e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home ఎడిట్‌ పేజీ దళిత క్రాంతికి ప్రగతి వంతెన

దళిత క్రాంతికి ప్రగతి వంతెన

‘ స్వాతంత్య్రానంతరం ఈ 70 ఏండ్లకాలంలో దళితులు అంటే దేశంలోని అన్ని వర్గాలు ఈర్ష్యపడే విధంగా అభివృద్ధి చెందారంటూ ప్రచారంలో పెట్టారు… మాటలతో మోత మోగించారు ఈ దేశంలో దళితులు తప్ప ఇంకెవరూ లేరా వారికోసమే ఈ ప్రభుత్వాలు వున్నాయా అని మిగతా వర్గాల ప్రజలు అసూయ పడే విధంగా ప్రచారం జరిగింది. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా వుంది..’. ఇది దళితుల అభివృద్ధిపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన చారిత్రక సత్యం.

నా వృత్తిపరమైన జీవితంలో నేను అనేక మంది ముఖ్యమంత్రులను చూశాను, మాట్లాడాను. బహుశా నా జర్నలిస్ట్‌ జీవితంలో, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక దళితుల స్థితిగతులపైన ఇంత లోతైన అధ్యయనం చేసిన ముఖ్యమంత్రిని చూడలేదు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ప్రతిపాదించిన దళిత జీవిత సైద్ధాంతికతకు, ఆత్మగౌరవానికి సీఎం కేసీఆర్‌ ఆచరణ రూపం ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే దళితులకు ఏం చేయాలనే ఆలోచనకు బీజం పడి ఆ ఆలోచన ఇప్పుడు ఆచరణ రూపం తీసుకోబోతున్నది. ‘ఎందరో నాయకులు అధికారంలోకి వస్తారు, పోతారు. కానీ దళితుల జీవితాలు అలాగే వుంటాయని’ అంబేద్కర్‌ ఆవేదన చెందారు. ఈ ఆవేదనను దూరం చేసేలా, దేశం గర్వించేలా దళిత ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి, వారి భవిష్యత్తు తరాలకు బంగారుబాటలు వేసే అద్బుతమైన ఆలోచనే ఈ కేసీఆర్‌ దళిత సాధికారతా విధానం. 1950లోనే దళితుల అభివృద్ధి కోసం ఆలోచన నాటి ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ, 1980 నాటికి కానీ అది రేఖామాత్రంగా ఆచరణలోకి రాలే దు. ఆతర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల వి ధానాలు ప్రవేశ పెట్టాయి. దళితుల అభివృద్ది పేరిట కోట్లా ది నిధులు కేటాయించాయి. దళితుల అభ్యున్నతి కోసమే తామున్నామనే ప్రచారాన్ని హోరెత్తించాయి. కానీ దళితుల జీవితాల్లో మార్పు రాలేదు. ఈ సుదీర్ఘ కాలంలో 25 శాతం దళితులు మాత్రమే అభివృద్ధిలోకి రాగలిగారని ఒక అంచనా.

- Advertisement -

కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకువస్తున్న దళిత ఎంపవర్‌మెంట్‌ విధానం భిన్నంగా ఉండబోతున్నది. ఇందుకోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. ఈ విధానాన్ని వివరించే కన్నా, దాని ఫలితం ఎట్లా వుంటదో చెప్పదలచుకున్నా. ఈ దళిత ఎంపవర్‌మెంట్‌లో లబ్ది దారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది. ప్రాథమిక దశలోనే, ఒక్క నియోజకవర్గంలోనే ఈ పథకం కింద 100 కుటుంబాలు అంటే రాష్ట్రంలో 12,000 కుటుంబాలు లబ్ధి పొందుతాయి. ఈ సంవత్సరానికి పైలట్‌ ప్రాజెక్టు కింద 120 నియోజకవర్గాలకు 1200 కోట్లతో లబ్ధి చేకూరనున్నది. రాబోయే మూడేండ్లలో 40 వేల కోట్లు ఈ పథకం కింద వెచ్చించనున్నారు. అలాగే ప్రతిభ, సృజనాత్మకత కలిగిన లక్షలాది దళిత యువతీ యువకులు వారి ఆర్థిక జీవన విధానాన్ని వారే ఎంచుకునేలా ప్రభుత్వం సం పూర్ణ మద్దతును, స్వేచ్ఛను ఇస్తుంది. ఒకటి 2 లక్షలతోనే ఒక చాయ్‌ దుకాణమో, కూరగాయల దుకాణమో నడుపుకునే వారే ఓ మోస్తరు జీవితాన్ని గడుపుతున్నారు. అటువంటప్పుడు రూ.10 లక్షల తోడ్పా టు అం దిస్తే తనతో పాటు మరిన్ని కుటుంబాలకు ఉపాధి కల్పిస్తారు. ఇది దళిత ఎంపవర్‌మెంట్‌ పథకంలో ఒక భాగం మాత్రమే. దళితులు మెయిన్‌స్ట్రీమ్‌తో పాటు సకల రంగాలలో ముందడుగు వేసేవిధంగా ఈ విధానం పనిచేస్తుంది.

