ఒక ముఖ్యమంత్రికి పరిపాలన ఎంత ముఖ్యమో నిజాయితీ, పరిణతి కూడా అంతే ముఖ్యమైనవి. రేవంత్‌రెడ్డిని తీసుకుంటే, ఆయనకు ఏడాది క్రితం ముఖ్యమంత్రి కావటానికి ముందు ఎటువంటి పాలనానుభవం లేదు. కానీ, అందులో ఆక్షేపించవలసిందేమీ లేదు. కొత్తగా అధికారానికి రావటం జరుగుతూనే ఉంటుంది. కావలసింది అటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని, మంచి పాలనను క్రమంగా నేర్చుకుంటూ, పరిణతిని సాధించటం. అదే క్రమంలో, నిజాయితీపరుడనే పేరు తెచ్చుకోవటం. ఈ దిశలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం అంటూ కలిగితే, పాలకుడు తొలుత కొంత తడబడినా ప్రజలు తప్పక అర్థం చేసుకుంటారు. మరికొంత సమయమిస్తారు. కానీ, రేవంత్‌రెడ్డిలో ఈ లక్షణాలు ఇప్పటికీ కనిపించటం లేదు.
CM Revanth Reddy | కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న ఒక ముఖ్యమైన ఉదాహరణను చూద్దాం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఈ నెల 4వ తేదీన దినపత్రికల మొదటిపేజీలో, ‘తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు’ అంటూ ప్రకటనలు ఇచ్చారు. ఏ శాఖలో ఎన్నెన్నో అందులో పేర్కొన్నారు. ఆ వివరాలను పరిశీలించినప్పుడు అందులో పరిపాలనాదక్షత, నిజాయితీ, పరిణతి అనే మూడు కూడా కనిపించవు. కాంగ్రెస్ ప్రభుత్వపు నిజ స్వరూపం ఈ ఒక్క ఉదాహరణతోనే తెలిసిపోతుంది. ఈ మాట అనేందుకు తగిన కారణాలున్నాయి తప్ప ఇది గాలి విమర్శ కాదు. ప్రభుత్వం పేర్కొన్న 55,143 ఉద్యోగాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు 50,127. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినవి 12,527 ఉద్యోగాలకు మాత్రమే. తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మొదటి ఏడాదిలోనే కొత్తగా 2 లక్షలని. ఈ వేర్వేరు అంకెల మధ్య తేడాలేమిటో కనిపిస్తున్నవే అయినందున వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు. ఈ వాస్తవికమైన లెక్కలు ఎన్నోసార్లు ముందుకువచ్చినా ప్రభుత్వం వద్ద సమాధానం లేకపోవటం గమనించదగ్గది.
అదే సమయంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తాము ఇచ్చామంటున్న 55,143 ఉద్యోగాలలో 50,127 ఉద్యోగ నోటిఫికేషన్లు గత ప్రభుత్వం ఇచ్చినవేనని గాని, కేవలం ఎన్నికల కోడ్ రావటంతో ఆ నియామకాలు ఆగాయని గాని, తాము ఏడాది కాలంలో ఇవ్వగలమన్న 2 లక్షల కొత్త ఉద్యోగాలకు బదులు నోటిఫికేషన్లు ఇచ్చింది 12,527కు మాత్రమేనని గాని ప్రభుత్వం నిజాయితీగా చెప్పొచ్చు. తాము ఇచ్చినట్టు పదే పదే చాటుకునే నియామక పత్రాలన్నీ కేసీఆర్ కాలపు నోటిఫికేషన్లవి మాత్రమేనని, కొత్తగా చేసింది లేదని స్వయంగా నిరుద్యోగులు, వారి టీచర్లు అశోక్‌నగర్‌లో గొంతెత్తి వాదిస్తున్నా అందుకు జవాబివ్వదు. కానీ, 7వ తేదీకి ఏడాది పూర్తయిన సందర్భంగా నల్లగొండ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదేనని, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి వారి రుణం తీర్చుకోవద్దా అని, మొదటి ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలిచ్చిన రాష్ట్రమేదీ మొత్తం దేశ చరిత్రలోనే లేదని అంటారు. దీనిపై కూడా వ్యాఖ్యానాలు అవసరం లేకుండానే నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజలు అర్థం చేసుకోగలరు. అవి ప్రభుత్వానికి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే వట్టి బుకాయింపులని కనిపిస్తున్నదే.
