వికీపీడియా ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. అది బీఆర్ఎస్ పార్టీకి చెందినదో, ఆ పార్టీ అభిమానులు నిర్వహిస్తున్నదో కాదు. అంతర్జాల పాఠకులే రచయితలై సమిష్టిగా వ్యాసాలు రాస్తూ, మార్పుచేర్పులు చేస్తూ ఉంటరు. ఆ వికీపీడియాలో నవంబర్ 29 అని వెతికితే వచ్చే సమాచారం ఇదిగో:
1877: థామస్ ఆల్వా ఎడిసన్చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది.
1929: భూ దక్షిణ ధ్రువం గగనతలంలో మొట్టమొదటిసారి యు.ఎస్. అడ్మిరల్ రిచర్డ్ బయర్డ్ ఎగిరాడు.
1947: నిజాం, భారత ప్రభుత్వాల మధ్య యధాతథ స్థితి ఒప్పందం కుదిరింది.
2009: తెలంగాణ రాష్ట్రసాధన కోసం టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో ‘ఆమరణ నిరాహారదీక్ష’ ప్రారంభించారు.
ఆ నాలుగో పాయింట్ చూసిన్రు కదా! అదీ స్వర్ణాక్షరాల చరిత్ర. తెలంగాణ సాధనాదీక్షకు దక్షుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు శాశ్వతంగా లిఖితమైన చారిత్రక వర్తమానం. భవిష్యత్ తరాలకు గర్వకారణం.
దశాబ్దాల సమైక్య పాలన తెచ్చిన కష్టాలకు ఫుల్స్టాప్ పడాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే మార్గమని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాడు యావత్ తెలంగాణ సమాజాన్ని ఒక్క తాటిమీదకు తెచ్చిన్రు. ‘మేము ఇచ్చినం’ అని ఇప్పుడు బీరాలు పోతున్న కాంగ్రెస్ మెడలు వంచిన్రు. ప్రాణాలు తృణప్రాయంగా బలిపెట్టిన యువత ఆకాంక్షకు, సకల జనుల ఉద్యమ గర్జనకు భయపడి.. ఎన్నో మెలికలతో, సగం మనస్సుతో తెలంగాణకు ఓకే చెప్పింది నాటి కేంద్ర ప్రభుత్వంలోని కాంగ్రెస్. చిన్నమ్మ పాత్ర పోషించిన బీజేపీకి తెలంగాణ అంటే ఎంత అయిష్టమో నేటికీ అదే పార్లమెంట్ వేదికగా తెలంగాణ పుట్టుకను అవమానించే ప్రధాని ప్రకటనలను చూస్తూ ఉన్నం.
పసికందు తెలంగాణను పిల్లల కోడిలా కమ్ముకుని, కాపాడుకుని, సాకి… పదేండ్లలో సగర్వంగా తలెత్తుకుని, దేశానికే మకుటంగా నిలిపారు కేసీఆర్. ఎన్నో మహోజ్వల ఘట్టాలకు ఊపిరులూదింది 2009 నవంబర్ 29 నాటి కేసీఆర్ దీక్ష!
కానీ, పరమ అన్యాయం ఏమంటే.. నేడు రేవంత్ పాలనలో తెలంగాణ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ కనీవినీ ఎరుగని కష్టాలు ఎదుర్కొంటున్నది. ఇంకా దారుణం ఏమంటే.. నాడు కేసీఆర్‌పై నిరంతర నిందలు వేసిన మేధావి వర్గం, జయశంకర్ సార్ చైతన్య స్ఫూర్తికి వారసులమని చెప్పుకొనే ప్రొఫెసర్లు నేడు మౌనమునులు అయిన్రు.