కేసీఆర్‌ దళిత సాధికారత విధానం లో ఇంకొన్ని చెప్పుకోదగినవి ఉన్నా యి. భూమిలేని నిరుపేద దళితులకు బీమా సౌకర్యం, దళిత యువతను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రతి జిల్లాలో ఎక్సలెన్స్‌సెంటర్లతోపాటు, ప్రభుత్వ టెండర్లలో దళితులకు కోటాను ఇవ్వనున్నారు. అట్లనే దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగితే, బాధ్యులపై చట్టపరమైన చర్యలతో పాటు, నిర్లక్ష్యం వహించిన లేదా బాధ్యులైన ప్రభుత్వ అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకునే వెసులుబాటు ఈ నూతన విధానంలో ఉన్నది. దళితులకు రాజ్యాంగం రక్షణ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం సామాజిక రక్షణను ఈ దళిత ఎంపవర్‌మెంట్‌ ద్వారా ఇస్తున్నది.

కార్పొరేట్‌ కళాశాలలో చదివితేనే అమెరికాకు వెళ్తారని, మంచి యూనివర్సిటీలో సీటు వస్తుందనే అభిప్రాయం వుండేది. కానీ ప్రభుత్వ గురుకులాల విద్యార్థులు సైతం ఎవరెస్ట్‌ ఎక్కుతారని స్టాక్‌ మార్కెట్‌ చదువుతారని ఆక్స్‌ఫోర్డ్‌లో సీట్‌ పొందుతారనేది అనూహ్యం. ఈ విషయం లో సీఎం కేసీఆర్‌ ఆలోచన, ప్రోత్సాహం సరికొత్త చరిత్రను సృష్టించింది. పరిశోధన విద్యార్థులకు గతంలో కేంద్ర ప్రభుత్వమే స్కాలర్‌షిప్స్‌ ఇచ్చేది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దుచేసింది. కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిశోధన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇచ్చే విధానానికి మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. ప్రపంచీకరణ అనంతరం దేశంలో పలు మార్పులు వచ్చాయి కానీ దళితుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదు. దానికి దోహదపడే వనరులు వారికి లేవు. అందువల్ల ఊరులో ఉపాధి లేదు. కార్పొరేట్‌ స్థాయి ల్లో పనిచేసే అవకాశం లేదు. దీంతో వారి పిల్లల భవిష్యత్తయినా బాగుపడుతుందనే నమ్మకం లేక దళితులు కుంగిపోయివున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ తెచ్చిన దళిత సాధికారత పథకం ఓ వెలుగు రేఖ.

గోదావరి నదినే తెలంగాణ పల్లెలకు తరలించే మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంచేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు దళితుల అభ్యున్నతినే తన తదుపరి ప్రాధాన్యాంశంగా ప్రకటించారు. దళిత సాధికార కార్యక్రమాన్ని తన జల స్వప్న కాంక్షతో పోల్చిచెప్పారు. రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్‌ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్‌ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. కరోనా మూలంగా ఆర్థిక ఇబ్బంది వచ్చినా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల సర్వతోముఖాభివృద్ధికి మూడేళ్లలో నలభై వేల కోట్లను ఖర్చుచేయబోతున్నది. ఏటా అనేక పేద దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించబోతున్నాయని చెప్పడానికి గర్విస్తున్నా. ఈ చారిత్రక అద్భుత అవకాశాన్ని అందుకోవడమే మన పని.

దళితుల సామాజికార్థిక అభివృద్ధికి వారి చేయిపట్టి నడిపించే పెద్దన్నలా ముఖ్యమంత్రి కంకణబద్ధులై ఉన్నారు. వాగు దాటితే తప్ప ఊరు చేరుకోలేని ప్రజలకు ఒక వంతెన వస్తే, ఆ ఊరి జీవనమే మారిపోతుంది. వంతెన వల్ల ఆ ఊరికి బస్‌ వస్తుంది, బ్యాంక్‌ వస్తుంది. రాకపోకలు పెరిగి ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. ఆ ఊరి ఆర్థిక పునాది బలపడుతుంది. దళిత ఎంపవర్‌మెంట్‌ కూడా దళితుల్లో ఇలాంటి మార్పే తీసుకొస్తుంది.

చంటి క్రాంతి కిరణ్‌ (వ్యాసకర్త: సీనియర్‌ పాత్రికేయులు; శాసన సభ్యులు, ఆందోల్‌)

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana