ఆట రానోళ్లకు
ఏ వేషమేసినా అదే రాగం అదే రోగం
గిట్టని కారుకూతలు
తిట్టకపోతే ముద్ద దిగదు కునుకు రాదు
జీవధారపై కడుపు మంట
చెత్తకుండీల్లా నోళ్లు
కాలిరిగినంత మాత్రాన
మనిషే పోయినట్లు దుష్ప్రచారం
రాష్ట్ర బతుకు చిత్రాన్ని మార్చిన
కాళేశ్వర జలాశయంపై
కుట్రలు కుతంత్రాలు అభాండాలు
అత్యంత ప్రమాదకర ప్రచారాలు
కాళేశ్వరం గలగల నవ్వితే
కాంగ్రెసుకు భవిష్యత్ లేదు
తెల్లారి లేస్తే నిద్రలో కూడా
కాళేశ్వరం బుగులు
లక్షల ఎకరాలకు నీళ్లు
తరతరాల కరువు తండ్లాటకు
అయిదేళ్లలో జలావిష్కరణలు
ఎత్తిపోతలంటూ
నదిని అందకుండా చేశారు
నీళ్లులేక గొంతెండి గోడాడుతుంటే
పదవుల కోసం పెదవులు మూశారు
పెట్టుబడిదారులు
సీమాంధ్రను సస్యశ్యామలం చేస్తుంటే
తాళాలుగొట్టి తాంబూలాలతో హారతులిచ్చారు
నదీ జలాలంటే ప్రవహించే పుత్తడులు
తెలంగాణ రాష్ట్రమడిగితే
వేలాది మంది ఉసురు పోసుకున్నారు
తుపాకుల కాల్పులతో
ఉద్యమాన్ని సమాధి చేయాలనుకున్నారు
అనేకానేక పోరాటాలు త్యాగాలతో
నయవంచకుల మెడలొంచి
జై తెలంగాణ అనకుంటే దిక్కుతోచని స్థితిలో
‘తెలంగాణ’కు సై అన్నారు
గారడి మాటల మాయోపాయాలకు నేల కుదేలు
మాంత్రికుల మాయాజాలానికి
మొక్కలు అల్లల్లాడుతున్నాయి
జీవాలు నోళ్లు తెరిచాయి
అనతికాలంలోనే
కాలువలు చెరువులు అలుగు దుంకుతుంటే గుండె గుభేలు
మందారపు వికాసంలా ధాన్యపు సిరులు
నీళ్లకై జరిగిన ఉద్యమాలు
మీకెన్నడు మదిలో లేవు
పిశాచ గణాల గొట్టాలు తొండితనాలు దబాయింపులు
పెంపుడు బిడ్డల అసహన అక్షరాలు
ప్రాజెక్టులు కట్టలేని చేతకానితనం మరిచి
నీళ్లందించిన చేతులకు నోటీసులు
తొలిపొద్దు తెలంగాణ
సూర్యతేజం మాసిపోదు
ఆనవాళ్లు చెరిపెయ్యడానికి
ఆర్టీసీ బస్సు రంగుగాదు
విచారణల పేరున
కాలం గడుపుకోవటమే తప్ప
ప్రజలకిచ్చిన హామీలు శూన్యం
– వనపట్ల సుబ్బయ్య 94927 65358