30 ఏండ్లకు మునుపే తెలంగాణ దశదిశపై కేసీఆర్‌కు సమగ్రమైన అవగాహన ఉన్నది. నీళ్లు-నిధులు-నియామకాలు ఉత్తిగనే ఉద్యమ ట్యాగ్ లైన్ కాలేదు. 1990లలోనే సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్ రూపకల్పన; వేలాది గంటల మేధోమధనం, లక్షలాది పేజీల అధ్యయనం ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం కాదు. తన జన్మభూమి రుణం తీర్చుకునే తపన నుంచి వచ్చిన సంకల్పం ఆయనది! చెప్పినవీ, చెప్పనివీ; ప్రజలు అడిగినవీ, అడగనివీ ఎన్నో తన పదేండ్ల పాలనలో చేసి చూపిన్రు ఆయన. ‘భళ్లున తెల్లారి చూస్తే అంతా కల్లాయెనే… అంతా కల్లాయెనే’ అంటూ వాపోయిన సాలూరి సన్యాసిరాజు గీతం లాగ… తెలంగాణ ప్రజలకు పదేండ్ల ప్రభ ఇప్పుడు కనుమరుగైంది. సత్యమే కాదు, భవిష్యత్తు స్వప్నమూ వెక్కిరిస్తున్నది. రేవంత్ రెడ్డి పాలనలో నేడు రాష్ట్రమంతా ప్రతీ వర్గమూ ఆందోళనలో ఉన్నది. లగచర్ల నుంచి నిర్మల్ దాకా కడుపు మండిన రైతాంగం అధికారులను తరిమికొడుతున్నరు. ఈ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న సీపీఐ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు ఆన్నారు నాతో ‘కొంత కాలమే చేసినా కిరణ్‌కుమార్ రెడ్డి నయం రేవంత్ కంటే’ అని. ఏమి ఖర్మ ఇది తెలంగాణకు? పదేండ్ల ప్రగతి తెలంగాణ దుంప నాశనం కావలసిందేనా? ఇందుకోసమేనా అమరులు త్యాగాలు చేసింది?
కేసీఆర్ పాలన పదే పదే గుర్తుకు వస్తున్నది తెలంగాణ ప్రజలకు. ఉద్యమ నాయకుడిగా ఆయన తెలంగాణ సమగ్ర అభివృద్ధి లక్ష్య ప్రకటన; పాలకుడిగా అవి సాధించిన ట్రాక్ రికార్డ్ ఆయనకు విశ్వసనీయత కలిగిస్తున్నయి. వీరే బాగు చేయగలరు, మరెవరూ రారు, లేరు అన్న ఎరుక వస్తున్నది జనానికి! కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే పిపీలకాలు, మానసిక మరుగుజ్జులు ఊహించలేని, అందుకోలే ని, కనీసం స్వప్నించలేని మహోజ్వల కీర్తి పతాక తెలంగాణ. కేసీఆర్-తెలంగాణ పదాలు గాఢంగా పెనవేసుకొని ఉన్నయి. రామాయణ, భారతాలలో అరణ్య, అజ్ఞాతవాసాల లాగ ఇది తెలంగాణకు పరీక్షా సమయం.
నవంబర్ 29 నాటి దీక్షా దివస్‌ను స్మరించుకోవడం, ఇప్పుడు తెలంగాణను ద్రోహుల నుంచి కాపాడుకోవడం ఒక్క బీఆర్ఎస్ పని మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రేమికులది. ఎన్నికల సమయమప్పుడు మళ్లీ మాట్లాడుకుందాం కానీ… ఇప్పుడైతే లోక కంటకులను ఎదిరించి, హక్కులు కాపాడుకోవలసిందే. అందుకు నాటి దీక్ష ఇచ్చిన స్ఫూర్తి నుంచి సంకల్పం పుట్టుకురావలసిందే. తెలంగాణ మళ్లీ జగజ్జేయంగా వెలగవలసిందే! రెండో మాట లేదు!!
జోహార్ అమర వీరులకు! జై తెలంగాణ!!
– శ్రీశైల్‌రెడ్డి పంజుగుల 90309 97371