తెలంగాణ ఉద్యమం మొదలయిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాల మీద. కాకతీయుల కాలం నుండి హైదరాబాద్ రాష్ట్రం వరకు గొలుసుకట్టు చెరువులు, పలు ప్రాజెక్టులతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ వ్యవసాయరంగం ఆంధ్రప్రదేశ్ అవతరణతో తిరోగమనం వైపు పయనించింది. అటు గోదావరి, ఇటు కృష్ణా నదులు ప్రవహిస్తున్నా ఎత్తైన ప్రాంతానికి సాగునీరు తరలించడం సాధ్యం కాదంటూ సమైక్య పాలకులు మభ్యపెట్టి తెలంగాణ వ్యవసాయరంగాన్ని క్రమంగా సంక్షోభంలోకి నెట్టారు. దీంతో సాగునీటి కోసం తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో దాదాపు 26 లక్షల నుంచి 30 లక్షల మంది రైతులు బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసేవారంటే నాటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంతచేసినా కరెంటు కోతలు, పంట చేతికి వచ్చిన తర్వాత మద్దతుధర దక్కకపోవడం వంటి సమస్యలతో రైతులు అప్పులపాలయ్యారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడితే, మరికొందరు వలసల బాటపట్టారు.
1995 నుంచి 2013 వరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రికార్డుల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 36,358 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వీరిలో తెలంగాణకు చెందిన వారు దాదాపు 22,000 (60 శాతం) మంది ఉన్నారు. ఇంకా రికార్డుల్లోకి ఎక్కని వారు చాలా ఎక్కువమంది ఉండొచ్చని అంచనా. సమైక్య పాలకుల పాపానికి ఒక్క పాలమూరు జిల్లా నుంచే దాదాపు 14 లక్షల మంది ఉపాధి కోసం వలస వెళ్లే వారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్ష మీద సంపూర్ణ అవగాహన ఉన్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి, దేశంలోని అనేక రాజకీయ పార్టీల మద్దతును సాధించి, కుట్రలను ఛేదించి, కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయరంగమే ప్రాధాన్యత అంశంగా పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టారు. గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడున్నరేండ్లలో పూర్తి చేశారు. కృష్ణా నది మీద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టి 90 శాతం పనులతోపాటు, ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.
దశాబ్దాల వివక్షతో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న రైతుల్లో ధైర్యాన్ని నింపడానికి ఎకరాకు ఏడాదికి రూ.10 వేల నగదుసాయం అందించే రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. 11 విడతలలో దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.72,815 కోట్లు జమచేశారు. వ్యవసాయాన్ని నమ్ముకుని ప్రపంచానికి అన్నం పెట్టే రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబం రోడ్డున పడకూడదని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, మరణించిన రైతు కుటుంబానికి 10 రోజుల లోపు రూ.5 లక్షల సాయం అందించేలా రైతుబీమా పథకం ప్రవేశపెట్టారు. ఫలితంగా 1,11,320 రైతు కుటుంబాలకు రూ.5,566 కోట్ల సాయం అందింది. వ్యవసాయరంగానికి సాగునీరు అందించడమే కాకుండా ఏడాదికి రూ.10,500 కోట్ల సబ్సిడీని భరించి 24 గంటల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలుచేశారు. పం డిన పంటలను వంద శాతం కొనుగోలు చేశారు.
సమైక్యరాష్ట్రంలో అప్పుల బారిన పడిన రైతులను ఆదుకునేందుకు కేసీఆర్ హయాంలో 58.29 లక్షల మంది రైతులకు రూ. 29,144.61 కోట్లు రుణమాఫీ చేశారు. ప్రపంచాన్ని గడగడ వణికించిన కరోనా విపత్తులోనూ రైతుబంధు పథకం కింద సాయం అందించడమే కాకుండా, ఏడు వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల కల్లాల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 2014-15లో రూ.1,12,162గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం 2022 – 23 వరకు రూ.3,17,115కు పెరిగింది. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కేసీఆర్ తీసుకున్న చర్యలతోనే ఇది సాధ్యమైంది.
2014లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగువిస్తీర్ణం 2022-23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. 2014-15లో 68 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న ధాన్యం ఉత్పత్తి, 2022 – 23 నాటికి దాదాపు 3 కోట్ల టన్నులకు చేరింది. ఇవి కాకుండా అందుబాటులో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ విద్యకు ప్రాధాన్యం, 5 వేలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం, 2601 రైతు వేదికల నిర్మాణం, 39.01 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యాన్ని, 73.82 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం వంటి అనేక చర్యలు చేపట్టారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) 2018లో ప్రపంచంలోని 20 అత్యున్నత పథకాల్లో వినూత్నమైనవిగా గుర్తించి ప్రశంసలు కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 700 పైచిలుకు పథకాల నుంచి ఎంపికైన 20 పథకాలలో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా ఉండడం విశేషం.
