పంట రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా.. ఈ మూడు హామీలతో తెలంగాణ రైతన్నకు తోడుగా నిలుస్తానన్న రేవంత్‌రెడ్డి మాట ఒక్కటీ పద్ధతిగా నెరవేర్చనేలేదు. ప్రభుత్వ అకాల నిర్ణయాలు, అరకొరగా వాటి అమలు తీరుతో రైతు చేతిలోంచి పంట కాలం ఎత్తిపోతున్నది. రుణమాఫీ ‘ఇచ్చేది ఇచ్చాం’ అన్నట్టుగా ఉన్నది. ‘భరోసా’నేమో ప్రక్షాళన సాకుతోముందుకుసాగడం లేదు. ‘బీమా’ ఈ యాసంగి పంటకైనా అనుమానమే అన్నట్టుగా ఉన్నది. నిజానికి ఈ హామీలన్నీ జాగ్రత్తగా పరిశీలించి లబ్ధిదారులకు సకాలంలో అందిస్తేనేతగిన ఫలితాలిస్తాయి. ఎప్పుడైనా ఇయ్యవచ్చు అనుకునేందుకు ఇవి గుత్తేదారుల బిల్లులు కావు.
పంట రుణమాఫీ, రైతు భరోసా, పంట ల బీమా.. ఈ మూడింటిలోని మొదటి రెండింటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా నడవవచ్చు. పంట బీమా మాత్రం సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే కవరేజీ లభించదు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న పంటల బీమా పథకమే ఓ విచిత్రమైన పద్మవ్యూహం. 2016లో కేంద్రం ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ ప్రభుత్వ, ప్రైవే టు కంపెనీల సారథ్యంలో నడుస్తున్నది. దీనితో రైతును బతికిస్తున్నామా లేదా వారిని దోచి బీమా కంపెనీల గల్లా పెట్టె నింపుతున్నామా అనేది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్ననే.
ఈ ‘యోజన’ ప్రకారం వరి పంట వేసే రైతు బ్యాంకు నుంచి లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంటే రూ.2 వేలు బీమా ప్రీమియం చెల్లించాలి. చిన్న, సన్నకారు రైతులకు సగం ప్రీమియంను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. అయితే, ఏ సంవత్సరం కూడా ప్రీమియంకు సమానమైన క్లెయిమ్ సొమ్ము కూడా రైతులకు అందడం లేదు. భారీ పంట నష్టాల్లో సైతం ఆ కం పెనీలు లాభాలే మూటగట్టుకున్నాయి. పేరుకే కేం ద్రం నిర్వహణలో ఉన్న ఈ పథకం రైతుకు అసలే మేలు చేయని, ఎవరికీ అర్థం కాని బ్రహ్మపదార్థంలా తయారైంది. అందుకే, దేశంలోని ఏడు ప్రధాన రాష్ర్టాలు ఆ బాధలు పడలేక ఈ పథకానికి దూరంగా జరిగాయి. దేశ ధాన్యాగారంగా పేరు పొందిన పంజాబ్ ఇందులో చేరనే లేదు. బీహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్, ఏపీ, తెలంగాణ, జార్ఖండ్ ఈ పథకం నుంచి తప్పుకొన్నాయి. దీనివల్ల రైతులకు, ప్రభుత్వానికి భారమే తప్ప ఫలితం లేదనే భావనతో 2020లో నాటి సీఎం కేసీఆర్ తమ రాష్ర్టానికి ప్రైవేటు పైచేయి గల పంటల బీమా వద్దని నిర్ణయం తీసుకున్నారు. 2018లోనే ఆయ న రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు ప్రవేశపెట్టినందువల్ల పంట బీమా అనేది రైతుకు అనవసర ఖర్చుగా భావించి రాష్ర్టాన్ని ఆ పథకం నుంచి తప్పించారు.
రుణమాఫీ, భరోసా అనేవి సరాసరి రైతుకు ప్రభుత్వం అందజేస్తే పంట బీమా ప్రీమియం రైతు చెల్లించాలి. ఒకరకంగా ఇది రైతుకు భారమే. అయితే, బీమా పథకంపై అత్యుత్సాహం చూపిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి రైతు చెల్లించే ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ లెక్కన రైతులపై ఎలాంటి ఆర్థికభారం పడకూడదు. కానీ, ఖజానాపై దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్రంలో ఒక సీజన్ పంటలకు బీమా చేయాలంటే రైతుల నుం చి రూ.1600 కోట్లు వసూలు చేసి, ప్రభుత్వం వాటాగా రూ.2000 కోట్లు కలిపి కేంద్రానికి అప్పగించాలి. కేంద్రం తన వాటా ను కలిపి బీమా కం పెనీలకు చెల్లిస్తుంది. ప్రభుత్వ హామీ ప్రకారం ఒక సీజన్ బీమా కోసం ప్రభుత్వం రూ.3,600 కోట్ల ఖర్చు మోయవలసి ఉంటుంది.
