పశ్చిమ బెంగాల్లో 2016 అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస పరాజయాలు (రెండు అసెంబ్లీ, రెండు లోక్‌సభ ఎన్నికలు) ఎదురవుతున్నా బీజేపీ ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. మరో మూడు నెలల్లో జరిగే రాష్ట్ర 18వ శాసనసభ ఎన్నికల వేడి 2025 ఆఖరులోనే మొదలైంది. 2011 నుంచి అధికారంలో ఉన్న ముఖ్యమంతి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగెస్ (టీఎంసీ), కేందంలోని బీజేపీ నేతలు, కార్యకర్తల మధ్య రాష్ట్రంలో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) బెంగాల్లో మొదలైనప్పటి నుంచి ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ప్రకటనల యుద్ధంతోపాటు, కార్యకర్తల మధ్య హింసాత్మక ఘర్షణలు తప్పడం లేదు.
‘సర్’ సందర్భంగా జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ ఈనెల 19న బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ జరిపిన ఆందోళనలు, బీజేపీతో దాదాపు అన్ని జిల్లాల్లో గొడవలకు దారితీసింది. మరణించిన, వేరే ప్రదేశాలకు వెళ్లిపోయిన, రెండుచోట్ల ఓట్లున్న పౌరుల పేర్లు తొలగించాలని కోరుతూ ఎన్నికల సంఘం అధికారులకు ఫామ్ 7 సమర్పించడానికి రాజకీయపక్షాలకు తుది గడువు ఈనెల 19తో ముగియడంతో అదేరోజు ఈ రెండు పార్టీల మధ్య హింసకు దారితీసింది.
ముర్షీదాబాద్ సిటీలోని లాల్బాగ్ వద్ద 28 వేల ఫామ్ 7 పత్రాలతో వెళుతున్న బీజేపీ కార్యకర్తల వాహనాన్ని టీఎంసీ నేతలు అడ్డగించడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టీఎంసీ, వామపక్షాల సానుభూతిపరులైన వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించడానికి ఫామ్ 7ను బ్రహ్మాస్త్రంగా మార్చుకున్న బీజేపీ ఆగడాలను అడ్డుకోవడానికి టీఎంసీ, దాని బద్ధశత్రువైన పూర్వ పాలకపక్షం సీపీఎం కార్యకర్తలు పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో దుర్గాపూర్ ఎస్డీవో ఆఫీసు ముందు సంయుక్తంగా నిరసన పదర్శన జరిపారు.
అయోధ్యలో బాబ్రీ మసీద్-రామజన్మభూమి వివాదం నేపథ్యంలో హిందీ ప్రాంతాల్లో బలపడిన బీజేపీ బెంగాల్లో మాత్రం 1990లో జరిగిన అనేక ఎన్నికల్లో నామమాత్రపు ఉనికికే పరిమితమైంది. 1998 నుంచి వరుసగా 1999, 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాషాయపక్షం కేవలం ఒకటి, రెండు సీట్లు సాధించింది. అది కూడా రెండు ఎన్నికల్లో తృణమూల్ కాంగెస్తో పొత్తుతోనే కాస్త బలపడింది. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని కావడానికి దోహదం చేసిన 2014 ఎన్నికల సందర్భంగా బెంగాల్లో ఆయన పార్టీకి దక్కినవి రెండే రెండు సీట్లు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని పాలకపక్షం టీఎంసీ అప్పటికి 8 ఏండ్లుగా చేసిన పొరపాట్లు, కమ్యూనిస్టుల వైఫల్యం ఫలితంగా బీజేపీ 22 లోక్‌సభ సీట్లు కైవసం చేసుకుని తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించింది.
అయితే, 2016 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి దక్కినవి కేవలం 3 సీట్లే. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత తృణమూల్ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, ఎమ్మెల్యేల ఫిరాయింపులను పోత్సహించిన బీజేపీ, 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంతి అమిత్‌షా దూకుడు, ప్రోద్బలం, ధనబలంతో బరిలోకి దిగింది. ఈసారి బీజేపీకే అధికారం అనే రీతిలో సాగిన ఎన్నికల్లో ఆ పార్టీ బలం 3 నుంచి 77కు పెరిగింది. తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం 12 సీట్లకు పెరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఓట్ల శాతం 38 నుంచి 2024 ఎన్నికల్లో 39.8 శాతానికి పెరిగినా సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గడం విశేషం.
అయోధ్య రామాలయం పేరుతో యూపీ, ఎంపీ, రాజస్థాన్, బిహార్‌లో మాదిరిగా అధికారంలోకి రావడం బెంగాల్లో కుదరని పని అని బీజేపీకి అనుభవంలో తెలిసొచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి ఎన్నికల్లో ప్రయత్నం పెంచుతున్నది. బీజేపీ తన ఏకైక హిందుత్వ అజెండాతో ఇక్కడ ముందుకు సాగడం కష్టమని గత పదేండ్ల చరిత్ర రుజువు చేసింది. మొదటినుంచి అవిభక్త బంగ్లా ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువే అయినా ఇక్కడి హిందూ మతంలో గొప్ప సాంఘిక, ధార్మిక సంస్కరణలు తీసుకొచ్చిన రాజారామ్మోహన్ రాయ్ వంటి మహానుభావులు నడయాడారు.