కొంత వెనుకకు వెళ్తే, గత ఎన్నికల సమయంలో నిరుద్యోగ సమస్య బాగా ప్రచారంలోకి వచ్చింది. ఉద్యోగ, ఉపాధి సమస్యలు ప్రపంచమంతటా, దేశమంతటా తీవ్రంగా ఉండటం, అందుకు కారణాలేమిటనే చర్చను పక్కన ఉంచుదాం. అందుకు ఇది సందర్భం కాదు గనుక. కానీ, ఆ సమస్య తెలంగాణలోనూ ఉండటమన్నది వాస్తవం. అందువల్ల అది సహజంగానే యువతరంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఎన్నికల సమయం గనుక ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ దానిని సమర్థవంతంగా ఉపయోగించుకున్నది. సమస్యలకు గురవుతుండిన యువతరం కాంగ్రెస్ పక్షం వహించింది. ఆ వేడిలో, తాము అధికారానికి వస్తే మొదటి ఏడాదిలోనే కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమనే కాంగ్రెస్ హామీ వారిని కట్టిపడవేసింది. మరొకవైపు, బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదేండ్లలో ‘అసలు ఏ ఉద్యోగాలు ఇవ్వనేలే’దన్న అసత్య ప్రచారానికి అప్పటి వాతావరణంలో యువతరం, సాధారణ ప్రజలు కూడా ప్రభావితులయ్యారు. రాహుల్, ప్రియాంకల అశోక్‌నగర్ సందర్శనలు అందుకు తోడయ్యాయి. ఒక్కోసారి పరిస్థితుల ప్రాబల్యంతో అసత్యాలు నిజాలుగా చలామణీ అవుతుంటాయి.
అటువంటి పరిస్థితుల మధ్య, కేసీఆర్ పాలన పదేండ్ల కాలంలో నియామకాల వాస్తవాలేమిటన్నది ఎవరికీ పట్టలేదు. ఎవరైనా చెప్పినా, వ్యతిరేక ప్రచారపు హోరు ముందు అది తేలిపోయింది. వాస్తవాలేమిటి? బీఆర్ఎస్ పదేండ్లలో కలిపి ఆర్థికశాఖ అనుమతించిన ఉద్యోగాలు 2,32,308. నోటిఫికేషన్లు ఇచ్చినవి 2,02,735. వాస్తవంగా భర్తీ చేసినవి 1,60,083. ఈ సంఖ్యలను ఉమ్మడి రాష్ట్రపు కాంగ్రెస్ పాలన (2004-14)తో పోల్చితే, అప్పుడు తెలంగాణలో జరిగిన మొత్తం నియామకాలు కేవలం 10,080. అనగా, కాంగ్రెస్ పదేండ్ల కన్న బీఆర్ఎస్ పదేండ్లలో సుమారు 15 రెట్లు ఎక్కవ.