కేసీఆర్ పాలనలో రైతులు, వ్యవసాయరంగ అభ్యున్నతి కోసం తీసుకున్న చర్యలు, ప్రవేశపెట్టిన పథకాల మీద పక్కా ప్లాన్ ప్రకారం బురదజల్లారు. రైతుబంధు భూస్వాములకు ఇస్తున్నారని, ఏడాదికి మూడు పంటలు పండిస్తుంటే, రెండు పంటలకే రైతుబంధు ఎలా ఇస్తారని, మూడో పంటకు ఎందుకు ఇవ్వరని, చనిపోయిన తర్వాత ఇచ్చే ముష్టి రూ.5 లక్షల రైతుబీమా ఎందుకు అని అవాకులు చెవాకులు పేలారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో గెలుపుకోసం 2022 మే 6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ పేరుతో సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ప్రకటించింది. రాహుల్‌గాంధీ హాజరై డిక్లరేషన్ విడుదల చేయడం గమనార్హం. దీనిని 2023 కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2023 డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుందని, రూ.లక్ష రుణం ఉన్నవారు రూ.లక్ష బ్యాంకులో చెల్లించి, రూ.2 లక్షలు రుణం తీసుకోవాలని రెచ్చగొట్టారు.
రైతుబంధు కింద ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు కాదని, రూ.15 వేలు ఇస్తామని, కౌలు రైతులకు కూడా పథకం వర్తింపచేస్తామని నమ్మబలికారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీతో ఆశపెట్టారు. అన్ని పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని, ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని, మిగతా పంటలను కూడా మద్దతు ధరకు మించి రూ.400-రూ.500 ఎక్కువ చెల్లించి కొనుగోలు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. పోడు రైతులు, అసైన్డ్ భూముల లబ్దిదారులకు క్రయవిక్రయాలతోపాటు అన్నిరకాల యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ మాటలు నమ్మిన కొందరు రైతులు ఆశపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హామీలను అటకెక్కించింది.
అసలు తెలంగాణ వ్యవసాయం, తెలంగాణ రైతులు సమూలంగా నాశనం కావడం కాంగ్రెస్ పాలకుల పాపమే. తెలంగాణ ఉద్యమం మొదలైంది కాంగ్రెస్ పార్టీ వివక్షపూరిత పాలన ఫలితంగానే. ఇప్పుడు కూడా నమ్మి ఓటేసిన రైతులను నట్టేట ముంచింది. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.12 వేలకు కుదించారు. దానిని ఇప్పటికి మూడు సార్లు ఎగ్గొట్టారు. ఒకసారి పాక్షికంగా చెల్లించారు. వివిధ ఎన్నికలకు ముందు రైతులను మభ్యపెట్టడానికి దయతలచినట్టుగా నిధులు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి నుంచి జనవరి నెలాఖరులోపు రైతుల ఖాతాలలో జమ కావాల్సిన యాసంగి రైతు భరోసా పైసలు కోతలు పూర్తయి, రైతులు పంటలు అమ్ముకుంటున్నా ఇప్పటికీ జమకాలేదు.
ఇది కాంగ్రెస్ మోసానికి పరాకాష్ట. కేసీఆర్ పాలనలో రైతు కుటుంబాలకు ధైర్యాన్నిచ్చిన రైతుబీమా, కాంగ్రెస్ పాలనలో ధైన్యంగా మారింది. వేల మంది రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పాలకులు కాళేశ్వరం మీద నిందలు వేసి మరమ్మతులు చేయకుండా, రెండున్నరేండ్లుగా రైతులకు సాగునీరు అందించడం లేదు. 90 శాతం పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో అప్పటికే పూర్తయిన కాలువల టెండర్లు రద్దు చేసి, రెండున్నరేండ్లుగా అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలేదు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో మాయమైన యూరియా క్యూలైన్లు కాంగ్రెస్ పాలనలో తిరిగి ప్రారంభమయ్యాయి. యూరియా కావాలంటే యాప్ లో బుకింగ్ చేసుకోవాలంటూ నిబంధన పెట్టి, రైతులను ఏడిపిస్తున్నారు. కేసీఆర్ పాలనలో కల్లాల వద్దనే ధైర్యంగా దర్జాగా పంటలను అమ్ముకున్న రైతులు ఇప్పుడు మార్కెట్ యార్డుల్లో పంటలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రైతులకే రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కార్ కౌలు రైతులు, రైతుకూలీల ఊసే ఎత్తడం లేదు.
క్వింటాలుకు పంటలకు బోనస్ ఇస్తామని మ్యానిఫెస్టోలో అట్టహాసంగా ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ధాన్యానికి మాత్రమే క్వింటాలుకు రూ.500 బోనస్ అని చెప్పి చివరకు అది కూడా సన్నవడ్లకే అని పరిమితం చేశారు. ఇప్పుడు దానికి కూడా బోనస్ ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారు. అందుకే అధికారం కోసం కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి, రైతులను చైతన్యం చేసేందుకు అదే వరంగల్ వేదికగా ఈ నెల 6న బీఆర్ఎస్ రైతుసభను నిర్వహిస్తున్నది. సభను విజయవంతం చేద్దాం. రైతుకు నష్టం అంటే కేవలం ఆర్థికంగా నష్టపోవడం కాదు. అది మానసికం, శారీరకం, కుటుంబం మీద భారం, ఏటా వర్షం, కరువు, అప్పులు, పంటలకు పురుగు సమస్య, మార్కెట్ ధరలు వంటివి హింసిస్తాయి. అయినా నిరాశ చెందకుండా మట్టిని నమ్ముకుని సమస్త మానవాళికి ఆహారం అందిస్తారు రైతులు. రైతేరాజు అనే మాట ఒక నినాదంలా కాదు, పాలకుల విధానంగా మారేలా పోరాడుదాం.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి