ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు కావడంతో మద్యం పాలసీ కేసులో ఒక అంకం పూర్తయింది. బెయిల్‌పై వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కేంద్ర దర్యాప్తు సంస్థలకు, ముఖ్యంగా సీబీఐకి చెంపపెట్టు లాంటివని చెప్పాలి. ‘బెయిల్ ఇవ్వడం సర్వదా వాంఛనీయం. కానీ, జైలు అనేది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే వర్తింపజేయాలి. పంజరంలో ఉన్న పెంపుడు చిలకలా ప్రవర్తించవద్దు.
ఆ ముద్రను చెరిపేసుకోవాల్సిన బాధ్యత సీబీఐ మీదే ఉన్నద’ని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడటమే అందుకు కారణం. ఈ మందలింపుల నేపథ్యంలో సీబీఐ ఏమైనా నేర్చుకుంటుందా? అనేది సందేహాస్పదమే. ఎందుకంటే, పెంపుడు చిలుక పంజరం నుంచి తనంతట తానుగా బయటకు వచ్చి స్వేచ్ఛగా ఎగరలేదు. అది ఎగరాలంటే దాన్ని పంజరంలో బంధించినవాళ్లు మొదట మారాలి. అప్పుడే బంధనాలను తెంపుకొని తనదైన వాస్తవ కర్తవ్యం దిశగా చిలుక ఎగురగలుగుతుంది.
ఒకప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థలంటే వెన్నులో వణుకు పుట్టేది. అవి రంగంలోకి దిగాయంటే నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేవి. ఎందుకంటే, ఎలాంటి లాలూచీ లేకుండా, రాజీపడకుండా అవి దర్యాప్తు జరుపుతాయని గట్టి నమ్మకం. ఇదంతా గత చరిత్ర. రానురాను వాటి పరిస్థితి దిగజారుతూ వస్తున్నది. ఈ దిగజారుడు కాంగ్రెస్ హయాంలోనే మొదలైంది. సుప్రీంకోర్టు ప్రస్తావించినట్టుగా సుకుమారమైన చిలుకలా కాకుండా, మెడలో గొలుసు ఉన్న పెంపుడు కుక్కలా వ్యవహరించేవని కేంద్ర దర్యాప్తు సంస్థలు అప్పట్లోనే తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడం వల్ల వాటి ప్రతిష్ట కొంతమేరకు మసకబారగా.. బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్ ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్న తీరుతో అది మరింతగా భ్రష్టుపట్టింది. అన్ని కేసులు అదే తరహాలో జరుగుతున్నాయని చెప్పలేం కానీ, రాజకీయ కేసుల విషయంలో మాత్రం దర్యాప్తు సంస్థల తీరు వివాదాస్పదమవుతూనే ఉన్నది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. సుప్రీంకోర్టు అక్షింతలతో ఈ విషయం మరో మారు స్పష్టమైంది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ వ్యవహరించిన తీరు మొదటినుంచీ సందేహాస్పదమే. నెలల తరబడి ఈడీ కేసు నడుస్తుంటే చూస్తూ కూర్చున్న సీబీఐ.. ఆ కేసులో బెయిల్ లభించగానే ఉన్నపళంగా ఆయనపై కేసు దాఖలు చేయడం గమనార్హం. విపక్ష నేతలపై సీబీఐ, ఈడీలను ప్రయోగించడం, వారు బీజేపీకి వత్తాసు పలకగానే కేసుల నుంచి విముక్తి కల్పించడం ఈ మధ్య పరిపాటిగా మారింది. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఉదంతం అందుకు చక్కటి ఉదాహరణ.
సుప్రీం వ్యాఖ్యల తర్వాతైనా దర్యాప్తు సంస్థల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, నిగ్గుతేలే కేసుల సంఖ్య కూడా పెరగాలి. అందుకు మొదటగా దర్యాప్తు సంస్థలు జవాబుదారీతనంతో వ్యవహరించాలి. అలా జరగాలంటే ముందుగా వాటిని కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో నుంచి బయటపడేయాలి. ఆమూలాగ్రం పారదర్శకత తేవాలి. పూర్తిస్థాయి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి. వాటి నియంత్రణను పూర్తిగా పార్లమెంటరీ కమిటీకి అప్పగించాలి. ఇలాంటి విప్లవాత్మక మార్పులు జరిగితే తప్ప కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు మెరుగుపడదు. అయితే బీజేపీ నేతృత్వంలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో అది జరుగుతుందని ఆశించడం అత్యాశే.