన భారత్ పట్ల అమెరికా మారుతున్న ధోరణిని ఈ పరిణామం సూచిస్తున్నది. ట్రంప్ ఆలోచనలు నిజమైతే ప్రపంచం యూరో కేంద్రక వ్యవస్థ నుంచి ఆసియా కేంద్రక వ్యవస్థ దిశగా మళ్లినట్టవుతుంది. మరి ఈ ఐదు దేశాల కూటమి ఏర్పాటు పట్ల యూరప్‌తో సహా మిగతా ప్రపంచం ఎలా స్పందిస్తుందనేది ఆలోచించాల్సిన విషయం.