ఆరోగ్య, వాహన బీమా మాదిరే ఈ పంటల బీమా ఉంటుంది. అయితే, ప్రమాదాలతో పోల్చి తే పంటలు దెబ్బతినే సందర్భాలు ఏటికేడు పెరిగి పోతున్నాయి. వచ్చే ప్రీమియం కన్నా పరిహారం సొమ్ము ఎక్కువగా చెల్లించే పరిస్థితి రావడంతో బీమా కంపెనీలు విధివిధానాలు కఠినం చేసి క్లెయి మ్ సెటిల్మెంట్ నుంచి తప్పించుకుంటున్నాయి. పంట కోతలు కాగానే నష్టాన్ని లెక్కించి రైతులకు రెండు నెలల్లో చెల్లించాలి. పంట నష్టం అంచనా, చెల్లింపులకు చాలా సమయం తీసుకుంటున్నాయి. ఏదో సాకుతో క్లెయిమ్‌లు ఏండ్ల తరబడి పెండింగ్ పెడుతున్నాయి. 2017-18లో రూ.2,282 కోట్ల క్లెయిమ్స్ పక్కన పెట్టడంతో కోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ‘పరిహారం చెల్లించలేకపోతే కనీసం రైతుల ప్రీమి యం సొమ్మునైనా వాపస్ ఇచ్చేయండ’ని కోర్టు విసుక్కోవలసి వచ్చింది.
ఏటా జరిగే బిడ్డింగ్ ద్వారా పంటల బీమా వ్యాపారాన్ని చేజిక్కించుకునే బీమా సంస్థలు ప్రీమి యం నిర్ణయాల్లో, పరిహార చెల్లింపుల్లో ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నాయి. రైతుకు సాయం చేయాలన్న సంకల్పం పోయి పంటల బీమాను కూడా లాభాల పంటగానే అవి చూస్తున్నాయి. 2016 నుంచి ఏ ఒక్క సంవత్సరం కూడా బీమా కంపెనీలు ప్రీమియంను మించి న క్లెయిమ్స్ చెల్లించలేదు. 2016-17లో దేశవ్యాప్తంగా ప్రీమియం మొత్తం రూ.21,950 కోట్లు కాగా రూ.16,827 కోట్లు మాత్రమే పంట నష్టంగా రైతులకు చెల్లించాయి. 2021-22 విషయానికి వస్తే బీమా సొమ్ముగా రూ.27,901 కోట్లు పొందిన కంపెనీలు రూ.5,761 కోట్లు మాత్రమే పరిహారంగా నిర్ధారించాయి.
పంట బాగా పండితే రైతు కూడా బీమా సొమ్ము కోసం ఎదురుచూడడు. పంట చేతికిరాని సందర్భాల్లో ప్రీమియం వసూలుచేసిన కంపెనీ ముఖం చాటేస్తే బీమాకు అర్థమే లేదు. పంట నష్టాన్ని నిర్ధారించడానికి కంపెనీలు పాటిస్తున్న విధానాలు ఘోరంగా ఉన్నాయి. ఎవరి పంటను వారికి లెక్కేయకుండా గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోని నష్టాన్ని లెక్కిస్తారు. గ్రామం మొత్తంలో 33 శాతం పంట దెబ్బ తింటే నష్టంగా పరిగణిస్తారు. గత మూడేండ్ల పంట దిగుబడిని సగటుగా తీసుకొని దానికన్నా 33 శాతం తక్కువ పంట వస్తే పరిహారానికి అర్హతగా ప్రకటిస్తారు. తమ రెవెన్యూ, వ్యవసాయ శాఖల ద్వారా ప్రభుత్వాలు సేకరించిన లెక్కలను వారు అంగీకరించరు. పంటల పరిశీలన, దిగుబడి గణాంకాలన్నీ బీమా కంపెనీ సిబ్బందియే చేపడుతుంది. వారి సిఫారసు మేరకే క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుంది.
రైతుకిచ్చిన హామీలు ఎక్కడికక్కడే ఉండగా, పంటల బీమా ఈ ప్రభుత్వంతో సాధ్యపడేనా అనే అనుమానం కలగకమానదు. కచ్చితంగా చేసి తీరుతామనుకుంటే ఇప్పటికే బీమాను అమలుచేస్తున్న రాష్ర్టాల అనుభవాలను గమనించి ముందడుగువేయాలి.