ఈ అంకెలు ఏవీ ఊహాగానాలు కావు, గాలి మాటల ప్రచారాలు కావు. అన్నీ ప్రభుత్వ రికార్డులలో ఉన్నవే. ముఖ్యమంత్రి, అధికారపక్షం వారు, తమను సమర్థించే మేధావి బృందాల వారు తేలికగా తనిఖీ చేయవచ్చు. సమాచార హక్కు కింద నిరుద్యోగులు, విద్యార్థులు, లేక మరెవరైనా గాని దరఖాస్తు చేసినట్టయితే సమాచారం ఇవ్వగలరో లేక ఏదో ఒక సాకుతో తొక్కిపెట్టగలరో తెలియదు గాని, ఇవన్నీ రికార్డులలో ఉండే వివరాలే. ఇదంతా తెలిసినా, తెలియకపోయినా నిరుద్యోగులకు వాస్తవ పరిస్థితి అర్థం కావటం మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల నుంచే మొదలైంది. దాని సారాంశం తాము మోసానికి గురవుతున్నామని. ఆ నిరాశాభావంతో తిరిగి ప్రశ్నించటం మొదలుపెట్టారు. కొత్త ప్రభుత్వం ఇస్తున్న నియామక పత్రాలు గత ప్రభుత్వపు నోటిఫికేషన్లవే తప్ప, కొత్తవి ఏవంటూ నిలదీశారు. వాటిలో అదనపు ఖాళీలు ఎక్కడున్నాయన్నారు. తమకిచ్చిన హామీలకు విరుద్ధంగా ఉన్న జీవోల రద్దుకు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తమకు మద్దతు ప్రకటించటమే గాక, కాంగ్రెస్ ప్రచార రథాలకు జెండాలూపిన మేధావి మహాశయులు ఇప్పుడు తమ వద్దకు రావటం లేదు ఎందుకన్నారు. పదవులతో మైమరచిపోయారా అని సందేహించారు. రాహుల్, ప్రియాంక, రేవంత్‌లు ఇప్పుడు వచ్చి తమతో తిరిగి చాయ్ తాగాలని ఆహ్వానించటం మొదలుపెట్టారు.
అందుకు బదులుగా వారికి లభించిందేమిటి? నిర్బంధాలు, లాఠీచార్జీలు, అరెస్టులు. మూడు రోజుల క్రితం 7వ తేదీన ఏడాది నిండుగా పూర్తయినప్పుడు పత్రికలలో, బహిరంగ సభలలో ఉద్యోగ భర్తీలపై అబద్ధపు ప్రకటనలు. ఏడాదిలో కొత్తగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలన్న హామీ, వచ్చే నాలుగేండ్లలోనైనా నెరవేరుతుందో లేదో తెలియని పరిస్థితి. ప్రైవేట్ రంగంలో ఏదేదో జరగగలదంటూ మాత్రం రకరకాల హడావుడులు. ఆ విధమైన ఆశలు కల్పిస్తే నిరుద్యోగ యువతరం దృష్టి అటువైపు మళ్లి, తమ 2 లక్షల ఉద్యోగ హామీ దారుణ వైఫల్యాన్ని మరిచిపోగలరన్నది ఆశాభావం కావచ్చు. లేదా మోసపూరిత ఎత్తుగడ కావచ్చు. ప్రైవేట్ రంగం కావలసిందే. అది గతంలో ఉంది, ఇప్పుడుంది, మునుముందు కూడా ఉంటుంది. ఆ రంగంలో అవకాశాలకు తగిన విద్య, శిక్షణలు కల్పిస్తే ఆహ్వానించదగినదే. కానీ అది కూడా వివిధ పరిస్థితుల వల్ల పరిమితంగానే జరుగుతున్నట్టు ప్రపంచమంతటా, దేశమంతటా, ఇక్కడ కూడా కనిపిస్తున్నదే. కనుక, రేవంత్ ప్రభుత్వం యువతరానికి సరికొత్త భ్రమలు కల్పించటం సరికాదు. తమ ఎన్నికల హామీ విషయమై నిజాయితీగా మాట్లాడాలి.
అంతిమంగా తేలుతున్నదేమిటి? మొదట ఉండిన హంగామాలే ఏడాది గడిచినాక కూడా కనిపిస్తున్నాయి. పరిపాలనలో నేర్చిన అనుభవ పాఠాలు, నిజాయితీ, పరిణతి కన్పించటం లేదు. ఇదే స్థితి వ్యక్తిగత వ్యవహరణలోనూ ప్రతిఫలిస్తున్నది. దీనంతటికీ కారణం తన వ్యక్తిత్వంలోనే ఉన్న రకరకాల కొరతలు, లోపాలేమో తెలియదు.
– టంకశాల అశోక్