కోర్టులో సాక్ష్యంగా పనికివచ్చే ఆధారాన్ని ధ్వంసం చేయడం నేరం. కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 241 సెక్షన్ ప్రకారం ఈ నేరానికి మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇది సాధారణ ప్రజానీకానికి సంబంధించిన విషయం. మరి ప్రభుత్వం అలాంటి చర్యకు పాల్పడితే ఏమిటి? అనేది పెద్ద ప్రశ్న. మొన్న నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో ఇది కీలక ప్రశ్న కూడా. చీమ కూడా చొరరాని సురక్షితమైన ల్యాబ్లో, అదీ చలికాలంలో అగ్నిప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తున్న మాట నిజం. సాధారణంగా ఇలాంటి కేంద్రాలు 24 గంటలు నిరంతర నిఘాలో ఉంటాయి.
మరి శనివారం ప్రమాదం జరిగినప్పుడు ఎవరూ లేకపోవడం వింతగా తోస్తున్నది. మూడు గంటలైనా మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పలేకపోవడం మరీ విడ్డూరం. పైగా ప్రమాదంపై సర్కార్ మాట మార్చడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరు నేతలు ప్రధాన నిందితులుగా ఉన్న పంజాగుట్ట కేసు ఆధారాల భద్రతపై మొదటిరోజే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ కేసు ఆధారాలు సురక్షితమేనని అంటున్నారు. మరి మిగతా కేసుల ఆధారాలు అంత ముఖ్యం కావని అనుకోవాలా? దీనివల్ల నేరస్థులకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదా?
మొదటి రోజు ప్రమాదం పెద్దదేమీ కాదన్నట్టు ప్రకటించి మరుసటి రోజు మాట మార్చడం ఎందువల్ల? ఓ వైపు ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదని అంటూనే, 2015 నుంచి పదేండ్లకు సంబంధించి ‘అనేక కేసుల సాక్ష్యాధారాలు’ దగ్ధమయ్యాయని చెప్పడం సహజంగానే ఏదో జరిగిందనే అనుమానాలు కలిగిస్తున్నది. ఏ కేసులో, ఏ మేరకు నష్టం జరిగిందనేది అంచనా వేస్తున్నామని అంటున్నారు. వస్తుపరమైన నష్టం భారీగానే ఉన్నది. ఆధారాల పరంగా జరిగిన నష్టం పూడ్చడం చాలా కష్టం. కేసులకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు అధికారులు శ్రద్ధపెట్టి సేకరిస్తారు.
వాటి నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ విభాగానికి పంపిస్తారు. అక్కడే ఆధారాలు ధ్వంసం కావడం మామూలు విషయం కాదు. చాలా కేసుల్లో ఒకసారి సేకరించిన సాక్ష్యాధారాలు ధ్వంసమైతే మళ్లీ వాటిని సేకరించడం దాదాపు అసాధ్యమేనని చెప్పవచ్చు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? ఎవరిని బైట పడేసేందుకు జరిగింది? అనేది తేలాల్సిందే. సరైన ఆధారాలు లేని కారణంగా శిక్ష నుంచి హంతకులు, రేపిస్టులు తప్పించుకునే దుస్థితి దాపురించింది.
ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రభుత్వాలు ఒడిగట్టిన ఉదంతాలకు చాలానే చరిత్ర ఉన్నది. అయితే అది సెక్రటేరియట్లో ఫైళ్ల దహనం రూపంలో ఎక్కువగా జరిగేది. 2023, 2024 సంవత్సరాల్లో మధ్యప్రదేశ్ సెక్రటేరియట్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. కోవిడ్ మహమ్మారి విజృంభన సమయంలో జరిగిన వ్యయంపై బీజేపీ సర్కార్ మీద వచ్చిన ఫిర్యాదులపై లోకాయుక్త నివేదిక సహా పలు ముఖ్యమైన ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఇదంతా సర్కార్ కుట్ర అనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కేరళలో 2020లో బంగారం స్మగ్లింగ్ కేసు ఫైళ్లు తగలబడిపోయాయి.
ఢిల్లీలో 2012లో, ముంబైలో 2013లోనూ ఈ తరహా ప్రమాదాలే చోటుచేసుకున్నాయి. అంతెందుకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు కొన్నిరోజులు ముందు ఏపీ సచివాలయంలో ఫైళ్లు తగులబడిపోయాయి. వాటిలో ఏసీబీ కేసుల ఫైళ్లు కూడా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ సారి అగ్నిప్రమాదం సాక్ష్యాధారాల విశ్లేషణలు జరిగే కేంద్రంలోనే సంభవించడం విశేషం. ఫోరెన్సిక్ ల్యాబ్ల చరిత్రలోనే ఇలాంటి ప్రమాదం ఇదే మొదటిది కావడం గమనార్హం. ప్రజలకున్న అనుమానాలు తొలగిపోయి, నిజానిజాల నిగ్గు తేలాలంటే న్యాయ విచారణ జరిపించడం ఒక్కటే మార్గం.