బీజేపీ పూర్వరూపమైన భారతీయ జనసంఘ్ స్థాపక అధ్యక్షుడైన శ్యామా పసాద్ ముఖర్జీతోపాటు మరో నేత 1952లో లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ ఆ తర్వాత కాషాయాన్ని బెంగాలీ జనం ఆదరించలేదు. అంతేకాదు, ఒంటెత్తు పోకడలతో నియంతృత్వ విధానాలు ఆచరణలో చూపించిన కాంగెస్, వామపక్షాలను శాశ్వతంగా అధికారానికి దూరంగా పెట్టిన ఘన చరిత బెంగాలీలది. కాళీమాతను ఆరాధిస్తూ, తంత్ర వంటి భిన్నమైన హిందూ ధార్మిక పద్ధతులు అనుసరించే ఈ రాష్ట్ర ప్రజలను కేవలం రాముని పేరు చెప్పి మాయచేసి అధికారంలోకి రావడం సాధ్యం కాదని గత పదేండ్లలో నిరూపితమైంది.
1946 నుంచి తిరుగులేని అధికారం చెలాయించిన కాంగ్రెస్‌ను 1967, 69 ఎన్నికల్లో బెంగాలీలు ఓడించారు. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బాహాటంగా రిగ్గింగ్ చేసి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే 1977 నుంచి 2006 వరకు ఏడుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్‌ఫ్రంట్‌ను గెలిపిస్తూ వచ్చారు. కాంగెస్ ఎంతగా ప్రయత్నించినా మళ్లీ అధికారంలోకి రాలేకపోయింది.
34 సంవత్సరాలు వామపక్షాలను పాలకపక్షంగా అంగీకరించిన బెంగాలీ జనం కమ్యూనిస్టుల పాలన దిగజారడంతో 2011లో వాటిని ఓడించారు. ఆ ఎన్నికల్లో తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీ తిరుగులేని విజయం సాధించి ముఖ్యమంతి అయ్యాక కమ్యూనిస్టులు.. ముఖ్యంగా సీపీఎం జనాదరణను పోగొట్టుకున్నది. జనాకర్షక పథకాలతో ప్రజల మద్దతు సాధించిన ‘దీదీ’ని ఢీకొని, ఆమెను ఓడించాలనే తమ లక్ష్యాన్ని సాధించడానికి మోదీ, షా ద్వయం సహా బీజేపీ అగ్రనాయకత్వం ఎన్ని అప్రజాస్వామిక చర్యలకు పాల్పడినా వారి కల సాకారం కాలేదు.
తృణమూల్ ఎమ్మెల్యేలను కిందటి అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పెద్ద సంఖ్యలో తమ పార్టీలోకి ఫిరాయించేలా బీజేపీ కేంద్ర నాయకత్వం పన్నిన పథకాలు పెద్దగా ఉపయోగపడలేదు. కేంద్ర బలగాలను, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ నేర విచారణ సంస్థలను బీజేపీ సర్కారు బెంగాల్లో మమత, తృణమూల్ ప్రభుత్వం, మంత్రులపై విచక్షణారహితంగా ప్రయోగించింది. తృణమూల్ సర్కార్‌పై వచ్చిన ఆరోపణలు, కుంభకోణాలను శాసనసభ ఎన్నికల్లో తమ విజయానికి అనుకూలంగా మలుచుకోవడానికి కాషాయపక్ష నేతలు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు.
బెంగాల్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా 2021 అసెంబ్లీ ఎన్నికలను కేంద్రం ఎనిమిది దశల్లో నిర్వహించింది. కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో రాష్ర్టానికి రప్పించింది. చివరికి మమతా బెనర్జీని ఆమె పోటీ చేసిన రెండు సీట్లలో ఒకటైన నందిగ్రామ్ స్థానంలో తృణమూల్ మాజీ నేత సువేంద్రు అధికారిని ప్రయోగించి 1,956 ఓట్లతో ఓడించ గలిగింది బీజేపీ. అయితే, బీజేపీ బలం ఈ ఎన్నికల్లో 3 నుంచి 77కు పెరిగింది గానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 148 స్థానాలకు చాలా దూరంలో ఆగిపోయింది. కేంద్రంలో అధికారం, మతతత్వం, ధనబలం, జులుంతో పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడం కుదిరే పని కాదని గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సీపీఎం వంటి బలమైన కమ్యూనిస్టు పార్టీలకు బెంగాలీ జనం అర్థమయ్యేలా తమ ఓటుతో చెప్పగలిగారు.
రాష్ర్టాన్ని 34 ఏళ్లు నిరాటంకంగా పరిపాలించిన కమ్యూనిస్టుల మాదిరిగానే ప్రాంతీయపక్షమైన తృణమూల్ కాంగ్రెస్, ఈ పార్టీ నాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొన్ని అవాంఛనీయ పోకడలకు తెరతీసిన మాట వాస్తవమే. కానీ, రాబోయే బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం కలలో మాట అని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.
పదిహేనేండ్లుగా పరిపాలిస్తున్న తృణమూల్ ఏలుబడిలో లోపాలు, దోషాలు ఉన్నా.. బీజేపీ మతతత్వ పోకడలను సహించి ఈ పార్టీకి మెజారిటీ సీట్లు ఇచ్చే ఆలోచనలో బెంగాలీలు లేరని సర్వేలు తేల్చిచెప్పాయి. 2026 ఏప్రిల్, మేలో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఆశాభంగం తప్పదని క్షేతస్థాయి పరిస్థితులు సూచిస్తున్నాయి. మోదీ, షా ద్వయం అసెంబ్లీ ఎన్నికలను ఎన్ని దశల్లో జరిపించినా, రామాలయం, మతం కార్డును ప్రయోగించినా 294 స్థానాల్లో మెజారిటీ సీట్లు గెలవడం కమలనాథులకు సాధ్యమయ్యే పనికాదని బెంగాల్ రాజకీయాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు చెప్తున్నారు.
-నాంచారయ్య మెరుగుమాల