మైనారిటీల పట్ల నిజమైన అభిమానం ఉండటం వేరు. వారిని వాడుకుని వదిలేయడం వేరు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి తరహాకు చెందిన నేత అయితే, కాంగ్రెస్ రెండో రకానికి చెందిన పార్టీ అని చెప్పాలి. స్వరాష్ర్టాన్ని సాధించి, ఆపై సారథిగా బాధ్యతలు వహించి అన్నిరంగాలను అంగలు వేయించిన చరిత్ర కేసీఆర్‌ది. మైనారిటీలకు మన సమాజంలో ఉన్న స్థానమేమిటో, వారి స్థితిగతులేమిటో సరైన అవగాహన ఉన్న నేత కనుకనే నిజమైన, నిఖార్సయిన అభ్యున్నతికి పునాదులు వేశారు. నిరుపేద మైనారిటీలను దృష్టిలో పెట్టుకుని ఆయన అనుసరించిన విధానాలు, అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శమైనవి. 2014కు ముందు, తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకుంటే మనకు కేసీఆర్ తెచ్చిన మార్పు ఏమిటో కండ్లకు కడుతుంది. కేవలం డజనుకు పరిమితమైన మైనారిటీ గురుకులాల సంఖ్య బీఆర్ఎస్ పాలనలో పదహారింతలు పెరిగి 192కు చేరుకున్నది.
విద్యార్థుల సంఖ్య 5,760 నుంచి 97,920కు పెరగడం మైనారిటీ బిడ్డలకు చదువు ఎంతగా అందుబాటులోకి వచ్చిందనేది తెలియజేస్తున్నది. మైనా రిటీ పిల్లలకు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద 2,210 మందికి రూ.20 లక్షల చొప్పున సమకూర్చారు. 2013-14లో మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన నిధులు కేవలం రూ.509 కోట్లు కాగా, తొమ్మిదిన్నరేండ్ల కాలం లో కేసీఆర్ ప్రభుత్వం రూ.పది వేల కోట్లు ఖ ర్చు చేసింది. తలసరి కేటాయింపులో యూపీతో సహా దేశంలోని ఇతర ఏ రాష్ట్రమూ తెలంగాణ దరిదాపులో లేకపోవడం గమనార్హం.
మైనారిటీల కోసం బహుముఖ వ్యూహంతో కేసీఆర్ సర్కారు విభిన్నమైన చర్యలు చేపట్టింది. మౌజమ్, ఇమామ్‌లకు నెలనెలా రూ.5 వేలు చెల్లించింది. నిరుపేద మైనారిటీ కుటుంబాల్లో ఆడబిడ్డల పెండ్లి భారం కారాదనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ పథకం అపూర్వమైనది. ఒక్కో బేటీ (బిడ్డ) పెండ్లి కోసం రూ.లక్షా నూటపదహార్లు చొప్పున రూ.2,258 కోట్లు అందజేసింది. 2,68,230 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. రంజాన్ వేడుకలను ఏటా అధికారికంగా నిర్వహించి కేసీఆర్ సర్కార్ ‘తోఫా’లను అందజేసింది. ఓబీసీ ముస్లిం మైనారిటీ వర్గాల వారికి రిజర్వేషన్లను 4 శాతం నుంచి ఏకంగా 12 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయించిన ఘనత బీఆర్ఎస్కే దక్కింది. పెదవితీపి మాటలతో సరిపెట్టకుండా మైనారిటీ సంక్షేమాన్ని కేసీఆర్ ఆచరణలో చేసి చూపించారు. మైనారిటీలపై నిజమైన ప్రేమంటే ఇదీ.
సుదీర్ఘకాలం కేంద్రంలో, రాష్ట్రంలో అధికా రం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఏం చేసిందనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ ఏదైనా చేసి ఉంటే మైనారిటీలు అంతటి దీనస్థితిలో ఎందుకున్నారనేది మరో ప్రశ్న. చెప్పుకోవాలంటే కేసీఆర్ తెచ్చిన షాదీ ముబారక్ వంటి పథకం ఇన్నేండ్లలో ఒక్కటంటే ఒక్కటి ప్రవేశపెట్టలేదు. బుజ్జగింపు రాజకీయాలతోనే మైనారిటీల ప్రయోజనాలను బలిపెట్టింది. వేలంపాట తరహాలో కేసీఆర్ ఇచ్చినదానికంటే ఎక్కువ ఇస్తామని మ్యానిపెస్టోలో ఊరించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ తనదైన శైలిలో చేయిచ్చింది. కేసీఆర్ ఇచ్చినవీ ఇవ్వకుండా మొండిచేయి చూపింది. అలాంటిది ఇప్పుడు ఉపఎన్నికల్లో ఓట్లు కాజేసేందుకు ముస్లింలను మరోసారి రకరకాలుగా ఊరిస్తున్నది. అయినా దారికి రారేమోననే అపనమ్మకంతో బెదిరింపులకు, అవమానాలకు కాంగ్రెస్ తెగబడుతున్నది.
ఆత్మాభిమానం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి ‘కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై, కాంగ్రెస్ హై తో తుమ్హారా ఇజ్జత్ హై. కాంగ్రెస్ నహీ తో ఆప్ కుచ్ నహీ’ (కాంగ్రెస్ ఉంటే ముస్లింలు ఉంటారు. కాంగ్రెస్ ఉంటేనే మీకు ఇజ్జత్ ఉంటుంది. కాంగ్రెస్ లేకపోతే ఏమీ ఉండదు) అనడం ముస్లింల అస్తిత్వాన్ని అవమానించడం తప్ప మరేమీ కాదు. శుష్కప్రియాలు, శూన్య హస్తాలతో మైనారిటీలను ఓటుబ్యాంకుగా మార్చుకుని కాంగ్రెస్ తాను లబ్ధి పొందింది తప్ప, మైనారిటీలకు చేసిందేమీ లేదు. హడావుడిగా ఆఖరి నిమిషంలో అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టి కుచ్చుటోపీ పెట్టేందుకు సిద్ధమైంది. మైనారిటీలు తమ నిజమైన హితుడెవరో, అవసరం తీరగానే టోకరా ఇచ్చే మోసకారి ఎవరో తెలుసుకోలేనంత అమాయకులు కారు. వారిని ప్రతిసారీ మోసం చేయడం కుదరదని కురువృద్ధ పార్టీ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.