2023, డిసెంబర్ 7న రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తన మ్యానిఫెస్టోలో రైతులకు అనేక వాగ్దానాలు చేసింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రైతులతో పాటు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి సాయం, రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు, అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయడం, ప్రత్యేకించి వడ్లకు బోనస్ వాటిలో ప్రధానమైనవి. అంతేకాదు, ఈ హామీలన్నింటిని ఏడాదిలోపే పూర్తి చేస్తామని, అందుకనుగుణంగా ఒక్కో హామీ అమలుచేసే తేదీలను కూడా కాంగ్రెస్ ప్రకటించింది. కానీ, నేడు వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
గద్దెనెక్కిన వెంటనే రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఆ తర్వాత మాటమార్చింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ పూర్తి చేస్తామని మరో గడువు విధించింది. కానీ, ఆగస్టు 15 నాటికి 22,07,067 మంది రైతులు తీసుకున్న రూ.17,869.20 కోట్ల రుణాలనే మాఫీ చేసింది. ఆ తర్వాత 2024 నవంబర్‌లో 2.80 లక్షల మంది రైతుల రూ.2,860 కోట్ల రుణాలను మాఫీ చేసింది. అయితే, ప్రభుత్వ అంచనా ప్రకారం.. 41 లక్షల మంది రైతులు తీసుకున్న రూ.31 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయాలి. ఈ లెక్కన మాఫీకి నోచుకోని రైతులు ఇంకా లక్షల్లో ఉన్నారు. 2024-25కు సంబంధించి బ్యాం కర్ల కమిటీ పంట రుణాల కింద రూ.81,477.09 కోట్లు కేటాయించినప్పటికీ, వానకాలంలో రూ.27,485 కోట్లు మాత్రమే బ్యాంకు లు పంట రుణాలిచ్చాయి. దీంతో రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నది.
2018లో రైతుబంధును ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 వానకాలం నాటికి 65 లక్షల మంది రైతులకు రూ.79,714.49 కోట్ల పెట్టుబడి సాయం అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023-24కు యాసంగికి 69.86 లక్షల మందికి రూ.7,625.75 కోట్లు చెల్లించింది. కానీ, 2024-25 వానకాలం సీజన్ రైతుబంధును ఎగ్గొట్టి అన్నదా తల నడ్డి విరిచింది.
మద్దతు ధర చెల్లించి అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పిన కాంగ్రెస్.. ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయడం శోచనీయం. అది కూడా తేమ, నాణ్యతా ప్రమాణాలను సాకుగా చూపుతూ క్వింటాలుకు 5 కిలోల వరకు కోత పెడుతున్నారు. మార్కెట్‌కు ధాన్యం తీసుకెళ్తే 10 రోజుల వరకు అక్కడే నిరీక్షించాల్సి వస్తున్నది. ప్లాట్‌ఫామ్, టార్పాలిన్లు అందుబాటులో లేవు. ధాన్యం డబ్బులు సమయానికి అకౌంట్లలో జమకావడం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్ యార్డుల అభివృద్ధికి కనీసం రూ.500 కోట్లు కేటాయించాలి. మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా మద్దతు ధరపై వరికి రూ.500, మక్కజొన్నకు రూ.330, కందులకు రూ.400, సోయాకు రూ.450, పత్తికి రూ.475, జొన్నలకు రూ.292 బోనస్ ఇవ్వాలి. అంతేకాదు, క్వింటాలుకు మిరప రూ.15 వేలు, పసుపు రూ.12 వేలు, ఎర్రజొన్న రూ.3,500, చెరుకు రూ.4 వేలు చొప్పున కొనుగోలు చేయాలి. ఇచ్చిన హామీకి విరుద్ధంగా సన్నాలకు మాత్రమే ప్రభుత్వం బోనస్ ఇస్తున్నది. మొత్తం వడ్లలో ఈ రకం 30 శాతమే. తద్వారా చాలామంది రైతులు బోనస్ నష్టపోతున్నారు.
ఈ ఏడాది తుఫాన్ కారణంగా 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని పాలకులు ప్రకటించారు. కానీ, రూ.95.38 కోట్లు మాత్రమే విడుదల చేయడం విడ్డూరం. దేశంలోని 14 రాష్ర్టాలకు రూ.5,858.60 కోట్లను కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు రూ.416.80 కోట్లు మాత్రమే కేటాయించింది. ఎకరాకు కనీసం రూ.20 వేలు సహాయం అందించాలి.
ప్రజా పాలనలో వచ్చిన 1.28 కోట్ల దరఖాస్తుల్లో 70 లక్షల వరకు భూ సమస్యలకు సంబంధించినవే. వాటిని పరిష్కరించేందుకు రోజుల పాటు ప్రభు త్వం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం నిర్వహించింది. కానీ, సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు.
లక్షల మంది రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాలు, సివిల్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, వాస్తవ సాగుదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. కౌలుదారులకు హక్కులు కల్పించాలి. రాష్ర్టానికి వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలి. తెలంగాణను దిగుమతుల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో హార్టికల్చర్ విస్తీర్ణం 12 లక్షల ఎకరాల నుంచి 25 లక్షల ఎకరాలకు పెరిగింది. కానీ, హార్టికల్చర్, పామాయిల్‌కు రూ.227.38 కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్రంలో నకిలీ విత్తన వ్యాపారం జోరుగా సాగుతున్నది. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు సంస్థాగతంగా, చట్టపరంగా చర్యలు చేపట్టాలి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మ్యానిపెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను నెరవేర్చాలి. ప్రధానంగా రైతుల ఆత్మహత్యల నివారణకు కౌలుదారులకు చట్టపరమైన రక్షణ కల్పించాలి. 65 ఏండ్లు దాటిన రైతులకు పింఛన్ ఇవ్వాలి. రైతు బీమా అర్హత వయస్సును 18-70 ఏండ్లకు పెంచాలి. జిల్లా స్థాయిలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలి.
– మూడ్ శోభన్ 99497 25951