‘నమ్మి నానవోస్తే పుచ్చి బుర్రలయ్యాయి’ అన్నట్టుంది కాంగ్రెస్ సర్కార్ తీరు. డిప్యూటీ సీఎం అసెంబ్లీకి సమర్పించిన 2026-27 బడ్జెట్ అందుకు నిలువుటద్దం పట్టింది. ఆరు గ్యారెంటీలకు పూర్తిగా మంగళం పాడినట్టేనని, దింపుడుకళ్లం ఆశ కూడా లేదని తేలిపోయింది. హామీల పేరుతో ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తామని ప్రతినపూనిన విపక్ష బీఆర్ఎస్ పార్టీ..బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించింది. ఆపై గులాబీ పార్టీ సభ్యులు చెవుల్లో పూలు పెట్టుకొని నిరసన తెలుపడం ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించింది. హామీలను అటకెక్కించడమే కాకుండా, సర్కార్ గమ్యం, గమనాన్ని వివరించడంలోనూ బడ్జెట్ దారుణంగా విఫలమైంది.
అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి కేవలం అంకెల గారడీగా మిగిలిపోయింది. తప్పులతడక బడ్జెట్ ఆదాయంపైనా తప్పడటుగులు వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంపై ప్రభుత్వం వెల్లడించిన అంకెలకు, కాగ్ నివేదిక నిర్ధారణలకు మధ్య అంతరాలుండటమే అందుకు సాక్ష్యం. పోనీ సర్కార్ లెక్క ప్రకారమైనా 202526 ఆర్థిక సంవత్సరంలో రూ.2,29,720 కోట్ల రెవెన్యూ సంపాదిస్తామని గత బడ్జెట్లో ప్రకటించారు. అందులో కేవలం రూ.2,03,000 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని ఈసారి బడ్జెట్లో పేర్కొన్నారు.
ఈసారి అంచనాలను మరింత పెంచి రూ.3.24.234.కోట్లతో బడ్జెట్ సమర్పించారు. ఇంతా చేసి ‘హళ్లికి హళ్లి సున్నకు సున్నా’గానే మిగిలిపోయింది. ఒక కొత్త పథకం లేదు. కొత్త ఆలోచన అసలే లేదు. దశ-దిశ లేని చప్పిడి బడ్జెట్లో అంకెల గారడీగా మిగిలిపోయింది. మొక్కుబడి విదిలింపులతో సరిపెట్టారు. విద్యారంగానికి కేటాయించినది రూ.26.266 కోట్లే. కొఠారి కమిషన్ సిఫారసు ప్రకారం 30 శాతం ఇవ్వాలి. కాంగ్రెస్ స్వయంగా ఇచ్చిన హామీ ప్రకారమైనా 15 శాతం ఇవ్వాలి. కానీ మొక్కుబడి విదిలింపుగా కేవలం 8.22 శాతం కేటాయింపు జరుపడం చదువు పట్ల ఈ సర్కార్కున్న శ్రద్ధకు నిదర్శనం. యూత్ డిక్లరేషన్ హామీల గతం గతః అయ్యాయి. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఉద్యోగాల భర్తీ గురించి మాటమాత్రంగానైనా లేదు. విద్యార్థులకు ఇచ్చిన విద్యాభరోసా కార్డు అతీగతీ లేదు. యువత, విద్యార్థులకు టోకరా ఇవ్వడం బడ్జెట్ ప్రత్యేకతగా నిలుస్తున్నది.
నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అనే వాగ్దానాన్ని అధికారికంగా భూస్థాపితం చేసేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్ను అడ్డంగా వాడుకున్నది. ఒక్క యువత అని ఏముంది? సకల జనులకు బడ్జెట్లో దక్కింది గుండుసున్నా అని చెప్పాలి. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులను బడ్జెట్ గాలికొదిలేసింది. వృద్ధులు, వికలాంగులకు ఇచ్చిన పింఛన్ పెంపు హామీల గురించి టార్చిలైటు వేసి వెతికినా కనిపించడం లేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,500 సాయం సంగతీ అంతే. కల్యాణలక్ష్మి/షాదీముబారక్లో తులం బంగారం ఊసే లేదు. వ్యవసాయానికి కేటాయింపులు పెంచకపోగా నిరుడి కంటే రూ.వెయ్యి కోట్లు తగ్గించారు.
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులకూ కోత పెట్టారు. రెండేండ్లలో పూర్తిచేస్తామని డంబాలు పలికిన పాలమూరు ప్రాజెక్టుకు గడువు తీరిపోయినా పైసా కేటాయించకపోవడం సర్కార్ చిత్తశుద్ధిని వెల్లడిస్తున్నది. అంచనాల మేరకు ఆదాయం రాబట్టుకోలేకపోవడం, ఆపై కేటాయింపులను ఖర్చు చేయలేకపోవడం అనేది కాంగ్రెస్ పాలనలో తంతుగా మారింది. దాంతో కేవలం అప్పుల మీదనే ఆధారపడుతున్న ప్రభుత్వం తక్షణావసరాలకు నిధులు సర్దలేక, సంక్షేమానికి కేటాయించలేక సతమతం అయినట్టు బడ్జెట్ను చూస్తేనే అర్థమవుతున్నది. మొత్తం మీద కాంగ్రెస్ బడ్జెట్ హామీల డుల్లతో డొల్లగా తయారైంది.